ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

ABN , First Publish Date - 2022-05-29T04:35:17+05:30 IST

ప్రమాదాల నివారణకు మరింత పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ పి.హర్షవర్ధన్‌రాజు తెలిపారు.

ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
బి.కొత్తకోట పోలీ్‌సస్టేషన్‌ వద్ద ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు

త్వరలో జిల్లాకు 60 మంది హోంగార్డులు 


బి.కొత్తకోట మే 28 :  ప్రమాదాల నివారణకు మరింత పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ పి.హర్షవర్ధన్‌రాజు తెలిపారు. శనివారం ఆయన బి.కొత్తకోట పోలీ్‌సస్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు. స్టేషన్‌ను సుందరంగా తీర్చిదిద్ది ఆధునీకరించిన ఎస్‌ఐ రామ్మోహన్‌ను ఎస్పీ అభినందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆయా స్టేషన్ల పరిధిలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించడం, అక్కడ స్టిక్కరింగ్‌ చేయడం,, ఆ ప్రాంతాల్లో తరచూ వాహనాలను తనిఖీ చేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రమాదాల పట్ల వాహనదారులకు అవగాహన కల్పించాలని పోలీసులకు సూచించామన్నారు. వాహనదారులు రోడ్డు నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వెళ్లే వాహనదారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. హార్సిలీహిల్స్‌లో పోలీస్‌ అవుట్‌పోస్ట్‌ తెరిచే ప్రతిపాదన ఉందని, సిబ్బంది రాగానే పోలీస్‌ అవుట్‌పోస్ట్‌ పునఃప్రారంభిస్తామన్నారు. జిల్లాలో పోలీసు సిబ్బంది కొరత ఉందని త్వరలో చిత్తూరు నుంచి 60 మంది హోంగార్డులు అన్నమయ్య జిల్లాకు వస్తారని వారిలో అధిక శాతం మందిని మదనపల్లె  డివిజన్‌కు కేటాయిస్తామని తెలిపారు. అక్రమ రవాణాలపై సరిహద్దు మండలాల్లో గట్టి నిఘా ఉంచామన్నారు. అక్రమాలకు, ఆసాంఘీక కార్యకలపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేర చరిత్ర కలిగిన వారి కదలికలపై దృష్టి సారించాలని పోలీసులకు ఆదేశించామన్నారు. నేరాల అదుపుకు పూర్తి స్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించామన్నారు. అనంతరం స్టేషన్‌కు వచ్చిన పిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని ఎస్‌ఐ రామ్మోహన్‌ను ఆదేశించారు.  కార్యక్రమంలో మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, మదనపల్లె రూరల్‌ సీఐ అశోక్‌కుమార్‌, బి.కొత్తకోట ఎస్‌ఐ రామ్మోహన్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-29T04:35:17+05:30 IST