అనుమతులు లేని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-10-01T05:12:47+05:30 IST

జిల్లావ్యాప్తంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు.

అనుమతులు లేని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

 ఇప్పటి వరకు 77 ఆసుపత్రులకు నోటీసులు జారీ

 కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లావ్యాప్తంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులు, డెంగ్యూ, గర్భిణీ స్ర్తీల నమోదు అంశాలపై జిల్లా వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులతో కలెక్టర్‌ శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఇప్పటి వరకు తనిఖీలు చేసి అనుమతులు లేని 77 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. నోటీసులకు స్పందించకపోతే అల్లోపతి క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. డెంగ్యూ వ్యాధి విజృంభించకుండా ప్రతి మంగళ, శుక్రవారాల్లో స్థానిక సంస్థల సహకారంతో డ్రైడేను పాటించాలని తెలిపారు. డెంగ్యూ కేసులు నమోదవుతున్న గ్రామాల్లో స్ర్పే చేయించాలని, నీటి నిల్వ ఉన్న ప్రదేశాలలో ఆయిల్‌బాల్స్‌ వేయించి దోమల లార్వా అభివృద్ధి చెందకుండా చూడాలని తెలిపారు. గర్భిణుల నమోదు తక్కువశాతం చేసిన పీహెచ్‌సీల వైద్యాధికారులు వారి స్థాయిలో సమీక్షించుకుని వందశాతం నమోదు చేయాలని తెలిపారు.  కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జువైరియా, డీపీవో వీరబుచ్చయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-01T05:12:47+05:30 IST