అధ్వానంగా అంతర్గత రోడ్లు

ABN , First Publish Date - 2020-11-20T05:44:36+05:30 IST

అధ్వానంగా అంతర్గత రోడ్లు

అధ్వానంగా అంతర్గత రోడ్లు
నాగారం మున్సిపాలిటీ ముప్పు ఎల్లారెడ్డి కాలనీలో అధ్వానంగా మారిన రోడ్డు

  • అవస్థలు పడుతున్న కాలనీవాసులు 
  • పట్టించుకోని సంబంధిత అధికారులు, పాలకులు 
  • వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికుల డిమాండ్‌ 


కీసర రూరల్‌: నాగారం మున్సిపల్‌ పరిధిలోని పలు కాలనీల్లో రోడ్లు అధ్వానంగా మారాయి. స్థానికులు తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నారు. గతనెల కురిసిన భారీ వర్షాల కారణంగా కాలనీల్లోని అంతర్గత రోడ్లు గుంతలమయంగా మారాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రాత్రి వేళల్లో నరకాన్ని చవి చూడాల్సివస్తోందని స్థానికులు వాపోతున్నారు. నాగారం మున్సిపల్‌ పరిధిలోని ఎల్లారెడ్డి, వికాస్‌ నగర్‌ కాలనీల్లోని రోడ్లు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వరదధాటికి రోడ్డు కోసుకుపోయి పలుచోట్ల గుంతలమయమై ప్రమాదకరంగా మారింది. నెలరోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకునేవారే లేరని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్‌ పరిధిలోని పలు కాలనీల ప్రజలు ఈరోడ్డు గుండానే నిత్యం రాకపోకలు కొనసాగిస్తారు. వీధి దీపాలు, రోడ్డు సక్రమంగా లేక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ధ్వంసమైన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాల్సిన సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఇటు వైపు కన్నెత్తైనా చూడటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన రోడ్లు నిర్మించకపోవడం వల్లనే సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దృష్టి సారించి, మరమ్మతు పనులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే  ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.


వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి


నాగారం మన్సిపల్‌ పరిధిలోని పలు కాలనీల్లో రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. రోడ్డు సక్రమంగా లేకపోవటంతో స్థానిక కాలనీల ప్రజలు నానాఅవస్థలు పడుతున్నారు. వాహనదారులు గాయాలపాలైన సంఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. మరమ్మతులు చేపట్టడంలో మున్సిపల్‌ అధికారులు, పాలకులు అలసత్వం వహిస్తున్నారు. ప్రమాదకరంగా మారిన రోడ్లను వెంటనే బాగుచేయాలి. 

- ముప్పు శ్రీనివాస్‌రెడ్డి, స్థానికుడు


Updated Date - 2020-11-20T05:44:36+05:30 IST