సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై సమరం

ABN , First Publish Date - 2022-06-30T09:07:19+05:30 IST

ఒకసారి వినియోగించి పడేసే(సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది.

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై సమరం

రేపటి నుంచి దేశవ్యాప్తంగా నిషేధం

రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం

న్యూఢిల్లీ, జూన్‌ 29: ఒకసారి వినియోగించి పడేసే(సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. శుక్రవారం(జూలై 1) నుంచి ఈ వస్తువులు ఏ రూపంలో ఉన్నా వినియోగించరాదని స్పష్టం చేసింది. సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌పై విధించిన నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 2021 నాటి ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ సవరణ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని నిర్దేశించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్‌ నిరోధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్న కేంద్రం, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ రవాణా, తయారీ, నిల్వ, వినియోగం, విక్రయంపై తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరింది. అంతర్రాష్ట్ర రవాణాపై ఉక్కుపాదం మోపాలని, రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచాలని సూచించింది. అదేవిధంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ తయారీని పూర్తిగా నిషేధిస్తున్నట్టు తెలిపింది. అక్రమ తయారీ, దిగుమతి, నిల్వలు, పంపిణీ, అమ్మకం, వినియోగంపై డేగకన్ను సారించేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను నియమించనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం 75 మైక్రానుల కన్నా తక్కువ మందం ఉన్న సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులపై నిషేధం విధించిన కేంద్రం.. ఈ ఏడాది డిసెంబరు 31 నుంచి 120 మైక్రానుల మందం ఉన్న వస్తువులపై కూడా నిషేధం విధించనున్నట్టు తెలిపింది. 


ఒకేసారి వద్దు: పారిశ్రామిక వర్గాలు

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై ఒకేసారి నిషేధం విధించడం సరికాదని థెర్మోఫార్మర్స్‌ అండ్‌ అలైడ్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌(టీఏఐఏ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. వినియోగంపై నిషేధాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే.. ఒకేసారి కాకుండా దశలవారీగా దీనిని జూలై 1 నుంచి అమలు చేయాలని కోరింది. కప్పులు, గ్లాసుల తయారీ పరిశ్రమపై ఆధారపడి  ప్రత్యక్షంగా.. 2 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, పరోక్షంగా మరో 4.5 లక్షల మంది జీవిస్తున్నారని అసోసియేషన్‌ తెలిపింది. ఒకేసారి నిషేధించడం వల్ల రూ.10 వేల కోట్ల పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అదేవిధంగా బేవరేజ్‌ పరిశ్రమ వర్గాలు కూడా దశల వారీగా నిషేధాన్ని అమలు చేయాలని కోరాయి. ఆ విన్నపాలపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ పరోక్షంగా స్పందించారు. నిషేధం గురించి 11 నెలల ముందే హెచ్చరించామని, ఇది చాలా ఎక్కువ సమయమని ఆయన అన్నారు. క్యారీ బ్యాగులు, 75 మైక్రానుల మందం కన్నా తక్కువున్న ప్లాస్టిక్‌ వస్తువులు, ప్లాస్టిక్‌ బాటిళ్లు, ఇయర్‌ బడ్స్‌, పుల్లలు, జెండాలు, ఐస్‌క్రీమ్‌ పుల్లలు, డెకరేషన్‌కు వినియోగించే థర్మోకోల్‌ షీట్లు, ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్క్స్‌, చెంచాలు, స్ట్రాలు, స్వీటు బాక్సులు, సిగరెట్‌ పెట్టెలకు చుట్టే కవర్లు, ప్లాస్టిక్‌ ఆహ్వాన పత్రికలు, పీవీసీ బ్యానర్లు వంటి వస్తువులపై నిషేధం వర్తిస్తుంది.

Updated Date - 2022-06-30T09:07:19+05:30 IST