7 నుంచి సమ్మె సైరన్‌

ABN , First Publish Date - 2022-01-22T08:49:02+05:30 IST

పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు సమ్మెకు సమర శంఖం పూరించాయి. వచ్చేనెల 7నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు ప్రకటించాయి.

7 నుంచి సమ్మె సైరన్‌

  • పీఆర్సీ సాధన సమితి ఉద్యమ కార్యాచరణ ప్రకటన
  • నాలుగు జేఏసీలు కలసి సమితిగా ఏర్పాటు 
  • సీఎస్‌తో భేటీ.. పీఆర్సీని వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడి
  • జనవరి నెలకు పాత జీతాలే ఇవ్వాలని వినతి
  • ఎల్లుండి సమ్మె నోటీసు ఇస్తామని స్పష్టీకరణ 
  • ఏకపక్ష పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలి 
  • మీడియా సమావేశంలో ఉద్యోగ నేతల వెల్లడి


అమరావతి/విజయవాడ, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు సమ్మెకు సమర శంఖం పూరించాయి. వచ్చేనెల 7నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు ప్రకటించాయి. పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు. పీఆర్సీ జీవోలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ 24న సీఎస్‌ సమీర్‌ శర్మకు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు తెలిపారు. వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి (ఫిబ్రవరి-7) సమ్మెలోకి వెళ్లనున్నట్లు నోటీసులో హెచ్చరించనున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీని, విడుదల చేసిన జీవోలను వ్యతిరేకిస్తూ నాలుగు జేఏసీల నేతలు పీఆర్సీ సాధన సమితిగా శుక్రవారం ఉదయం విజయవాడలోని ఏపీ ఎన్జీవో భవన్‌లో సమావేశమయ్యారు. దానికి కొనసాగింపుగా మధ్యాహ్నం అమరావతి సచివాలయంలోని ఉద్యోగ సంఘం హాల్లో రెండోసారి భేటీ అయ్యారు. ఉద్యమ కార్యాచరణపై ఏపీజేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులసంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి చర్చించి తుదిరూపు తీసుకొచ్చారు.


అనంతరం సీఎస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. నాలుగు జేఏసీలు కలిసి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడినట్లు సీఎస్‌కు వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని  తెలిపారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా సమ్మెకు వెనుకాడబోమని కుండబద్దలు కొట్టారు. సోమవారం సమ్మె నోటీసు ఇస్తామని, అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని కోరారు. నోటీసు ఇవ్వడానికి ప్రతి జేఏసీ నుంచి ముగ్గురు సభ్యుల చొప్పున మొత్తం 12మందిని అనుమతించాలని కోరారు. జనవరి నెలకు సంబంధించి పాత జీతాలే ఇవ్వాలని విన్నవించారు. కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాల బిల్లులను ప్రాసెస్‌ చేయాలంటూ డీడీవోలపై ఒత్తిడి చేయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఉద్యోగ నేతలు మీడియాతో మాట్లాడారు.


జీవోలు వెనక్కి తీసుకోవాలి: వెంకట్రామిరెడ్డి 

‘‘పీఆర్సీ జీవోల వల్ల ఉద్యోగులందరికీ నష్టం జరుగుతుంది. వాటిని వెనక్కి తీసుకోవాలన్నదే మా మొదటి డిమాండ్‌. అశుతోష్‌మిశ్రా కమిటీ నివేదిక ఇచ్చి చర్చలను పునఃప్రారంభించాలన్నది రెండో డిమాండ్‌. మిశ్రా వేతన సవరణ కమిటీ సిఫార్సుల ప్రకారం మళ్లీ వేతన సవరణ స్కేలు ఇవ్వాలనేది మూడో డిమాండ్‌. మొత్తంగా పీఆర్సీ అమలును నిలుపుదల చేసి చర్చలు పునఃప్రారంభించాలని, అందుకోసం ఒక నెల పాతజీతాలే ఇవ్వాలని చెప్పాం. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పెంచిన వేతన స్కేలు అమలు చేయాలని కోరుతున్నాం. నోటీసు ఇవ్వడానికి సీఎస్‌ను అనుమతి కోరాం. శాంతియుత పద్ధతుల్లోనే ఉద్యమాన్ని చేపడతాం. ఉద్యోగులెవరూ అసభ్య వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నా’’ అని సచివాలయ ఉద్యోగుల సంఘం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు. 


రాజకీయ ప్రమేయం లేదు: సూర్యనారాయణ 

‘‘బీజేపీ, టీడీపీ ట్రాప్‌లో ఉద్యోగ సంఘాలు పడ్డాయన్న మంత్రి వ్యాఖ్యలు నిరాధారం. ఈ అభియోగానికి ఆధారం ఉందా? రాజకీయ రంగు పులిమే ప్రయత్నాన్ని మంత్రులతో సహా ఎవరూ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మాలో ఎవరికీ ఎటువంటి రాజకీయ అనుబంధం లేదు. ఏ పార్టీని శిబిరం వద్దకు అనుమతించొద్దని తీర్మానం చేసుకున్నాం. చంద్రబాబు ను, ఇతర పార్టీలను మద్దతు కోరలేదు. మంత్రి బొత్స ఏం వ్యాఖ్యలు చేశారో తెలియదు. పీఆర్సీ జీవోలను నిలుపుదల చేయాలి. పీఆర్సీ సాధన సమితిని 12మంది సభ్యులతో స్టీరింగ్‌ కమిటీగా ఏర్పాటు చేసుకుంటున్నాం’’ అని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. 


ఆర్టీసీ ఉద్యోగులూ రావాలి: బొప్పరాజు 

‘‘మా ఉద్యమంలోకి ఏ పార్టీకి అనుమతి లేదు. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలను, ట్రేడ్‌ యూనియన్లను ఉద్యమంలోకి తీసుకురావడంపై నిర్ణయంతీసుకున్నాం. మేం గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. అధికారులతో కాకుండా సీఎంతోనే చర్చలు జరపాలి. పాత జీతాలు కోరుతున్నామంటేనే మా డిమాండ్‌లో న్యాయం ఉందని అర్థమవుతుంది. పీఆర్సీ జీవోలు రద్దు చేశాకే ఏ చర్చలైనా ప్రారంభించాలి. ఆర్టీసీ ఉద్యోగులు కూడా మా కార్యక్రమాల్లో  పాల్గొనాలి’’ అని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపిచ్చారు.


ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది: బండి 

‘‘ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. తప్పనిసరి పరిస్థితిలో పీఆర్సీ సాధన కమిటీగా ఏర్పడి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నాం. మొదట జీవోలు రద్దు చేయాలి లేదా అబయెన్సులో పెట్టాలి. ఆ తర్వాతే చర్చలు. ఫిబ్రవరి 5న సహాయ నిరాకరణ, 7 నుంచి సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈ నెల 23న అన్ని జిల్లాకేంద్రాల్లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, 25న ర్యాలీ లు, ధర్నాలు నిర్వహిస్తాం. 26న అన్ని జిల్లాల్లో ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేస్తా రు. 27 నుంచి 30వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు రిలే నిరాహార దీక్షలు చేపడతాం. ఫిబ్రవరి 3న చలో విజయవాడ నిర్వహిస్తాం’’ అని ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు వివరించారు. 



Updated Date - 2022-01-22T08:49:02+05:30 IST