రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు వడివడిగా

ABN , First Publish Date - 2021-12-19T05:33:09+05:30 IST

రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణ ప్రక్రియ వేగవంతమైంది. ఉత్తర భాగంలో నిర్మించే రోడ్డు అలైన్మెంట్‌కు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదముద్ర వేసింది. 157.2 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.7900కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధమయ్యా యి.

రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు వడివడిగా

వేగవంతమైన ప్రక్రియ

ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణకు కేంద్రం ఆమోదం

157కి.మీ రహదారికి మార్గం సుగమం


చౌటుప్పల్‌ : రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణ ప్రక్రియ వేగవంతమైంది. ఉత్తర భాగంలో నిర్మించే రోడ్డు అలైన్మెంట్‌కు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదముద్ర వేసింది. 157.2 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.7900కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధమయ్యా యి. సంగారెడ్డి జిల్లా నుంచి నర్సాపూర్‌, తూప్రాన్‌, గజ్వేల్‌, యాదాద్రి భువనగిరి, చౌటుప్పల్‌ వరకు రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేపట్టాలని రాష్ట్ర  ప్రభుత్వాని కి కేంద్రం లేఖ రాయడంతో ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రక్రియ మరింత ఊపందుకుంది.


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించే రీజినల్‌ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) 8 జిల్లాలు, 25 పట్టణాలు, 300 గ్రామాల మీదుగా సాగనుంది. మొత్తం 340కి.మీ పొడవున నిర్మించనున్న ఆర్‌ఆర్‌ఆర్‌కు రూ.16241కోట్లు వ్యయం కానుంది. అందుకు సుమా రు 9,265 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంటుంది. ఈ రోడ్డు సం గారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, భువనగిరి, నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల మీదుగా వెళ్లనుంది. రాష్ట్ర జనాభాలో 40శాతం మంది ఈ ఆర్‌ఆర్‌ఆర్‌ వెంట ఉన్న పల్లెల్లో నివాసముంటున్నారు. మొత్తం రెండు భాగాలుగా నిర్మించనున్న ఈ రోడ్డుకు సంబంధించి తొలి విడతలో హైదరాబాద్‌కు ఉత్తర ప్రాంతానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ రోడ్డు రూ.157.2కి.మీ మేర సంగారెడ్డి, నర్సాపూర్‌, తూప్రాన్‌, గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌, భువనగిరి, చౌటుప్పల్‌ వరకు నిర్మించనున్నారు. రెండో దశలలో హైదరాబాద్‌కు దక్షిణ ప్రాంతంలోని కంది నుంచి చౌటుప్పల్‌ వరకు 182కి.మీ మేర నిర్మించేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది.


భూసేకరణకు కసరత్తు

రీజనల్‌ రింగ్‌ రోడ్డు మొదటి దశ అలైన్‌మెంట్‌ను కేంద్ర ప్రభు త్వం ఆమోదించడంతో త్వరలో భూసేకరణ పనులు ప్రారంభంకానున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ రోడ్డును నాగ్‌పూర్‌కు చెందిన కేఅండ్‌జే కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ చేపట్టనుంది. దీనికి సంబంధించి భూసేకరణ చేయాలని, కేంద్ర ప్రభు త్వం తాజాగా రాష్ట్రప్రభుత్వానికి లేఖరాయడంతో భూసేకరణకు మార్గం సుగమమైంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. భూసేకరణకు సంబంధించి ప్రత్యేక విభాగాలను ఏర్పా టు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 157.2కి.మీ మేర ఉత్తర భా గంలో తొలి దశ నిర్మించనున్న ఈ రోడ్డు కోసం ఇప్పటికే జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌ఎహెచ్‌ఏ), కాంట్రాక్టు సంస్థ పలు అంశాల పై కసరత్తు ప్రారంభించింది. రహదారి మార్గం వెళ్లే ప్రాంతాల్లో జిల్లాను యూనిట్‌గా తీసుకోవాలా లేక నిర్దేశించిన కిలోమీటర్లకు ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయాలా అనే దానిపై సంప్రదింపులు చేస్తున్నారు. రహదారి నిర్మాణంతో భూములు కోల్పోనున్న వారికి ఎంత మొత్తం పరిహారం చెల్లించాలనే దానిపై రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, ఇతర అధికార యంత్రాంగంతో సంప్రదింపులు  ప్రారంభించింది. ఉన్నత స్థాయిలో దీనికి సంబంధించి విధివిధానాలు ఖరారుకానున్నాయి.


అభివృద్ధిపై ఆశలు

రీజనల్‌  రింగ్‌ రోడ్డు నిర్మాణానికి సంబంధించి భూ సేకరణకు క్రేంద ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ వెళ్లే పరిసర ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఇక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే రహదారి తమ ఊరి మధ్య నుంచి వెళ్తుందని కొందరు, గ్రామ శివారు నుంచి వెళ్తుందని కొందరు ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు. ఏది ఏమైనా ఆర్‌ఆర్‌ఆర్‌తో ఈ ప్రాంతానికి మహర్దశ పడుతుందని భావిస్తున్నారు. అంతేగాక లక్షల్లో ఉన్న భూముల ధరలు రూ.కోట్లలోకి వెళ్తాయని రైతులు అంటున్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు ప్రక్రియకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్తుండడంతో రహదారి ప్రతిపాదిత పరిసర ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకోనుంది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో రియల్‌ వెంచర్లు ఉండగా, మరికొన్ని రియల్‌ సంస్థలు ఇక్కడ వెంచర్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.



భూ సేకరణ తర్వాతే టెండర్లు

రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను పూర్తి చేస్తే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో  చేపట్టనున్న ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా నిర్మాణ పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేస్తోంది. భూసేకరణ వ్యవహారం కొలిక్కి వచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. గతంలో భూసేకరణతోపాటు టెండర్ల ప్రక్రియ చేపట్టేవారు. దీంతో భూసేకరణలో భూములు కోల్పోయిన వారు ఆశించిన స్థాయిలో పరిహారం రాలేదని కోర్టును ఆశ్రయించేవారు. కోర్టు వ్యవహారంతో టెండర్ల ప్రక్రియలో జాప్యం ఉండేది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో ముందుగా భూసేకరణను పూర్తిచేయనున్నారు. భూసేకరణ పూర్తయిన వెంటనే రోడ్డు నిర్మాణ పనులకు టెండర్లను ఆహ్వానించి సంబంధిత కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించనున్నారు.

Updated Date - 2021-12-19T05:33:09+05:30 IST