కఠినంగా లాక్‌డౌన్‌ అమలు

ABN , First Publish Date - 2021-05-15T08:11:30+05:30 IST

లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

కఠినంగా లాక్‌డౌన్‌ అమలు

అకారణంగా రోడ్డెక్కితే వాహనం సీజ్‌

సడలింపు సమయంలో చక్కర్లు..!

అలాంటి వారిపైనా చర్యలకు సిద్ధం


హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కొవిడ్‌-19 సెకండ్‌వేవ్‌ తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 21 వరకు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. పలు వర్గాలకు మినహాయింపులు ఇచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు వ్యక్తులు.. ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో అకారణంగా రోడ్లపైకి వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాంటి వారి విషయంలో కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కారణం లేకుండా బయటకు వచ్చే వారి వాహనాలను సీజ్‌ చేయడంతోపాటు.. విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేయనున్నారు. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన నాలుగు రోజులు పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. చెక్‌పోస్టుల దగ్గర వాహనాలను నిలిపినా.. వారు ఏ కారణాలు చెప్పినా.. పెద్దగా పట్టించుకోలేదు. 


ఫుడ్‌ డెలివరీ సంస్థలకు చెందినవారు.. ఆర్డర్లు లేకున్నా.. లోగో ఉన్న దుస్తులు, బ్యాగులతో ఇష్టారాజ్యంగా తిరిగేవారు. ఇలాంటి విషయాలపై శనివారం నుంచి కఠినంగా వ్యవహరించనున్నారు. క్షుణ్ణంగా ప్రశ్నించి, ఆధారాలను చూశాకే, వారిని అనుమతించాలని నిర్ణయించారు. లాక్‌డౌన్‌ వల్ల సాధారణ ప్రజలు నిత్యవసరాలకు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఉదయం 6-10 గంటల మధ్య సడలింపు ఇచ్చింది. ఆ 4 గంటల సమయంలో ఇంటి నుంచి ఒకరు, ఇద్దరు మాత్రమే బయటకు రావాలని పోలీసు శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కానీ చాలా మంది రోజంతా ఇంట్లోనే ఉండాల్సి వస్తుందనే ఉద్దేశంతో స్నేహితులతో కలిసి టీ తాగేందుకు, చక్కర్లు కొట్టేందుకు రోడ్లపైకి వస్తున్నారు. అవసరాలు లేనివారే ఎక్కువగా రోడ్లపైకి వస్తున్నట్లు గుర్తించారు. అలాంటి వారి విషయంలోనూ చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్థమవుతున్నారు.

Updated Date - 2021-05-15T08:11:30+05:30 IST