Abn logo
Sep 21 2021 @ 00:50AM

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

వివరాలు వెల్లడిస్తున్న ఆర్డీవో పెంచల కిశోర్‌దాస్‌

ఆర్డీవో పెంచల కిశోర్‌దాస్‌ హెచ్చరిక

గాజువాక, సెప్టెంబరు 20: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో పెంచల కిశోర్‌దాస్‌ హెచ్చరించారు. గాజువాక మండల తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. గాజువాక నియోజకవర్గం పరిధిలో భూ ఆక్రమణపై భారీగా ఫిర్యాదులు అందుతున్నాయని, ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో రెవెన్యూ, జీవీఎంసీ, విద్యుత్‌ శాఖల అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు. భూకబ్జా కేసులతో పాటు చట్టపరంగా చర్యలు చేపట్టనున్నామని, ఇకపై ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు ఎవరు ప్రయత్నించినా క్షమించేది లేదన్నారు. అన్ని శాఖల సమన్వయ కమిటీతో భూ కబ్జాలను అరికడతామన్నారు. ఈ సమావేశంలో జోనల్‌ కమిషనర్‌ డి.శ్రీధర్‌, ఏసీపీలు రాజ్‌కుమాల్‌, శిరీషా, తహసీల్దార్‌ లోకేశ్వరరావు, సీఐలు మల్లేశ్వరరావు, లక్ష్మి, రాము, విద్యుత్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.