నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు : ఎస్పీ

ABN , First Publish Date - 2021-06-18T05:10:27+05:30 IST

ఆరుగాలం శ్రమించే రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ హెచ్చరించారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు : ఎస్పీ
ఫెర్టిలైజర్స్‌ షాపుల్లో స్టాకు రిజిస్టరు, స్టాకును పరిశీలిస్తున్న పోలీసులు, వ్యవసాయ అధికారులు

కడప(క్రైం), జూన్‌ 17: ఆరుగాలం శ్రమించే రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ హెచ్చరించారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు గురువారం ఎస్పీ నేతృత్వంలో వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌, వ్యవసాయాధికారుల సమన్వయంతో జిల్లావ్యాప్తంగా ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహార మందులు విక్రయించే షాపులపై దాడులు నిర్వహించారు. రైల్వేకోడూరు, కమలాపురం, రాజంపేట తదితర ప్రాంతాల్లోని 350కి పైగా ఉన్న ఫెర్టిలైజర్స్‌, పెస్టిసైడ్స్‌, సీడ్స్‌ షాపుల్లో ఆకస్మిక దాడులు చేసి స్టాకు రిజిస్టరు, రికార్డులను పరిశీలించారు. గోడౌన్లలో ఉన్న స్టాకు వివరాలు నమోదు చేసుకున్నారు. ఆయా కంపెనీల ఉత్పత్తులపై తయారీ తేది, బ్యాచ్‌ నెంబరు, లేబుళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు విక్రయించాలని, నకిలీవి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్దేశించిన ధరల మేరకే విక్రయించాలన్నారు.  అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. దాడులు నిరంతరం కొనసాగుతాయని, రైతన్నలకు అన్యాయం చేయాలని చూసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Updated Date - 2021-06-18T05:10:27+05:30 IST