మృత్యు తీగలు

ABN , First Publish Date - 2022-08-13T05:18:21+05:30 IST

ఇలా విద్యుత్‌ ప్రమాదాల్లో రైతులు మృత్యువాత పడుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో అన్నదాతలు ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యవసాయ పంపుసెట్లకు సంబంధించి విద్యుత్‌ లైన్లు అస్తవ్యసంగా ఉండడమే ప్రమాదాలకు కారణం. ప్రధానంగా వర్షాకాలంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

మృత్యు తీగలు

ఏటా పొలాల్లో విద్యుత్‌ ప్రమాదాలు

పదుల సంఖ్యలో మరణాలు

రైతులే ప్రధాన బాధితులు

లైన్లు అస్తవ్యస్తంగా ఉండడమే కారణం

ఉదాసీనంగా యంత్రాంగం

(విజయనగరం-ఆంధ్రజ్యోతి/రింగురోడ్డు)

- ఈ నెల 7న వేపాడ మండలం వావిలపాడులో విద్యుదాఘాతంతో తల్లీ కుమారుడు దుర్మరణం పాలయ్యారు. పొలంలో మోటారు వేయడానికి వెళ్లిన కుమారుడు స్తంభానికి ఉన్న సపోర్టు వైరుకు తాకడంతో విద్యుత్‌ షాక్‌ గురై కుప్పకూలిపోయాడు. ఆయన్ను వెతుక్కుంటూ వెళ్లిన తల్లి కుమారుడు అచేతనంగా పడి ఉండడంతో.. కాపాడే ప్రయత్నంలో తాను విద్యుత్‌ షాక్‌కు గురై మృత్యువాత పడింది. 

- ఈ నెల 11న మెరకముడిదాం మండలం గరుగుబిల్లిలో ఆవాల వెంకటరమణ అనే రైతు విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాడు. పొలంలో మోటారు వేసేందుకు వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. అపస్మారకస్థితికి చేరుకున్నాడు. తోటి రైతులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే వెంకటరమణ మృతిచెందాడు. 


--ఇలా విద్యుత్‌ ప్రమాదాల్లో రైతులు మృత్యువాత పడుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో అన్నదాతలు ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యవసాయ పంపుసెట్లకు సంబంధించి విద్యుత్‌ లైన్లు అస్తవ్యసంగా ఉండడమే ప్రమాదాలకు కారణం. ప్రధానంగా వర్షాకాలంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద సరిగ్గా లేకపోవడం, ఫ్యూజ్‌ బాక్సులు అస్తవ్యస్తంగా ఉండడం, స్తంభాలకు సంబంధించి సపోర్టింగ్‌ వైర్లకు విద్యుత్‌ ప్రసరణ కావడం తదితర కారణాలతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అటు విద్యుత్‌ శాఖ అధికారులు కూడా తమ పని కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తున్న నేపథ్యంలో ట్రాన్స్‌కో సిబ్బంది అసలు పట్టించుకోవడం లేదన్న అపవాదు ఉంది. 

 గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు

వాస్తవానికి వ్యవసాయ పంపుసెట్లకు సంబంధించి అన్నిరకాల విద్యుత్‌ పరికరాలు అమర్చాలి. కానీ విద్యుత్‌ శాఖ తమ పనికాదన్నట్టు వ్యవహరిస్తోంది. ప్రస్తుతం వ్యవసాయానికి 7 గంటల పాటు ఉచితంగా విద్యుత్‌ అందిస్తున్నారు. అయితే ఏకధాటిగా అమలుచేయడం లేదు. షిఫ్ట్‌ల వారీగా అమలుచేస్తున్నారు. దీనికి తోడు విద్యుత్‌ కోతలు వేదిస్తున్నాయి. అందుకే వేళపాలా లేకుండా రైతులు పొలంలో గడపాల్సి వస్తోంది. ఒక వేళ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఫీజు పోయినా.. ఇతరత్రా సమస్యలు తలెత్తినా వెంటనే సిబ్బంది రాని పరిస్థితి. ఈ క్రమంలో రైతులే స్వయంగా బాగుచేసుకోవాల్సి వస్తోంది. అయితే చాలా గ్రామాల్లో వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించి విద్యుత్‌ లైన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద సరైన ఏర్పాట్లు చేయలేదు. దీంతో తరచూ అవి మొరాయిస్తున్నాయి. విద్యుత్‌ లైన్లను గాలికొదిలేయడంతో చిన్నపాటి ఈదురుగాలులకే వైర్లు తెగిపడుతున్నాయి. అది తెలియక అటువైపుగా వెళుతున్న పశువులు, మనుషులు మృత్యువాత పడుతున్నారు. 

 కానరాని నిబంధనలు

కొత్తగా వ్యవసాయ పంపుసెట్‌కు విద్యుత్‌ కనెక్షన్‌ కావాలంటే రైతు నరకయాతన పడాల్సిందే. ప్రభుత్వం మాత్రం అర్హులందరికీ ఉచితంగా విద్యుత్‌ కనెక్షన్‌ అందిస్తున్నట్టు ఆర్భాటంగా ప్రకటిస్తోంది. క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. విద్యుత్‌ నూతన కనెక్షన్‌ ప్రతిపాదనలకు కొందరు అధికారులు బహిరంగంగానే లంచం డిమాండ్‌ చేసిన సందర్భాలున్నాయి. విసిగి వేశారిపోయిన రైతులు ఏసీబీకి ఆశ్రయించిన ఉదంతాలు ఉన్నాయి. కొత్త విద్యుత్‌ కనెక్షన్‌, లైన్ల ప్రతిపాదనలను తయారుచేసి స్థానిక అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు. అయితే అవి మంజూరైతే మాత్రం వాటి బాధ్యతలను కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారు. అయితే చాలామంది అధికారులు బినామీ కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి పనులు చేసినట్టు ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పనులు జరపడం, నాణ్యతకు తిలోదకాలివ్వడం వంటి కారణాలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. 



Updated Date - 2022-08-13T05:18:21+05:30 IST