Abn logo
Sep 21 2021 @ 11:32AM

ఒత్తిని తగ్గించుకోవడానికి ఏం చేయాలంటే...

ఇటీవల పేపర్లలో ఓ వార్త. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం ఎంచుకున్న తన భర్త వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, కాబట్టి తన భర్తను ఆఫీసుకు పిలిపిస్తే తమ కాపురం చక్కబడుతుందంటూ ఓ ఇల్లాలు ఓ కంపెనీ అధినేతను ట్యాగ్‌ చేస్తూ సోషల్‌మీడియాలో ఓ అభ్యర్థన చేయడం, అది వైరల్‌గా మారిన విషయం తెలిసిందే! పదేపదే కాఫీలు ఆర్డర్‌ చేస్తున్న భర్త పట్ల అసహనం చూపడంలో తప్పేమీ లేదు కానీ సిస్టమ్‌ వదలకుండా ఏకధాటిగా 10–12 గంటలు పనిచేస్తున్న శ్రీవారి మానసిక ఆరోగ్యం పట్ల ఆమె కాస్త జాలి చూపితే మరో రకంగా తన లెటర్‌ను రాసేదేమో. ఎందుకంటే... ఇప్పుడు అధికశాతం మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కారణంగా తీవ్రంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఇంట్లోనే ఉంటున్నా ఫ్యామిలీకి తగిన సమయం వెచ్చించలేక, ఇటు హద్దుల్లేని పనిగంటల భారాన్ని మోయలేక సతమతమవుతున్న వారే ఎక్కువగా కనబడుతుండటంతో పాటుగా మానసికంగా, శారీరకంగా అనారోగ్యం బారిన కూడా పడుతున్నారు. చాలా కంపెనీలు ఈ సంవత్సరాంతం వరకూ వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ అవకాశాలను కల్పిస్తే, కొన్ని కంపెనీలు మాత్రం వారానికి రెండు లేదా మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందిగా కోరుతున్నాయి. కానీ ఉద్యోగులు ఒత్తిడిని అధిగమించే మార్గాలు మాత్రం చెప్పకపోవడం గమనార్హం.


సౌకర్యం... వెన్నంటే ఇబ్బంది...

కరోనా  కారణంగా ప్రతి ఒక్కరూ అసాధారణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వీటి కారణంగానే ఎన్నో కంపెనీలు తప్పనిసరై వర్క్ ఫ్రం హోంకు మొగ్గు చూపాయి. ఇప్పటికీ అది కొనసాగుతోంది. ఎక్కడి నుంచైనా పనిచేయడమనేది ప్రతి ఒక్కరికీ పలు రకాలుగా సౌకర్యం కల్పించవచ్చేమో కానీ దీర్ఘకాలం ఇంటి నుంచి పనిచేయడమన్నది మానసిక ఆరోగ్యం పరంగా వినూత్నమైన సవాళ్లను తీసుకురావొచ్చు. సహచర ఉద్యోగులతో సంభాషణలు లోపించడం, సోషలైజింగ్‌ లేకపోవడం వంటివి అధిక ఒత్తిడికి గురిచేయవచ్చు అని అంటున్నారు అపోలో స్పెక్ట్రాలో క్లీనికల్‌ సైకాలజిస్ట్‌గా చేస్తున్న మేఘ జైన్‌. 


ఒత్తిడిని ఎలా గుర్తించాలంటే... 

చిన్న అంశాలను సైతం గుర్తుంచుకోలేకపోవడం, సరైన నిర్ణయాలను తీసుకోలేకపోవడం, ప్రతి అంశంలోనూ లోపాలపై దృష్టి కేంద్రీకరించడం, ప్రతి అంశానికీ ఆందోళన చెందడం, ఒంటరితనంతో బాధపడటం,  లైంగికంగా ఆసక్తి కోల్పోవడం, ఛాతీ, పొట్టలో నొప్పి వంటి లక్షణాలు తరచుగా కనిపించినట్లయితే లేదా సుదీర్ఘంగా, తీవ్రంగా వేధిస్తున్నట్లయితే  ఒత్తిడికి గురవుతున్నట్లే భావించాల్సి ఉంటుంది. చాలామంది ఈ ఒత్తిడితోనే అధికంగా ఆహారం తీసుకోవడం, కాఫీలు తాగడం లాంటివి చేస్తుంటారు. నిజానికి ఆ ఒత్తిడిలో ఏం చేస్తారో తెలీక చేసేది కొందరైతే, తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుందన్న భావనతోనూ విభిన్న పద్ధతులను అనుసరించే వారు మరికొందరని చెబుతున్నారు సైకాలజిస్ట్‌లు.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కాలంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏం చేయాలనే దానిపై సైకాలజిస్ట్‌ మేఘ జైన్‌ ఏం చెబుతున్నారంటే...

1. ఉదయం పూట దినచర్య అనుసరించాలి: మీ రోజు ప్రారంభంలో ఓ నిర్థిష్టమైన దినచర్య ఆరంభించండి. అది పార్కులో నడవడం, కొన్ని సరళమైన వ్యాయామాలు చేయడం, వంట చేయడం ఏదైనా కావొచ్చు. మనస్సుకు ప్రశాంతతనందించే ఏ అంశమైనా ఉపయోగమే !

2. రోజు ముగింపునూ గుర్తుంచుకోవాలి: వర్కింగ్‌ఫ్రమ్‌ హోమ్‌ అనగానే గంటల తరబడి సిస్టమ్‌కు అంకితమవుతుంటారు. అయితే ఎప్పుడు వర్క్‌ ఆపాలనేది ముందే నిర్ణయించుకుని రిమైండర్‌ సెట్‌ చేసుకోవాలి. ల్యాప్‌టాప్‌ దూరంగా ఉంచడం, ఫోన్‌ ఆఫ్‌ చేయడం వీటిలో భాగం.

3. లంచ్‌ బ్రేక్‌ నియంత్రణలో ఉండాలి: మీ వర్క్‌కు దూరంగా 40 నిమిషాలు భోజనం చేసేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు వినియోగించుకోవడంతో పాటుగా పవర్‌ న్యాప్‌కు వినియోగించుకుంటే ఉత్సాహంగా తిరిగి పని చేయవచ్చు.

4. ప్రాధాన్యతా జాబితా చేసుకోవాలి: ప్రాధాన్యతా క్రమంలో చేయాల్సిన అంశాల జాబితా తీర్చిదిద్దుకుంటే చివరి నిమిషంలో హడావుడి తగ్గుతుంది.

5. తగినంత నిద్ర అవసరం: అధిక స్ర్కీన్‌ సమయం అంటే అధిక ఒత్తిడి సమయం అని అర్థం. నిద్రకు ఉపక్రమించే ముందు డిజిటల్‌ తెరలకు దూరంగా ఉండాలి.  శరీర ఆరోగ్యానికి మెరుగైన నిద్ర అవసరం. మనసుకు తగిన విశ్రాంతి లభించినప్పుడే శరీరమూ తగిన విశ్రాంతి పొందుతుంది.

6. స్నేహితులను కలవండి: మీ స్నేహితులను కలువడానికి సమయం వెచ్చించండి. మీ సంభాషణలలో మీ వర్క్‌ను మాత్రం దరి చేరనీయకూడదు.