Abn logo
Sep 26 2021 @ 23:57PM

పోరాటాలతోనే స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట

దీక్షా శిబిరంలో మంత్రి రాజశేఖర్‌, తదితరులు

ఐఎన్‌టీయూసీ జిల్లా నాయకులు మంత్రి రాజశేఖర్‌, నాగభూషణం

వర్షంలోనూ కొనసాగిన దీక్షలు

సిరిపురం, సెప్టెంబరు 26: నిరంతర పోరాటలతోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలువరించగలమని ఐఎన్‌టీయుసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మంత్రి రాజశేఖర్‌, భోగవిల్లి నాగభూషణం పేర్కొన్నారు. విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొనసాగుతున్న దీక్షల్లో ఆదివారం వర్షంలోనూ ఐఎన్‌టీయుసీ, హెచ్‌పీసీఎల్‌ కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాభాల్లో నడుస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రైవేటీకరించడం శోచనీయమన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను, కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా తయారుచేసిన నాలుగు కార్మిక కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను, నిత్యావసరాల వస్తువుల రేట్లను తగ్గించాలన్నారు. తమ డిమాండ్లను కేంద్రం పరిష్కరించేంత వరకు పోరాటాలను కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో కార్యదర్శి టి.సాంబశివరావు, హెచ్‌పీసీఎల్‌ కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఎస్‌.తాతబాబు, పి.వెంకట అప్పారావు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.