విద్యార్థిని మృతదేహానికి రీ పోస్టుమార్టం

ABN , First Publish Date - 2022-07-19T13:35:26+05:30 IST

కళ్లకుర్చి జిల్లా చిన్నసేలంలోని ప్రైవేటు పాఠశాల విద్యార్థిని శ్రీమతి మృతదేహానికి మళ్ళీ పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. పోస్టుమార్టాన్ని

విద్యార్థిని మృతదేహానికి రీ పోస్టుమార్టం

- హింసాకాండపై కఠిన చర్యలు చేపట్టండి

- హైకోర్టు ఆదేశం

- పథకం ప్రకారమే విధ్వంసం జరిగినట్లుందని వ్యాఖ్య


చెన్నై, జూలై 18 (ఆంధ్రజ్యోతి): కళ్లకుర్చి జిల్లా చిన్నసేలంలోని ప్రైవేటు పాఠశాల విద్యార్థిని శ్రీమతి మృతదేహానికి మళ్ళీ పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. పోస్టుమార్టాన్ని వీడియో తీసి భద్రపరచాలని, విద్యార్థిని అంత్యక్రియలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, ఆదివారం ఆ పాఠశాల వద్ద జరిగిన హింసాకాండకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి తేల్చి చెప్పింది. రీ పోస్టుమార్టం నిర్వహించేందుకు ఫోరెన్సిక్‌ విభాగం మాజీ డైరెక్టర్‌ శాంతకుమారి నాయకత్వంలో విల్లుపురం, తిరుచ్చి, సేలంకు చెందిన వైద్యనిపుణులు డాక్టర్‌ గీతాంజలి, డాక్టర్‌ జయంతి, డాక్టర్‌ గోకులనాథన్‌తో కూడిన కమిటీని నియమించింది. హింసాకాండ జరిగిన తీరును పరిశీలిస్తే ఓ పథకం ప్రకారం జరిగినట్లు అవగతమవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది శ్రీమతి మృతదేహానికి మళ్ళీ పోస్టుమార్టం జరిపి, ఉన్నత స్థాయి న్యాయవిచారణ జరిపించాలని కోరుతూ ఆమె తండ్రి రామలింగం దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ సతీ్‌షకుమార్‌ ముందు సోమవారం ఉదయం విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి పిటిషనర్‌తో సహా వివిధ విభాగాల వారిని సూటిగా నిలదీశారు. ‘‘ఆదివారం ఉదయం ఆ పాఠశాల వద్ద ఆందోళన జరిపేందుకు ఎవరు అనుమతించారు? హింసకు పాల్పడింది ఎవరు? హింస వెనుక ఉన్న కుట్ర ఎవరిది? హింసను ప్రేరేపించింది ఎవరు? హింసాకాండకు సంబంధించి ఇంటెలిజెన్స్‌ శాఖ తీసుకున్న చర్యలు ఏమిటి? కోర్టులో న్యాయవిచారణ కోరుతూ పిటిషన్‌ వేసిన తరువాత ఆందోళన జరపాల్సిన ఆవశ్యకత ఏంటి?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ పాఠశాల వద్ద జరిగిన హింసాకాండ అప్పటికప్పుడు జరిగినట్లులేదని, ఓ పథకం ప్రకారమే హింసాకాండ సాగినట్లుందని కటువుగా వ్యాఖ్యానించారు. హింసాకాండకు సంబంధించిన వీడియోల ఆధారంగా నేరస్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హింసకు పాల్పడినవారిని గుర్తించి జరిగిన నష్టాన్ని వారి నుంచే వసూలు చేయాలని పోలీ్‌సశాఖను ఆదేశించారు. ప్రైవేటు పాఠశాల ప్రాంగణంలో ట్రాక్టర్‌ను నడిపి పాఠశాల బస్సులను ఢీకొట్టించి ధ్వంసం చేయడమే హింసాకాండ తీవ్ర రూపం దాల్చటానికి ప్రధానకారణమన్నారు. ఇక రీ పోస్టుమార్టం జరిగిన తర్వాత విద్యార్థిని శ్రీమతి మృతదేహాన్ని కుటుంబీకులు ఎలాంటి గొడవకు దిగకుండా స్వీకరించాలని, ఆమె అంత్యక్రియలు భారీ భద్రత మధ్య ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు. రీ పోస్టుమార్టం జరిగే సమయంలో విద్యార్థిని తండ్రిని, ఆయన తరఫు న్యాయవాదిని వెంట తీసుకెళ్లాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు.


మరో ఇద్దరు టీచర్ల అరెస్టు

విద్యార్థిని శ్రీమతి మృతి సంఘటనకు సంబంధించి శక్తి ఇంటర్నేషనల్‌ స్కూలుకు చెందిన మరో ఇద్దరు టీచర్లను సోమవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఆదివారం రాత్రి ఆ స్కూలు కరస్పాండెంట్‌ రవికుమార్‌ (48), కార్యదర్శి శాంతి (44), ప్రిన్సిపాల్‌ శివశంకరన్‌ (57)ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఆ పాఠశాలలో పనిచేస్తున్న కెమిస్ట్రీ టీచర్‌ హరిప్రియ, మేథ్స్‌ టీచర్‌ కీర్తికను పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఆదివారం జరిగిన హింసాకాండకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకూ 309 మందిని అరెస్టు చేశారు. ఇదే విధంగా విద్యార్థిని మృతి నేపథ్యంలో హింసను ప్రేరేపించేలా సామాజిక ప్రసారమాధ్యమాల్లో విమర్శలు చేసిన పెరంబలూరు అన్నాడీఎంకే నేతలు సూర్య, దీపక్‌, సుభా్‌షను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా వుండగా ఆందోళనకారుల వల్ల విధ్వంసానికి గురైన చిన్న సేలం శక్తి ఇంటర్నేషనల్‌ స్కూలును రాష్ట్ర మంత్రులు ఏవీ వేలు, అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి, సీవీ గణేశన్‌, శాసనసభ్యుడు ఉదయసూర్యన్‌ తదితరులు సోమవారం ఉదయం పరిశీలించారు. స్కూలు వద్ద భద్రతా విధుల్లో వున్న పోలీసుల వద్ద వివరాలు తెలుసుకున్నారు. కాగా చిన్నసేలంలో ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా వుందని పోలీస్‏శాఖ ప్రకటించింది.

Updated Date - 2022-07-19T13:35:26+05:30 IST