బలపడిన బంధం

ABN , First Publish Date - 2021-12-08T06:21:49+05:30 IST

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఐదుగంటల భారత పర్యటన ప్రధానంగా వ్యాపారపరమైనదే కావచ్చును గానీ, ఇరుదేశాల మధ్య ఇటీవల కాస్తంత దూరం పెరిగిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఉంది....

బలపడిన బంధం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఐదుగంటల భారత పర్యటన ప్రధానంగా వ్యాపారపరమైనదే కావచ్చును గానీ, ఇరుదేశాల మధ్య ఇటీవల కాస్తంత దూరం పెరిగిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఉంది. హైదరాబాద్ హౌస్‌లో పుతిన్, మోదీలు ఇద్దరూ తమ ప్రసంగాల్లో గతాన్ని ఓమారు స్మరించుకొని పరస్పర సహకారంతో మంచి భవిష్యత్తులోకి ప్రయాణించాలని సంకల్పం చెప్పుకున్నారు. భారత్ అమెరికా మధ్య ‘టూ ప్లస్ టూ’ చర్చలు ఇరుదేశాలూ కలసి వేగంగా నడచేందుకు ఉపకరించాయి. ఇప్పుడు రష్యాతో కూడా భారత్‌ ఇదే తరహాలో సాగుతోంది. పుతిన్, మోదీ భేటీకి కాస్తముందుగా రెండు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రుల మధ్య జరిగిన చర్చలు కీలకమైన అంశాలు ప్రస్తావించుకొని, సమస్యలు పరిష్కరించుకొనేందుకు వీలుకల్పించాయి.


ఈ ఏడాది రష్యా అధ్యక్షుడు జరిపిన రెండో విదేశీ పర్యటన ఇదేనట. మోదీని ఆయన ప్రత్యక్షంగా కలుసుకొని మూడేళ్ళవుతోంది. ఆర్నెల్ల క్రితం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను జెనీవాలో కలుసుకున్నాక, ఇప్పుడు మోదీతో భేటీకి ఢిల్లీ రావడాన్ని బట్టి భారత్‌కు రష్యా ఇస్తున్న ప్రాధాన్యం అర్థమవుతోంది. రక్షణ ఒప్పందాలే ప్రధాన ఎజెండా కావచ్చును కానీ, దశాబ్దాల స్నేహాన్ని స్పృశించుకొనేందుకు ఈ పర్యటన వీలుకల్పించింది. కరోనా కారణంగా ఎన్నో సవాళ్ళు తలెత్తినా రష్యా భారత్ బంధం బలహీనపడలేదనీ, మూడుదశాబ్దాలుగా ఇరుదేశాల మధ్యా సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యం చెదరకుండా సాగించిన ఘనత మీదేనంటూ మోదీ రష్యాను చక్కని మాటలతో ప్రశంసించారు. పుతిన్ తన ప్రసంగంలో ద్వైపాక్షిక వాణిజ్యం, దానిలో ఇటీవల వచ్చిన హెచ్చుతగ్గుల గురించి ప్రధానంగా మాట్లాడినా, కీలక రంగాల్లో రెండు దేశాల మధ్యా సాగుతున్న సహకారాన్ని ప్రస్తావించి, దానిని బలోపేతం చేయాలన్న సంకల్పాన్ని కూడా ప్రకటించారు. అఫ్ఘానిస్థాన్ విషయంలో భారత్ ఆందోళనను గుర్తుచేసుకోవడం విశేషమే.


సైనిక, రక్షణరంగ పరిశోధనల్లో సహకారం కచ్చితంగా భారతదేశానికి లాభించేదే. ఉభయదేశాలూ కలసి అత్యాధునికమైన రక్షణ ఉత్పత్తుల తయారీకి ఇది ఉపకరిస్తుంది. ఎకె– 203 రైఫిళ్ళ నుంచి ఈ ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యం మరింత విస్తరించబోతున్నది. ఎస్ 400 క్షిపణుల సరఫరా విషయంలో ఉభయదేశాలూ వెనక్కుతగ్గలేదు. ఈ క్షిపణుల ఖరీదుపైన కొన్ని విమర్శలు లేకపోలేదు కానీ, రష్యా ఇప్పటికే విక్రయించిన దేశాల్లో అవి కఠినమైన వాతావరణంలో కూడా అద్భుతంగా పనిచేస్తున్న మాట నిజం. ‘కాట్సా’ ద్వారా అమెరికా మనను శిక్షించవచ్చునన్న అనుమానాలున్నప్పటికీ, 2018లో రష్యాతో కుదర్చుకున్న ఒప్పందానికి భారత్ కట్టుబడి వాటిని త్వరితంగా అందుకొనేందుకు ఒత్తిడి కూడా పెంచింది. మూడేళ్ళక్రితమే వీటిని రష్యానుంచి తెచ్చుకున్న చైనా లద్దాఖ్‌కు ఆవల సరిహద్దుల్లో ఇప్పటికే మోహరించింది. 


పుతిన్ భారతదేశంలో పర్యటించిన డిసెంబరు 6కు మరో చారిత్రక ప్రాధాన్యం కూడా ఉంది. యాభైయేళ్ళక్రితం బంగ్లాదేశ్‌ను స్వతంత్రదేశంగా మొదటగా భారత్ గుర్తించిన రోజు అది. ఈ ఏడాది భారత్ బంగ్లాదేశ్‌లు డిసెంబరు 6ను ‘మైత్రి దివస్’గా జరుపుకున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ విముక్తిలో అప్పటి సోవియట్ యూనియన్ సహకారం చాలా ఉన్నది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎంతో ముందుచూపుతో ఇండో సోవియట్ ఒప్పందం కుదర్చుకుని పాకిస్థాన్ పక్షాన అమెరికా, చైనాలు వీరంగం వేయకుండా నిరోధించారు. ‘మిత్రులిద్దరిలో ఎవరిమీద దాడి జరిగినా మరొకరు వచ్చి ఆదుకోవాల’న్న ఈ ఒప్పందంలోని అంతఃస్సూత్రం అమెరికాను సైతం నిలువరించింది. రష్యా ఇంటలిజెన్స్ వ్యవస్థ ప్రతిక్షణం అందించిన సమాచారం మనకు ఎంతో ఉపకరించింది. పాకిస్థాన్ పక్షాన అమెరికా వేస్తున్న ప్రతీ అడుగునీ ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేసే రీతిలో రష్యా కదిలింది. భద్రతామండలిలో తన వీటో శక్తితో రష్యా మనపక్షాన నిలిచినందున, భారత సైన్యానికి మరికొంత సమయం లభించి, ఢాకాలోకి ప్రవేశించి పాక్ సైనికులను లొంగదీయగలిగారు. యుద్ధక్షేత్రం నుంచి ఐక్యరాజ్యసమితి వరకూ మనకు ప్రత్యక్ష, పరోక్ష మార్గాల్లో అందిన సోవియట్ సహకారం బంగ్లా విముక్తికీ, పాకిస్థాన్ మీద విజయానికీ దోహదపడితే, అనంతర కాలంలో ఆ సహకారం మరింత విస్తరించి భారతదేశం పలు రంగాల్లో స్వయంగా ఎదిగేందుకు వీలైంది. ఎన్ని అలకలు, అనుమానాలు ఉన్నా భారత్–రష్యా బంధం అలాగే చెదరకుండా కొనసాగుతోంది.

Updated Date - 2021-12-08T06:21:49+05:30 IST