ఫ్యామిలీ, టూరిస్ట్ వీసాల జారీని మరింత కఠినతరం చేసే దిశగా Kuwait అడుగులు..!

ABN , First Publish Date - 2021-11-14T17:28:53+05:30 IST

ఇప్పటికే వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న గల్ఫ్ దేశం కువైత్.. వారికి ఇచ్చే వీసాల విషయంలోనూ పలు కఠిన నిబంధనలను అమలు చేసేందుకు రెడీ అవుతోంది.

ఫ్యామిలీ, టూరిస్ట్ వీసాల జారీని మరింత కఠినతరం చేసే దిశగా Kuwait అడుగులు..!

కువైత్ సిటీ: ఇప్పటికే వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న గల్ఫ్ దేశం కువైత్.. వారికి ఇచ్చే వీసాల విషయంలోనూ పలు కఠిన నిబంధనలను అమలు చేసేందుకు రెడీ అవుతోంది. దీనిలో భాగంగా ఫ్యామిలీ, టూరిస్ట్ వీసాల జారీని మరింత కఠినతరం చేయాలని కువైత్ నిర్ణయించింది. వీసాల జారీపై నియంత్రణను కఠినంగా అమలు చేయాలని తాజాగా కువైత్ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలు రూపొందించాల్సిందిగా ఇప్పటికే సంబంధిత అధికారులను కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో కమర్షియల్ విజిట్ వీసాలతో పాటు టూరిస్ట్, అఫీషియల్ గవర్నమెంట్ విజిట్ వీసాల జారీని మరింత సరళతరం చేయాలని మంత్రివర్గం నిర్ణయించడం గమనార్హం. అలాగే దేశంలోకి వచ్చే వారిని నియంత్రించాలని కూడా సంబంధిత అధికారులను ఆదేశించింది.


మెడికల్, టీచింగ్ ఫీల్డ్‌లకు చెందిన ఫ్యామిలీ వీసాలు పెండింగ్‌లో ఉండడంతో వాటిని వెంటనే పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. ఈ సందర్భంగా ఫ్యామిలీ వీసాల జారీ విషయంలో పలు సూచనలు చేసింది. ప్రవాసుడి భార్య, 16 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే ఈ వీసాలు జారీ చేయాలని సూచించింది. అలాగే ఈ వీసా కోసం శాలరీ కండీషన్ కూడా పెట్టింది. ప్రవాసుల వర్క్‌ పర్మిట్‌లో 500 కువైటీ దినార్లు(రూ.1.23లక్షలు) ఉన్నవారికి మాత్రమే ఫ్యామిలీ వీసా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇక వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో వలసదారులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్(క్యూఆర్ కోడ్‌తో ఉన్నది) సమర్పించడం తప్పనిసరి. అంతేగాక ఇలా వీసా పొందిన ప్రవాసులు మూడు నెలల లోపు ఫ్యామిలీ మెంబర్స్‌ను తిరిగి స్వదేశానికి పంపించివేయాలని పేర్కొంది.     



Updated Date - 2021-11-14T17:28:53+05:30 IST