పోరాడి.. సాధించి

ABN , First Publish Date - 2022-08-15T06:08:02+05:30 IST

సిక్కోలు అంటే పోరాటాల పురిటి గడ్డ. అరసవల్లి, శ్రీకూరం, శ్రీముఖలింగం వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిలయం. శాలిహుండం, దంతపురి, జగతి మెట్ట, పాండవుల మెట్ట వంటి పర్యాటక ప్రాంతాలు ఇక్కడ నెలవయ్యాయి. వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా వంటి నదులు ప్రవహించే నేల ఇది. స్వాంతంత్య్ర సమరయోధులు, రాజకీయవేత్తలు, రంగస్థల, సంగీత కళాకారులు, వంటి ఎందరో ప్రముఖులకు జన్మనిచ్చిన గడ్డ. ఇంతటి ఘన కీర్తి గల జిల్లా.. ఎందరో పోరాటాలు, కృషి ఫలితంగా ఏర్పడింది.

పోరాడి.. సాధించి

 సిక్కోలు ఏర్పాటుకు శ్రమించిన నాటి ప్రముఖులు
 స్వాతంత్య్ర ఉద్యమ సమయంలోనూ డిమాండ్‌
 చివరకు తలొగ్గిన అప్పటి ప్రభుత్వం
 నేడు జిల్లా ఆవిర్భావ దినోత్సవం
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

సిక్కోలు అంటే పోరాటాల పురిటి గడ్డ. అరసవల్లి, శ్రీకూరం, శ్రీముఖలింగం వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిలయం.  శాలిహుండం, దంతపురి, జగతి మెట్ట, పాండవుల మెట్ట వంటి పర్యాటక ప్రాంతాలు ఇక్కడ నెలవయ్యాయి. వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా వంటి నదులు ప్రవహించే నేల ఇది. స్వాంతంత్య్ర సమరయోధులు, రాజకీయవేత్తలు, రంగస్థల, సంగీత కళాకారులు, వంటి ఎందరో ప్రముఖులకు జన్మనిచ్చిన గడ్డ. ఇంతటి ఘన కీర్తి గల జిల్లా.. ఎందరో పోరాటాలు, కృషి ఫలితంగా ఏర్పడింది. నేడు(సోమవారం) జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్‌లో ఈశాన్య దిక్కులోని చిట్టచివరి జిల్లా శ్రీకాకుళం. ఒకప్పుడు ఈ ప్రాంతం బౌద్ధులకు ముఖ్యస్థావరంగా వర్ధిల్లింది. శాలిహుండం, దంతపురి, జగతిమెట్ట, వంటి బౌద్ధారామాలు ఉన్నాయి.  ఈ ప్రాంతమంతా కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. 6 నుంచి 14వ శతాబ్దం వరకు గాంగేయులు ఈ ప్రాంతాన్ని పాలించారు. 1936 నాటికి ఒడిశాలో విశాఖపట్నం జిల్లా ప్రత్యేకంగా ఉండేది. విశాఖలో సిక్కోలు(శ్రీకాకుళం) అంతర్భాగంగా ఉండేది. దీంతో ప్రత్యేక శ్రీకాకుళం జిల్లా కోసం ఈ ప్రాంతానికి చెందిన ఎందరో ప్రముఖులు పోరాడారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలోనూ శ్రీకాకుళం జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఈ డిమాండ్‌ మరింత పెరిగింది. జిల్లాకు వచ్చిన ప్రజాప్రతినిధులకు తొలిగా ఈ విషయాన్నే ప్రస్తావించేవారు. మద్రాసు రాజధానిగా ఉండే సమయంలో విశాఖ జిల్లాను విభజించి శ్రీకాకుళం జిల్లా ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. 1950లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి సీతారామరెడ్డి శ్రీకాకుళం రాగా... ఆయన దృష్టికి జిల్లా ఏర్పాటు డిమాండ్‌ను స్థానిక ప్రముఖులు తీసుకెళ్లారు. మంత్రి కూడా జిల్లా ప్రజల ఇబ్బందులు, ఇతర సమస్యలను అవగతం చేసుకున్నారు. దీంతో జిల్లా ఏర్పాటుకు ఆయన ప్రతిపాదించారు. ఎట్టకేలకు 1950 ఆగస్టు 15న సాయంత్రం శ్రీకాకుళం జిల్లా ఏర్పాటైంది. అప్పటికి జిల్లా వైశాల్యం 5,837 చదరపు కిలీమీటర్లు. 1969లో శ్రీకాకుళం జిల్లా నుంచి సాలూరు తాలూకాలోని 63గ్రామాలు, బొబ్బిలి తాలూకాలోని 44 గ్రామాలను విశాఖపట్నం జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన గజపతినగరం తాలూకాకు బదలాయించారు. మళ్లీ 1979 మే నెలలో కొత్తగా విజయనగరం జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది(2022) జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా... జిల్లాలోని   పాలకొండ నియోజకవర్గం (4 మండలాలు) పార్వతీపురం మన్యం జిల్లాలో, రాజాం నియోజకవర్గం (4 మండలాలు)  విజయనగరంలో విలీనమైంది. ప్రస్తుతం జిల్లాకు ఉత్తరాన పార్వతీపురం మన్యం జిల్లా, ఒడిశా రాష్ట్రం.. తూర్పున ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా, బంగాళాఖాతం.. పశ్చిమాన విజయనగరం జిల్లా.. దక్షిణాన విశాఖ జిల్లా, విజయనగరం జిల్లా హద్దులుగా ఉన్నాయి.
 


Updated Date - 2022-08-15T06:08:02+05:30 IST