స్వశక్తితో ఎదగడమే బలం

ABN , First Publish Date - 2021-12-28T06:22:17+05:30 IST

అంతర్జాతీయ దౌత్యంలో ఏ దేశమైనా విశాల ప్రపంచ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తుందా? ఇటీవల అమెరికా, చైనా దేశాధ్యక్షుల మధ్య జరిగిన శిఖరాగ్ర సదస్సులో హాంకాంగ్, దక్షిణ చైనా సముద్ర వివాదాలు...

స్వశక్తితో ఎదగడమే బలం

అంతర్జాతీయ దౌత్యంలో ఏ దేశమైనా విశాల ప్రపంచ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తుందా? ఇటీవల అమెరికా, చైనా దేశాధ్యక్షుల మధ్య జరిగిన శిఖరాగ్ర సదస్సులో హాంకాంగ్, దక్షిణ చైనా సముద్ర వివాదాలు, తైవాన్, జింజియాంగ్ వ్యవహారాలే ప్రధాన చర్చనీయాంశాలుగా ఉన్నాయి. భారత్, చైనాల మధ్య చోటు చేసుకుంటున్న సరిహద్దు ఘర్షణల విషయం ప్రస్తావనకు సైతం నోచుకోలేదు. మన సమస్యల పట్ల అమెరికా ఉపేక్షను ఎలా అర్థం చేసుకోవాలి? 


తూర్పు ఆసియాలో తన ప్రయోజనాలను కాపాడుకోవడంపైనే అమెరికా దృష్టి అంతా కేంద్రీకృతమై ఉంది. జపాన్, ఆస్ట్రేలియాలకు ఆ ఆసియా దేశాలు చేరువలో ఉన్నాయని, వాటి మధ్య పరస్పర సంబంధాలు ఉన్నాయనే వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. చెప్పవచ్చిందేమిటంటే అమెరికా, భారత్ మధ్య సంబంధాలు సన్నిహితమవుతున్న మాట నిజమే; అయితే ఈ స్నేహ సంబంధాలను తూర్పు ఆసియాలో తన ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు మాత్రమే అమెరికా ఉపయోగించుకుంటుందనేది ఒక నిండు వాస్తవం. దీన్ని విస్మరించడమంటే భారత్ శ్రేయస్సును నిర్లక్ష్యం చేయడమే. 


భారత్‌కు మద్దతునివ్వాలని తన మిత్ర దేశాలైన జపాన్, ఆస్ట్రేలియా, తైవాన్‌లను అమెరికా ఎంత మాత్రం ప్రోత్సహించడం లేదు. తైవాన్, హాంకాంగ్ దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాలలో తన ప్రయోజనాలను సంరక్షించుకునేందుకు మాత్రమే అమెరికా శ్రద్ధ చూపుతోంది. 


ఈ పరిస్థితులలో భారత్ ఏం చేయాలి? నాలుగు దేశాల (ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, అమెరికాలతో కూడిన) క్వాడ్ వైపు మొగ్గడమా? లేక రష్యా, భారత్, చైనాలు సభ్య దేశాలుగా ఉన్న ఆర్‌ఐసి వైపు మొగ్గడమా? తన స్వప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే భారత్ నిర్ణయించుకోవలసి ఉంది.


అమెరికా మాదిరిగానే క్వాడ్ కూడా హాంకాంగ్, దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జింజియాంగ్ వ్యవహారాలపైనే తన దృష్టిని కేంద్రీకరిస్తోంది. చైనాతో తరచు సంభవిస్తున్న సరిహద్దు వివాదాల విషయంలో భారత్‌కు క్వాడ్ నుంచి ఎలాంటి క్రియాశీల మద్దతు లభించడం లేదు.


క్వాడ్, ఆర్‌ఐసి మధ్య ఒక ప్రధాన తేడా ఉంది. క్వాడ్ వైపు మొగ్గితే మనకు అధునాతన సాంకేతికతలు అందుబాటులోకి వస్తాయి. ఆర్‌ఐసి నుంచి అటువంటి వేవీ మనకు సమకూరవు. ఇదొక సంక్లిష్ట పరిస్థితి. క్వాడ్ మద్దతు ఇవ్వడం వల్ల మనకు నవీన సాంకేతికతలు లభ్యమయ్యే మాట నిజమే అయినా తూర్పు ఆసియాలో అమెరికా ప్రయోజనాల పరిరక్షణకు మనం తోడ్పడవలసి ఉంది. ఆర్‌ఐసికి మద్దతు నిచ్చిన పక్షంలో అమెరికాకు అనుకూలంగా మనం వ్యవహరించవలసిన అవసరమేమీ లేదు. అయితే అధునాతన సాంకేతికతలు ఏవీ మనకు అందుబాటులోకి రావు. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ వెనుకబడిపోతుంది.


మార్గాంతరమేమిటి? భారత్ పూర్తిగా తన స్వశక్తిపై ఆధారపడడమే. ఇతర దేశాల సహాయ సహకారాలకు ఆరాటపడకుండా సొంత వనరులతో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి. ఇదే అంతర్జాతీయ సమాజంలో మన పరపతిని పెంచుతుంది. ఈ విషయంలో 1980, 90 దశకాలలో చైనా సాధించిన అభివృద్ధి నుంచి మనం పాఠాలు నేర్చుకోవలసి ఉంది. ఆ కాలంలో చైనా దేశీయ పొదుపు మొత్తాల రేటు 45 శాతం కాగా నేడు మన పొదుపు మొత్తాల రేటు కేవలం 20 నుంచి 25 శాతంగా మాత్రమే ఉంది. పొదుపు మొత్తాలు అత్యధికంగా ఉన్నందునే సొంతంగా అధునాతన సాంకేతికతల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులను చైనా సమీకరించుకోగలిగింది. బోయింగ్, సుఖోయి, రాఫెల్ మొదలైన అమెరికా, యూరోపియన్ కంపెనీల పైన ఆధారపడకుండా చైనా తన సొంత ఫైటర్ జెట్‌లను అభివృద్ధిపరచుకోవడమే అందుకు నిదర్శనం. తమ ప్రజల పొదుపు మొత్తాల నుంచే ఆ యుద్ధ విమానాల అభివృద్ధికి అవసరమైన నిధులను చైనా ప్రభుత్వం సమకూర్చుకుంది. ఏ దేశ ప్రజలు అయినా తమ ఆదాయాలలో కొంత భాగాన్ని పొదుపు చేసి తీరాలి. అలా కాకుండా విచ్చలవిడిగా ఖర్చు చేస్తే అంతిమంగా ఆ దేశం పలు విధాల నష్టపోవలసివస్తుంది. ఇది చైనా నుంచి మనం నేర్చుకోవలసిన మొదటి పాఠం. 


ఇక రెండో పాఠం సత్వర, సమగ్ర ఆర్థికాభివృద్ధిని జాతీయ లక్ష్యంగా ఔదలదాల్చడం. గత శతాబ్ది చివరి రెండు దశకాలలో చైనా ఏకైక ధ్యేయం ఆర్థికాభివృద్ధిని సాధించడమే. ‘సంపద సముపార్జించడమే ప్రతిష్ఠాకరం’ అనే నినాదాన్ని చైనా ప్రభుత్వం తన ప్రజల మనస్సుల్లో సుప్రతిష్ఠితం చేసింది. తమ తమ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధిరేటును పెంపొందింప చేసిన ప్రభుత్వాధికారులకు పదోన్నతులు కల్పించింది. ఇంకా ఇతర ప్రోత్సాహకాలనూ కల్పించింది. ఇదొక విధానంగా అమలుపరిచారు. ఇటువంటి ప్రోత్సాహం కారణంగా చైనా ప్రభుత్వాధికారులు ప్రభుత్వ లక్ష్యాలను శీఘ్రగతిన సమగ్రంగా సాధించేందుకు చిత్తశుద్ధితో పాటుపడ్డారు. వారి కృషి ఫలితంగానే చైనా రెండంకెల వృద్ధిరేటును సాధించగలిగింది. ఆ విధంగా చైనా జాతీయ వ్యవహారాలలో ఆర్థికాభివృద్ధి సాధనే పరమ లక్ష్యమైపోయింది. మరే విషయం కంటే ఆర్థిక విజయాలు సాధించేందుకే చైనా ప్రజలు అగ్ర ప్రాధాన్యమిచ్చారు. కష్టపడి పని చేయడం ద్వారా తమ వ్యక్తిగత ఆదాయాన్ని పెంపొందించుకున్నారు. తద్వారా జాతి సంపదను ఇతోధికం చేశారు. 


మరి మన విషయమేమిటి? అయోధ్యలో రామ మందిరం, ఉమ్మడి పౌర స్మృతి, అధికరణ 370 రద్దు చైనాతో సరిహద్దు సంఘర్షణలు, కశ్మీర్‌లో పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలు మొదలైన వాటికే ప్రాధాన్యమిస్తున్నాం. మన పిచ్చా పాటీ, మాటా మంతీ అన్నీ దాదాపుగా ప్రస్తావిత విషయాలపైనే జరుగుతుంటాయి కదా. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఆర్థికాభివృద్ధిని అత్యధిక స్థాయిలో సాధించేందుకు మనం ప్రాధాన్యమివలేదు. బలిష్ఠమైన ఆర్థికవ్యవస్థను నిర్మించుకోకుండానే మనం శక్తిమంతమైన అగ్రరాజ్యంగా ఎదగగలమని విశ్వసించాం. సత్వర ఆర్థికాభివృద్ధి సాధనకు తక్కువ ప్రాధాన్యమిచ్చాం. సామాజిక, సాంస్కృతిక వ్యవహారాలపై దృష్టిపెట్టాం. సామాజిక, సాంస్కృతిక వ్యవహారాలకు ఎంత ప్రధానమైనవి అయినప్పటికీ అవేమీ ఆర్థికాభివృద్థికి తోడ్పడవు కదా. దేశాల అభివృద్ధికి, జాతుల పురోగమనానికి ఆర్థికవ్యవస్థే పునాది. ఆర్థికాభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే ఏ దేశమూ మిగతా రంగాలలో అభివృద్ధిచెందలేదు. మన దేశీయ పొదుపు రేట్లను పెంపొందించుకోవాలి. ఆర్థిక సాధికారతే మన పరమ లక్ష్యం కావాలి. ఈ వాస్తవిక బాటలో ముందుకు సాగితే క్వాడ్, ఆర్‌ఐసి ఇత్యాది అంతర్జాతీయ కూటములను మనం ఖాతర్ చేయనవసరం లేదు.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2021-12-28T06:22:17+05:30 IST