Abn logo
Sep 26 2021 @ 00:14AM

శివరత్నానికి మొండిచేయి

ఇచ్చిన హామీని గాలికొదిలేసిన వైసీపీ అధిష్ఠానం

సామాజికవర్గాల లాబీదే పైచేయి

విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):  జడ్పీ పీఠంపై జీకేవీధి జడ్పీటీసీ సభ్యురాలు కిముడు శివరత్నానికి వైసీపీ అధిష్ఠానం మొండిచేయి చూపింది. 2019 ఎన్నికల్లో శివరత్నం భర్త విశ్వేశ్వరరాజుకు పార్టీ అధినేత జగన్‌మోహనరెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయలేదు. సరికదా కనీసం విశ్వేశ్వరరాజును, అతని సతీమణి శివరత్నాన్ని బుజ్జగించే ప్రయత్నం కూడా చేయలేదు. అధిష్ఠానం ఎప్పుడు హామీ ఇచ్చిందని పార్టీ నేతలు ఎదురు ప్రశ్న వేయడంతో విశ్వేశ్వరరాజు దంపతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏజెన్సీలో బలమైన బగత సామాజిక వర్గానికి చెందిన విశ్వేశ్వరరాజు సతీమణికి జడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశం ఇస్తే రాజకీయంగా బలపడతారని భావించిన ఏజెన్సీలో  నేతలు అప్రమత్తమయ్యారు. వారిలో వారికి విభేదాలున్నా... శివరత్నానికి వ్యతిరేకంగా తాత్కాలికంగా ఒక్కటయ్యారనే ప్రచారం సాగుతోంది. దీనికి ఇద్దరు మాజీ మంత్రులు కూడా జత కలిశారని పార్టీలో విస్తృత ప్రచారం ఉంది. మూడు ప్రధాన సామాజికవర్గాలకు చెందిన వారికి పదవులున్నాయని, అందువల్ల పీటీజీకి చెందిన సుభద్రకు ఇవ్వాలని కూడబలుక్కుని, అధిష్ఠానం వద్ద ప్రతిపాదించడంతో సుభద్రకు అవకాశం దక్కిందని చెబుతున్నారు. శనివారం ఉదయం మంత్రి ముత్తంశెట్టి, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు గ్రాండ్‌బే హోటల్‌లో సమావేశమయ్యారు. అక్కడ జడ్పీటీసీల పరిచయ కార్యక్రమం నిర్వహించారు అయితే చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఎవరన్నది చెప్పలేదు. అప్పటికే ఎమ్మెల్యే ఒకరు ఉదయమే కలెక్టర్‌ను కలిసి సుభద్రపేరుతో  బి.ఫారం అందజేశారు. ఈ విషయం ఎక్కడా పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. కాగా 12 గంటల సమయంలో సుభద్ర, అరకు ఎమ్మెల్యే ఫాల్గుణ, మరికొందరు తొలుత జడ్పీ హాలుకు వచ్చారు. తరువాత శివరత్నాన్ని తీసుకుని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఒక వాహనంలో రావడంతో పార్టీలో గుసగుసలు వినిపించాయి. శివరత్నాన్ని బుజ్జగించి తీసుకువచ్చే బాధ్యత భాగ్యలక్ష్మికి అప్పగించారని పార్టీనేతలు భావించారు. అయితే హాల్లోకి వచ్చిన శివరత్నం తన సీటులో దిగాలుగా కూర్చుకున్నారు. మధ్యాహ్నం మూడుగంటలకు జడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నికను కలెక్టర్‌ ప్రకటించగానే సుభద్ర పేరు బిఫారంలో ఉందని ఎమ్మెల్యేలు చెప్పారు. ఈ సందర్భంగా సుభద్ర పేరును ప్రతిపాదించడం లేదా బలపరిచే అవకాశాన్ని కూడా శివరత్నానికి ఇవ్వలేదు.  సుభద్ర ఎన్నిక తరువాత అందరూ ఆమెను అభినందించారు. అయితే  ఏజెన్సీ ప్రజాప్రతినిధులు కూడా శివరత్నాన్ని పట్టించుకోలేదు. కాగా ఏజెన్సీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి ఆలస్యంగా హాలులోకి వచ్చి, చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఎవరన్నది ఇక్కడకు వచ్చేవరకు తెలియదని మాట్లాడడం కొసమెరుపు.