కఠిన ఆంక్షలు!

ABN , First Publish Date - 2021-10-19T04:32:49+05:30 IST

సిరిమానోత్సవం నేపథ్యంలో విజయనగరంలో కొవిడ్‌ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల వారు నగరంలోకి రాకుండా నిలువరిస్తున్నారు. ఈ నిబంధనలు శ్రుతిమించుతున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులకు సంబంధించి విజయనగరం స్టాపేజీనే తొలగించారు.

కఠిన ఆంక్షలు!





విజయనగరంలో ఆర్టీసీ స్టాపేజీ రద్దు

నగరానికి దూరంగా నిలిపివేయాల్సిందే

సగానికిపైగా సర్వీసులు రద్దు

వాహనాల దారి మళ్లింపు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

సిరిమానోత్సవం నేపథ్యంలో విజయనగరంలో కొవిడ్‌ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల వారు  నగరంలోకి రాకుండా నిలువరిస్తున్నారు. ఈ నిబంధనలు శ్రుతిమించుతున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులకు సంబంధించి విజయనగరం స్టాపేజీనే తొలగించారు. డ్రైవర్లతో పాటు కండక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. కండక్టర్ల వద్ద ఎస్‌ఆర్‌ షీట్‌లో విజయనగరం స్టాపేజీని తొలగిస్తూ తాత్కాలికంగా రెడ్‌ ఇంక్‌ పెట్టారు. పార్వతీపురం, రామభద్రపురం, సాలూరు, ఎస్‌.కోట, శ్రీకాకుళం, పాలకొండ బస్సు సర్వీసులు విజయనగరంలో ఆగవు. పార్వతీపురం, సాలూరు, ఎస్‌.కోట డిపోల నుంచి వచ్చే ఆర్టీసీ సర్వీసులు ఎత్తు బ్రిడ్జిమీదుగా దారి మళ్లించారు. రాజాం, పాలకొండ, శ్రీకాకుళం ఆర్టీసీ సర్వీసులు రింగురోడ్డు, ధర్మపురి-చింతలవలస మీదుగా మళ్లించారు. శ్రీకాకుళం, పాలకొండ, ఎస్‌.కోట, పార్వతీపురం, సాలూరు పట్టణాలకు ప్రతి పావు గంటకు ఒక సర్వీసు నడిచేది. భక్తులను నియంత్రించే క్రమంలో సర్వీసులు తగ్గించారు. పరిమిత సంఖ్యలోనే నడపనున్నారు. సోమవారం నుంచే ఆంక్షలను అమలుచేశారు. సోమవారం ఉదయం నుంచే సింహాచలం మేడ జంక్షన్‌ నుంచి కోట వైపు, కొత్తపేట నీళ్ల ట్యాంక్‌ ప్రాంతం నుంచి కోట వైపు, ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచి కూడలి నుంచి గంట స్తంభం వైపు వాహనాలను అనుమతించలేదు. ఆర్టీసీ బస్సులతో పాటు మిగిలిన భారీ వాహనాలను రింగు రోడ్డు వైపు మళ్లించారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి బాలాజీ జంక్షన్‌ మీదుగా రింగు రోడ్డు వైపు నుంచి రాజాం, పాలకొండ, శ్రీకాకుళం వెళ్లే బస్సులను మళ్లించారు. మంగళ, బుధవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. గత ఏడాది కరోనా విజృంభణ సమయంలో కూడా ఇంతటి ఆంక్షలు విధించలేదని.. ఏకంగా ఆర్టీసీ స్టాపేజీని విజయనగరంలో రద్దు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 



Updated Date - 2021-10-19T04:32:49+05:30 IST