సమాఖ్య విధానంపై సమ్మెట పోటు

ABN , First Publish Date - 2020-09-12T06:11:35+05:30 IST

పార్లమెంటు ఉభయసభల వర్షాకాల సమావేశాలు ఈ నెల 14వ తేదీన ప్రారంభమవనున్నాయి. ఈ సమావేశాలలో పాల్గొనే సభ్యులు స్వయంగా హాజరు కావలసి ఉంది...

సమాఖ్య విధానంపై సమ్మెట పోటు

రాష్ట్రాల రాజ్యాంగబద్ధ అధికారాలను కేంద్రప్రభుత్వానికి స్వాధీనపరచడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొత్త మార్గాన్ని అనుసరిస్తున్నారు. రాష్ట్రాల అధికారాలపై ఆయన దాడి కార్యనిర్వాహకవర్గ చర్యలు, శాసన నిర్మాణ రూపంలో కొనసాగుతున్నది. ఈ ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు, ఈ నెల 14న ప్రారంభమవనున్న వర్షాకాల సమావేశాలకు మధ్యకాలంలో బ్యాంకింగ్ రెగ్యులేషన్, నిత్యావసర సరుకులు, వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్ కంపెనీల చట్టాల సవరణకుగాను ఆయన ప్రభుత్వం జారీ చేసిన కొత్త ఆర్డినెన్స్‌లే అందుకు నిదర్శనాలు.


పార్లమెంటు ఉభయసభల వర్షాకాల సమావేశాలు ఈ నెల 14వ తేదీన ప్రారంభమవనున్నాయి. ఈ సమావేశాలలో పాల్గొనే సభ్యులు స్వయంగా హాజరు కావలసి ఉంది. స్వయంగా రావడం సాధ్యం కాకపోతున్న సభ్యుల సౌకర్యార్థం వారి వర్చువల్ హాజరీకి అనుమతినివ్వాలని కొద్దిరోజుల క్రితం నేను సూచించగా రాజ్యసభ అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు తిరస్కరించారు. కరోనా విపత్తు కారణంగా ఇప్పటికే బాగా ఆలస్యమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఎట్టకేలకు ప్రారంభం కానుండడం ఎంతైనా ముదావహం. 


పెండింగ్ బిల్లులు, బడ్జెట్ సమావేశాలు- వర్షాకాల సమావేశాల మధ్య కాలంలో జారీ చేసిన 11 ఆర్డినెన్స్‌లను ఆమోదించడమే ప్రస్తుత సమావేశాల ప్రధాన ఎజెండా. ఆర్థిక మాంద్యం, చెలరేగుతున్న కొవిడ్ మహమ్మారి, చైనా నుంచి ఎదురవుతున్న ముప్పు- వంటి అనేక సంక్షోభాలతో దేశప్రజలు సతమతమవుతున్న తరుణంలో కీలక రంగాలలో కేంద్ర- రాష్ట్ర సంబంధాలలో మార్పులకు ప్రభుత్వం ఎందుకు ప్రచ్ఛన్న ప్రయత్నం చేస్తోందో అర్థం కావడం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అత్యంత ప్రీతిపాత్రమైన సిద్ధాంతం- వన్ నేషన్, వన్ ఎవ్విరిథింగ్ -ప్రకారమే ఆ ఆర్డినెన్స్‌లను జారీ చేయడం జరిగింది. అయితే రాష్ట్రాలు, కేంద్రం మధ్య రాజ్యాంగబద్ధమైన ఒప్పందం ఒకటి ఉంది. భారత్, రాష్ట్రాల అవిభాజ్య సమన్వితంగా ఉంటుందన్నదే ఆ ఒప్పందం. అలాగే శాసన నిర్మాణ, కార్యనిర్వాహక అధికారాలను పంచుకోవడం- అనే సమాఖ్య విధానం భారత రాజ్యాంగం నిర్దేశించిన ఒక ప్రాథమిక సూత్రం. మోదీ ‘వన్ నేషన్, వన్ ఎవ్విరిథింగ్’ సిద్ధాంతం ఈ మౌలిక అంశాల స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా ఉంది. చాలా సంవత్సరాలుగా రాష్ట్రాలు తమ అధికారాలను కేంద్రానికి దత్తం చేస్తూ వస్తున్నాయి. అన్ని రాజకీయ పక్షాలూ ఈ దేశాన్ని పాలించాయి. కనుక రాష్ట్రాలు తమ సొంత అధికారాలను కేంద్రానికి అప్పగించవలసివచ్చినందుకు అన్ని పార్టీలూ బాధ్యత వహించవలసిందే. రాష్ట్రాల అధికారాలను అపహరించడంలో నరేంద్ర మోదీ కొత్త మార్గాన్ని అనుసరిస్తున్నారు. రాష్ట్రాల అధికారాలపై ఆయన దాడి కార్యనిర్వాహకవర్గ చర్యలు, శాసన నిర్మాణ రూపంలో కొనసాగుతున్నది. ఆయన ప్రభుత్వం జారీ చేసిన కొత్త ఆర్డినెన్స్లను నిశితంగా చూడండి. 


బ్యాంకులు, కొన్ని నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, సమస్త ప్రధాన ఆర్థిక మధ్యవర్తి సంస్థలను బ్యాంకింగ్ చట్టం క్రమబద్ధీకరిస్తుంది. భారతీయ రిజర్వ్‌బ్యాంక్ పర్యవేక్షణలో ఈ క్రమబద్ధీకరణ అమలవుతోంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే రిజర్వ్‌బ్యాంకే రెగ్యులేటర్. ఈ బాధ్యతలు ఇప్పటికే రిజర్వ్‌బ్యాంక్‌కు పెద్ద భారమైపోయాయి. ఒక రెగ్యులేటర్‌గా రిజర్వ్‌బ్యాంక్‌ రికార్డు మిశ్రమంగా ఉంది. బ్యాంకింగ్‌ రంగంలో ప్రధాన కుంభకోణాలన్నీ ఆర్బీఐ నిఘాలోనే జరగడం గమనార్హం. ఒకే ఒక్క ప్రధాన ఆర్థిక మధ్యవర్తి సంస్థ రాష్ట్రప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణలో ఉంది. అది సహకార బ్యాంకు. చాలా రాష్ట్రాలలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకులు ఉన్నాయి. అవి జిల్లా స్థాయిలో అత్యున్నత స్థాయి బ్యాంకులు. ఇవి, సభ్య సహకార బ్యాంకులకు ఆర్థిక వనరులు సమకూరుస్తాయి. కొన్ని డిసీసీబీలు, యుసీబీలు తమ భౌగోళిక పరిధి వెలుపల కూడా బాగా సుప్రసిద్ధమయ్యాయి. ప్రజలకు ఇతోధిక సేవలందిస్తూ సహకార రంగం ప్రతిష్ఠను పెంపొందించాయి. అప్రతిష్ఠను మూటగట్టుకున్న సహకార బ్యాంకుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. మంచివైనా, చెడ్డ వైనా వాటిని క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తగినన్ని అధికారాలున్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితిని ఎందుకు మార్చాలి? మోదీ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా డిసీసీబీలను, యుసీబీలను కేంద్రప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చింది. వాటిని రెగ్యులేట్ చేసే బాధ్యతలను ఆర్బీఐకి అప్పగించింది. ఈ సహకార బ్యాంకుల సభ్యత్వ, ఆర్థిక వ్యవస్థల రూపురేఖలను మార్చివేసే అధికారాలను కేంద్రం చేపట్టింది. దీనివల్ల సహకార బ్యాంకుల నియంత్రణ, యాజమాన్యాన్ని సహకార రంగంతో సంబంధం లేని కొత్త వారికి అప్పగించే సౌలభ్యం కేంద్రానికి సమకూరింది. ఈ ఆర్డినెన్స్‌ను జారీ చేయడంలో ప్రభుత్వ లక్ష్యం ప్రధాన ఆర్థిక మధ్యవర్తి సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండాలన్నదేనని స్పష్టంగా చెప్పవచ్చు. డీసీసీబీ, యుసీబీ యాజమాన్యాలలోని వారు సదా కేంద్రప్రభుత్వానికి అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఈ ఆర్డినెన్స్ రాష్టాల హక్కులను స్వాయత్తం చేసుకునే ప్రయత్నం మినహా మరేమీ కాదని స్పష్టంగా చెప్పవచ్చు.


నిత్యావసర వస్తువుల చట్టం అనేది కొరతలు, నియంత్రణల కాలానికి చెందినదనేది నా నిశ్చిత విశ్వాసం. ఆహారధాన్యాల ఉత్పత్తిలో అపరిమిత మిగులు సాధించడంతో పాటు అవసరాలకు సరిపడా నిత్యావసర సరుకులను ఉత్పత్తి చేయగల సామర్థ్యం మన ప్రజలకు సమృద్ధంగా ఉన్న ప్రస్తుత కాలంలో నిత్యావసర సరుకుల చట్టం లాంటివి అవసరం లేదని నేను గట్టిగా అభిప్రాయపడుతున్నాను. అయితే ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా నిత్యావసర సరుకుల అక్రమ నిల్వలు కొనసాగుతున్నాయనే వాస్తవాన్ని నేను కాదనడం లేదు. ఈ కారణంగానే నిత్యావసర సరుకుల చట్టం ఇప్పటికీ చట్టాల సంపుటిలో ఉన్నది. సరుకుల వర్తకాన్ని నియంత్రించేందుకు అవసరమైన అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అది సమకూరుస్తుంది. ఈ చట్టాన్ని మరింతగా సరళీకరించాలని కేంద్రప్రభుత్వం అభిలషిస్తుంటే ఒక విధాన పత్రాన్ని సంబంధిత వ్యక్తులు, సంస్థలకు సర్క్యులేట్ చేసి, దానిపై చర్చ నిర్వహించి, నిర్ణయం తీసుకోవాలి లేదా ఒక నమూనా చట్టాన్ని రూపొందించి దాన్ని రాష్ట్రాలకు సిఫారసు చేయాలి. మోదీ ప్రభుత్వం ఇటువంటిదేమీ చేయలేదు. అటువంటి మార్గాలను అనుసరించే అలవాటు మోదీ సర్కార్‌కు లేదు కదా. సహకార బ్యాంకులను రెగ్యులేట్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు గల అధికారాలను ఆర్డినెన్స్ ద్వారా కుదించివేశారు. అలాగే ‘నిల్వల పరిమితులు’ నిర్ణయించడంలో రాష్ట్రప్రభుత్వ అధికారాలనూ బాగా తగ్గించి వేశారు. అసలు ‘నిల్వల పరిమితి’ భావనను ఒక భ్రాంతి పూర్వకమైనదిగా, అర్థరహితమైనదిగా ఆ ఆర్డినెన్స్ మార్చివేసింది! ఆ ఆర్డినెన్స్ చట్టంగా మారిన రోజున అక్రమ నిల్వదారులు పండగ చేసుకుంటారనడంలో సందేహం లేదు. 


వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీల చట్టాలను ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉండాలని నేను అభిప్రాయపడుతున్నాను. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ను క్రమంగా సరళీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నాను. ఈ లక్ష్యాలను నమూనా చట్టాలు, నచ్చచెప్పడం ద్వారా సాధించవలసి ఉంది. మోదీ ప్రభుత్వం తన ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తీసుకువచ్చిన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీల చట్టాలను తిరస్కరించింది. ఈ ఆర్డినెన్స్ పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను ప్రతికూలంగా ప్రభావితం చేసింది. వ్యవసాయ ఉత్పత్తులను సేకరించేందుకు, రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చేందుకు ఈ రాష్ట్రాలు అగ్ర ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందుకు అవి భారీ స్థాయిలో నిధులు కేటాయించి ఖర్చు చేస్తున్నాయి. ఆహార భద్రతపై పెను ప్రభావం చూపే విధంగా ఉన్న శాంతకుమార్ కమిటీ వివాదాస్పద సిఫారసులను అమలుపరిచే ప్రయత్నంలో భాగంగానే మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని పలువురు భావిస్తున్నారు. ఇక ‘ఫ్రీడమ్ ఆఫ్ కాంట్రాక్ట్’పై ఆర్డినెన్స్, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుదారు కనీస మద్దతుధర కంటే తక్కువ ధర చెల్లించకూడదని నిర్దేశించింది. అసలు కనీస మద్దతుధర సూత్రాన్నే ప్రభుత్వం పూర్తిగా త్యజించనున్నదన్న అనుమానాలను ఈ ఆర్డినెన్స్ మరింత దృఢపరుస్తోంది. మరి పంజాబ్ రైతులు ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆందోళనలకు ఉపక్రమించారంటే ఆశ్చర్యమేముంది? పంజాబ్ శాసనసభ ఇప్పటికే ఈ ఆర్డినెన్స్‌ను ఏకగ్రీవంగా తిరస్కరించింది. ఈ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని ఛత్తీస్‌గఢ్ డిమాండ్ చేసింది. హర్యానా, మధ్యప్రదేశ్‌ మౌనం వహించాయి. రాష్ట్రప్రభుత్వాల అభిప్రాయాలను ఉపేక్షించి మోదీ ప్రభుత్వం తనకున్న సంఖ్యాబలంతో ఆమోదింప చేసుకుంటుందనడంలో సందేహం లేదు. నిజమే, మనది ఒకే దేశం. అయితే ఈ దేశంలో ప్రతిదీ ఏకరీతిలో ఉండాలన్న ఆరాటం అంతిమంగా ఈ దేశ సమైక్యత, సమగ్రతలకు హానికరంగా పరిణమించే అవకాశముంది.


పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2020-09-12T06:11:35+05:30 IST