బలపడిన బ్రహ్మాస్త్రం!

ABN , First Publish Date - 2022-07-28T10:24:43+05:30 IST

మనీలాండరింగ్ కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులకు విస్తృతమైన, విశేషమైన అధికారాలున్నాయంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు అత్యంత కీలకమైనది...

బలపడిన బ్రహ్మాస్త్రం!

మనీలాండరింగ్ కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులకు విస్తృతమైన, విశేషమైన అధికారాలున్నాయంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు అత్యంత కీలకమైనది. విచారణ, అరెస్టులు, ఆస్తుల స్వాధీనం ఇత్యాదివిషయాల్లో ఈడీ అధికారులకు అమితమైన అధికారాలున్నాయంటూ, మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని కొన్ని ప్రావిజన్ల మీద అభ్యంతరం వ్యక్తంచేస్తూ దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. సోదాలనుంచి ఆస్తుల స్వాధీనం వరకూ ఈడీ అధికారులు ఏమైనా చేయవచ్చునని చెప్పడం, అరెస్టులకు కారణం చెప్పనక్కరలేదని అనడం, బెయిల్ షరతులను ఎత్తిపట్టడం వంటివి ఈడీ భవిష్యత్తు చర్యలను తీవ్రంగా ప్రభావితం చేసే అంశాలు. ఇటువంటి తీర్పులను అన్ని రాజకీయపార్టీలూ మొహమాటానికైనా మెచ్చుకోవాల్సి ఉండగా, అధికారపక్ష బీజేపీ మాత్రమే స్వాగతిస్తే, కాంగ్రెస్ సహా చాలా పార్టీలు ఈ తీర్పు ప్రభావంపై భయాందోళనలు వెలిబుచ్చుతున్నాయి. 


సదరు చట్టం సవ్యమైనదేనని చెప్పి న్యాయస్థానం తనబాధ్యత చక్కగానే నిర్వర్తించింది. కానీ, ఈ కేసుకు ప్రధాన కారణం దాని దుర్వినియోగమే. కాంగ్రెస్ ఎంపీ చిదంబరం, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తదితరులతో సహా దాదాపు వందపిటిషన్లను కట్టకట్టి కోర్టు ఇప్పుడు విచారించింది. చట్టంలోని కఠినమైన ప్రావిజన్లను పిటిషనర్లు సవాలు చేశారు. మనీలాండరింగ్ చట్టం కింద ఈడీకి ఉన్న అధికారాలు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వెలుపల ఉన్నాయనీ, అయితే, ఈడీ అధికారులు ప్రక్రియలో పోలీసుల్లాగానే వ్యవహరిస్తున్నందున దర్యాప్తు సమయంలో సీఆర్పీసీని అనుసరించాలన్నది వాదన. ఏయే దశల్లో ప్రాథమికహక్కులు, నిందితుడి కనీస హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయో పిటిషనర్లు తెలియచేశారు. రాజ్యసభ పరిశీలనకు వీల్లేకుండా ఒక ఆర్థికబిల్లుద్వారా చట్టంలో చేసిన సవరణలను కూడా పిటిషనర్లు ప్రశ్నించారు. కానీ, ఈడీ అధికారులు పోలీసులు కాదనీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్-) ఎఫ్ఐఆర్ వంటిది కాదు కనుక నిందితులకు చూపనక్కరలేదన్న మౌలికాంశంతో మొదలుపెట్టి పిటిషనర్ల వాదనలన్నింటినీ సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టివేసింది.


వివిధ దర్యాప్తు సంస్థలను ప్రయోగించి కేంద్రప్రభుత్వం రాజకీయప్రత్యర్థులను వేధిస్తున్నదంటూ విపక్షాలు కొత్త రాష్ట్రపతికి మొన్న ఓ లేఖ రాశాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీని రోజులతరబడి ఈడీ తిప్పుతున్న నేపథ్యంలో విపక్షనేతలంతా ఒక్కటికావడాన్ని అధికారపక్షం దివాలాకోరుతనంగా విమర్శిస్తున్నది. దీనికి ముందు రాహుల్ గాంధీని ఐదురోజులపాటు విచారించింది. ఈ కేసులో అంతిమంగా నిగ్గుతేలేది ఏమిటన్నది అటుంచితే, విపక్షాలన్నీ రోడ్డునపడి అల్లరి చేయడం, ఈడీని బీజేపీ ఆయుధంగా వాడుతున్నదని విమర్శించడం వినా ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నాయి. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కొందరిపై ఈడీ దాడులు జరగడంతో చీలికపక్షం మరింత బలపడిందని అంటారు. దీనికి ఇంకాముందు మహావికాస్ అగాఢీ మంత్రులు కొందరు జైలుకు కూడా పోయారు. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు కూడా ఈడీ దాడులు ఎదుర్కొన్నారు. హర్యానా, గోవా కాంగ్రెస్ నాయకులదీ, కర్ణాటకలో ఎన్నికలకూ, చీలికలకూ ముందు కాంగ్రెస్, జేడీఎస్ సీనియర్ నాయకులదీ, ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్ వాదీ నాయకులదీ అదే పరిస్థితి. పశ్చిమబెంగాల్‌లో మమత మేనల్లుడు, కీలకమైన తృణమూల్ మంత్రులను ఈడీ పలుకేసుల్లో ప్రశ్నిస్తున్నది. జమ్మూ కశ్మీర్‌లో అబ్దుల్లా కుటుంబీకులను, మెహబూబా ముఫ్తీనీ ఈడీ ఊపిరితీసుకోనివ్వడం లేదు.  


అధికార పక్షం ఓ బ్రహ్మాస్త్రంగా ప్రయోగిస్తున్న ఈ మనీలాండరింగ్ చట్టం అంతిమంగా సాధిస్తున్నది కూడా పెద్దగా లేదని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. పదిహేడేళ్ళకాలంలో ఎనిమిది వందలకోట్లు స్వాధీనం చేసుకొని, ఐదున్నరవేల కేసులు పెడితే పట్టుమని పాతికమందిని కూడా దోషులుగా నిర్థారించలేకపోయారు. కానీ, అంతకుముందుతో పోల్చితే గత పదేళ్ళలో ఈడీ దాడులు దాదాపు ముప్పైరెట్లు పెరిగాయి. అత్యధికంగా ప్రభుత్వాలను మార్చడానికే ఈడీ ఉపకరిస్తున్నందున సుప్రీం తీర్పుతో పాలకపక్షం మరింత రెచ్చిపోతుందని విపక్షాల భయం. ఈడీ వంటి కేంద్ర ఏజెన్సీలను రంగంలోకి దించుతాం జాగ్రత్త అని అధికారపక్ష నాయకులు విపక్షపాలిత రాష్ట్రాల్లో ఏకంగా హెచ్చరికలే చేస్తున్నప్పుడు, అవినీతి వెలికితీత మాట అటుంచి, ప్రజల దృష్టిలో ఆ సంస్థలు పలుచనయ్యే ప్రమాదం చాలాఉంది.

Updated Date - 2022-07-28T10:24:43+05:30 IST