మొండిగా టైఫాయిడ్‌ బాక్టీరియా

ABN , First Publish Date - 2022-06-24T20:34:18+05:30 IST

టైఫాయిడ్‌ జ్వరాన్ని కలిగించే బాక్టీరియా నానాటికీ యాంటీ బయోటిక్స్‌కు కూడా లొంగని మొండి బాక్టీరియాగా మారుతున్నాయని అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు

మొండిగా టైఫాయిడ్‌ బాక్టీరియా

 యాంటీబయోటిక్స్‌కు లొంగని విధంగా నిరోధక శక్తిని పెంచుకుంటున్న వైనం


బోస్టన్‌, జూన్‌ 22: టైఫాయిడ్‌ జ్వరాన్ని కలిగించే బాక్టీరియా నానాటికీ యాంటీ బయోటిక్స్‌కు కూడా లొంగని మొండి బాక్టీరియాగా మారుతున్నాయని అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. తమ అధ్యయనం కోసం 2014 నుంచి 2019 మధ్యలో భారత్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, పాకిస్థాన్‌ దేశాల్లోని టైఫాయిడ్‌ కేసులకు సంబంధించిన రక్త నమూనాలను సేకరించిన పరిశోధకులు, మొత్తం 3489 ఎస్‌ టైఫీ బాక్టీరియాలను వాటి నుంచి వేరు చేసి జన్యు అనుక్రమణాన్ని(జినోమ్‌ సీక్వెన్సింగ్‌) నిర్వహించారు. 1905 నుంచి 2018 వరకూ 70 దేశాల నుంచి సేకరించిన 4169 ఎస్‌ టైఫీ నమూనాలను కూడా వారు పరిశీలించారు. వారి అధ్యయనంలో.. ఎస్‌ టైఫీ బాక్టీరియా 1990 తర్వాత కనీసం 197 సార్లు దేశాల మధ్య వ్యాపించిందని తేలింది. ఇక పలు నమూనాల్లో యాంటీ బయోటిక్‌ ఔషధాలకు తట్టుకోగల లక్షణం కనిపించినట్లు తెలిపారు. అధికంగా ఉపయోగించే అజిత్రోమైసిన్‌ ఔషధంపై పైచేయి సాధించేందుకు బాక్టీరియా 20 ఏళ్లలో 7సార్లు ఉత్పరివర్తనం చెందిందన్నారు. మూడవ తరం యాంటీబయోటిక్‌ ఔషధం సెఫలోస్‌పోరిన్స్‌ను అడ్డుకునే ఎస్‌ టైఫీ బాక్టీరియా కూడా విస్తృతంగా వ్యాపిస్తోందని చెప్పారు. మరింత స్పష్టత కోసం ఆఫ్రికా దేశాల్లోని ఎస్‌ టైఫీలనూ అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. 

Updated Date - 2022-06-24T20:34:18+05:30 IST