ఈ ఏడాది చివర్లో J&K అసెంబ్లీ ఎన్నికలకు ఛాన్స్: Rajnath Singh

ABN , First Publish Date - 2022-06-18T00:51:44+05:30 IST

జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ఈ ఏడాది చివర్లో నిర్వహించేందుకు గట్టి..

ఈ ఏడాది చివర్లో J&K అసెంబ్లీ ఎన్నికలకు ఛాన్స్: Rajnath Singh

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ఈ  ఏడాది చివర్లో నిర్వహించేందుకు గట్టి అవకాశాలు ఉన్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కశ్మీర్‌లో రెండు రోజుల పర్యటన సందర్భంగా ఆయన శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల విభజన ప్రక్రియ పూర్తయిందని, జమ్మూలో 43 అసెంబ్లీ స్థానాలుగా, కశ్మీర్‌లో 47 స్థానాలుగా విభజన జరిగిందని చెప్పారు. ఈ ఏడాది చివరినాటికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయని తెలిపారు.


విద్వేష బీజాలు నాటుతున్న పాక్

భారతదేశంలో పాకిస్థాన్ విద్వేష బీజాలు నాటుతోందని రాజ్‌నాథ్ తప్పుపట్టారు.''జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన లక్షిత హత్యలు విదేశీ కుట్ర. ఆ కుట్రలను మనం చిత్తు చేయాల్సిన అవసరం ఉంది. ఏ వ్యక్తిని కానీ, మతానికి చెందిన వారిని కానీ బలవంతంగా వెళ్లగొట్టడాన్ని అనుమతించం'' అని ఆయన అన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసే ఎలాంటి ప్రయత్నాలను సహించేది లేదని, బలంగా తిప్పికొడతామని చెప్పారు.

Updated Date - 2022-06-18T00:51:44+05:30 IST