నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-05-21T04:54:58+05:30 IST

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
ఫర్టిలైజర్‌ దుకాణాన్ని తనిఖీ చేస్తున్న ఎస్‌ఐ హరిశంకర్‌గౌడ్‌

కడ్తాల్‌/ఆమనగల్లు/షాద్‌నగర్‌/కొందుర్గు/కొత్తూర్‌, మే 20: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని కడ్తాల ఎస్‌ఐ హరిశంకర్‌గౌడ్‌ హెచ్చరించారు. కడ్తాల మండల కేంద్రంలో శుక్రవారం పోలీసు ఉన్నతాధికారుల ఆదేశానుసారం పలు ఫర్టిలైజర్‌ దుకాణాలను ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని ఆయన సూచించారు. దుకాణాల్లో అమ్ముతున్న విత్తనాలు, స్టాక్‌ బోర్డులు, లైసెన్స్‌లను పరిశీలించారు. ఆదీకృత డీలర్లు నాణ్యమైన విత్తనాలు మాత్రమే అమ్మాలని, గడువు తీరిన విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రతి డీలర్‌ దుకాణంలో లైసెన్స్‌లు విధిగా ఉంచుకోవాలని, కొనుగోలు చేసిన విత్తనాలకు రైతులకు రషీదులు ఇవ్వాలని సూచించారు. నకిలీవిత్తనాలు అమ్ముతున్నట్లు రుజువైతే క్రిమినల్‌ కేసులు తప్పవన్నారు. తనిఖీల్లో ఏఎ్‌సఐ సీతారాంరెడ్డి, పోలీ్‌ససిబ్బంది ఉన్నారు. అదేవిధంగా ఆమనగల్లు పట్టణంలో ఫర్టిలైజర్‌ దుకాణాలను ఏవో అరుణకుమారి తనిఖీ చేశారు. దుకాణాలు, గోదాంలలో స్టాక్‌ను పరిశీలించారు. రైతులకు రశీదులు ఇవ్వాలని, నకిలీ విత్తనాలు, మందులు అమ్మితే చర్యలు తప్పవన్నారు. అదేవిధంగా షాద్‌నగర్‌ పట్టణంలోని పలు సీడ్స్‌, ఫర్టిలైజర్‌ షాపుల్లో షాద్‌నగర్‌ సీఐ నవీన్‌కుమార్‌, వ్యవసాయ శాఖ అధికారి నిశాంత్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆయా దుకాణాల్లో విక్రయిస్తున్న విత్తనాలు, షాపుల్లో ఉన్న అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులు, స్టాక్‌ వివరాలను పరిశీలించారు. నాసిరకం విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్‌ కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే రైతులు 100నెంబర్‌కు డయల్‌ చేసి వివరాలు చెప్పాలని సీఐ సూచించారు. వ్యవసాయశాఖ అధికారి నిశాంత్‌ మాట్లాడుతూ సీడ్స్‌, ఫర్టిలైజర్స్‌ షాపులపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. అదేవిధంగా కొందుర్గు మండలంలోని రాంచంద్రాపూర్‌లోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను ఎస్‌ఐ వెంకటేశ్వర్లుతో కలిసి తనిఖీచేశారు. అదేవిధంగా కొత్తూర్‌ మండల కేంద్రంలోని ఫర్టిలైజర్‌, సీడ్స్‌ దుకాణాలను ఇన్‌స్పెక్టర్‌ బాల్‌రాజ్‌, వ్యసాయాధికారి గోపాల్‌లు ఆకస్మిక తనిఖీ చేశారు. ఫర్టిలైజర్స్‌కు సంబంధించిన స్టాక్‌ బోర్డు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలని నిర్వాహకులను ఆదేశించారు. 

Updated Date - 2022-05-21T04:54:58+05:30 IST