‘విశాఖ’పై వీధి రాజకీయాలు

ABN , First Publish Date - 2021-02-23T06:30:51+05:30 IST

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ పేరిట ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీల విన్యాసాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది...

‘విశాఖ’పై వీధి రాజకీయాలు

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ పేరిట ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీల విన్యాసాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది, ఆవేశంగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న ఈ నేతల్లో అనేకమంది విశాఖపట్టణాన్ని ఏదో రకంగా దోచుకున్నవారే. వారిలో స్టీల్ ఫ్యాక్టరీని తమ ఉపాధిగా భావించి కోట్లాది రూపాయలు ఆర్జించిన వారే. స్టీల్ ప్లాంట్ భూములపై, ఆస్తులపై కన్నేసిన వారు కూడా వారిలో లేకపోలేదు. నిబంధనలకు వ్యతిరేకంగా బీచ్ ఒడ్డున భవంతులు కట్టుకున్నవారు, ఎడా పెడా భూదందాలు చేసిన వారు, బతుకు తెరువుకోసం విశాఖకు చేరి షిప్పింగ్, కాంట్రాక్టుల రంగంలో పైకి ఎదిగిన వారు, ఒక పార్టీ లేకపోతే మరొక పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నవారు ఇవాళ గత చరిత్రను తడుముతూ, పాదయాత్రలు చేస్తూ ప్రజలకోసం బూటకపు కన్నీరు కారుస్తున్నారు.


అసలు విశాఖ ఉక్కును నష్టాల పాలు చేసిందెవరు? ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి సగానికిపైగా నిర్వాసితులను రోడ్డు పాలు చేసిందెవరు? స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనుల టెండర్ల విలువను ఇష్టారాజ్యంగా పెంచి కోట్లాది రూపాయలు దోపిడీ చేసిందెవరు? కనీస హక్కులకోసం కార్మికులు అడుగడుగునా పోరాడేలా చేసిందెవరు? 1971లో శంకుస్థాపన జరిగినప్పటికీ ఏడేళ్ల వరకూ నిధులు ఎందుకు కేటాయించలేదు? 1985లో ఎవరి హయాంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని నిలిపివేశారు? నిర్మాణ దశలోనే 1500 కోట్లకు పైగా ఖర్చుకాగా, ఈ ప్లాంట్ లాభసాటి కాదని దాన్ని రద్దు చేసేందుకు, విదేశీ సంస్థలకు అమ్మేసేందుకు, బిఐఎఫ్‌ఆర్ కింద తుక్కు కింద అమ్మేసేందుకు ఎవరు సిద్ధపడ్డారు? తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు స్టీల్‌ప్లాంట్‌కు ఎందుకు స్వంత ఇనుప గనులు కేటాయించలేకపోయాయి? సోనియాగాంధీని సంతృప్తిపరిచేందుకు రాయబరేలీ వీల్ ప్లాంట్ పేరుతో రూ. 1100 కోట్ల మేరకు నష్టాన్ని స్టీల్‌ప్లాంట్‌పై వేసిందెవరు? లక్షల కోట్ల ఇనుపఖనిజాన్ని తవ్వి దేశీయ ప్లాంట్లకు తరలించేబదులు విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటే, అవసరమైనప్పుడు ప్లాంట్, యంత్రాలు మార్చకుండా, భారీ వడ్డీ భారాన్ని, వనరుల లోటును, పెరిగిపోయిన ఉపకరణాల వ్యయాన్ని కొనసాగిస్తూ కంపెనీ నష్టాల బాటన పడుతుంటే చూస్తూండిపోయిన మహానుభావులా ఇప్పుడు విశాఖ ఉక్కు కోసం పోరాడేది? తమ హయాంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి, అనేక ప్రభుత్వరంగ కంపెనీలను తెగనమ్మిన ఘనులా ఇప్పుడు మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది? కడపలో స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ దానికి అవసరమైన ఇనుప ఖనిజ గనులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేకపోయిన విషయం నిజం కాదా?


2019 మార్చి నాటికే దేశంలోని 70 ప్రభుత్వరంగ సంస్థలు కొన్ని వేలకోట్ల మేరకు నష్టాల్లో ఉన్నాయని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌కు తెలిపింది. మోదీ ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థలపై ఒక విధాన నిర్ణయం తీసుకున్నది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ, ఉమ్మడి పెట్టుబడులను ప్రోత్సహించడం, ఆధునికీకరణ, మెరుగైన మార్కెటింగ్ వ్యూహాలు, కార్పొరేట్ తరహా యాజమాన్య నిర్వహణ, బోర్డుల్లో వృత్తినిపుణులను నియమించడం వంటి అనేక చర్యల్ని చేపట్టాలని నిర్ణయించింది. ఇది కేవలం విశాఖ ఉక్కు ప్లాంట్‌కే కాదు, దేశంలోని అనేక ప్రభుత్వరంగ సంస్థలకు వర్తిస్తుంది. నిజానికి దేశ నిర్మాణంలో ప్రభుత్వరంగానికే కాదు, ప్రైవేట్‌రంగానికి కూడా సమాన భాగస్వామ్యం కల్పించాలన్నదే మోదీ సర్కార్ విధానం. ‘కేవలం ఐఏఎస్ అధికారులకే అన్నీ అప్పజెప్పాలా? అలా అప్పజెప్పి మనమేం సాధించాం? ఈ దేశంలో మనం యువకులకు అత్యధిక అవకాశాలు కల్పించాలి. దేశంలో సంపద సృష్టిస్తున్న ప్రైవేట్‌రంగాన్ని కూడా మనం గౌరవించాలి’ అని ప్రధాని మోదీ పార్లమెంట్‌లోనూ, ఇటీవల జరిగిన నీతీ ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలోనూ చెప్పారు. అన్ని రాష్ట్రాలు వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని, చట్టపరమైన, అధికారపరమైన అడ్డంకులను తొలగించాలని ముఖ్యమంత్రులకు మోదీ సూచించారు.


పీవీ హయాంలో లైసెన్స్ రాజ్‌ను రద్దు చేసినప్పటికీ ప్రభుత్వమే ఉత్పాదక రంగంలోనూ, సేవలరంగంలోనూ, వ్యాపారరంగంలోనూ పాల్గొంటూ మన ఆర్థిక, పారిశ్రామిక సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోకపోవడం నిజం కాదా? ప్రభుత్వరంగ సంస్థల్లో అనేకం అంతర్గత వనరులను సమీకరించకుండా, సౌకర్యాలను ఆధునికీకరించకుండా, ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచకుండా ప్రజలు కట్టే పన్నులపై ఆధారపడడం సరైనదా? ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పడాలంటే, సామాన్యుడి జీవన ప్రమాణాలు పెరగాలంటే, ఆర్థిక వ్యవస్థ వేగంగా ఊపందుకోవాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని మోదీ భావించినందువల్లే ఆ దిశగా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. గతంలో లాగా మోదీ ప్రభుత్వం ఓటుబ్యాంకు రాజకీయాలు చేయదలుచుకోలేదు, ప్రజలను మభ్యపెట్టి, బూటకపు వాగ్దానాలు చేసి, ఏరు దాటిన తర్వాత తెప్పతగలేయడం మోదీ విధానం కాదు. అధిక పెట్టుబడులతో పాటు కొత్త టెక్నాలజీ రావాలంటే, నాణ్యమైన ఉత్పాదకత జరగాలంటే, ఉపాధి కల్పన పెద్దఎత్తున జరగాలంటే కేవలం ప్రభుత్వరంగం వల్లే సాధ్యం కాదని, ప్రైవేట్‌రంగానికి అవకాశం ఇవ్వాలని మోదీ సర్కార్ ఒక స్పష్టమైన సైద్ధాంతిక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.


ఈ దేశంలో ఒక నిర్దిష్ట లక్ష్యంతో ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం కృషి చేయాల్సిన రాజకీయ పార్టీలు ఇవాళ కుత్సిత రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ప్రజలను ఆందోళన చేసేందుకు పురికొల్పుతూ ఆ ఆందోళనను తమ ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాని ఇప్పుడు అలాంటి పాతకాలపు రాజకీయాలకు కాలం చెల్లింది. దేశంలో పెద్దఎత్తున జరుగుతున్న మౌలిక సదుపాయాల కల్పనను ప్రజలు గమనిస్తున్నారు. మోదీ హయాంలో ఆధునిక గుజరాత్ నిర్మాణం జరిగిందని, ఇప్పుడు ఆధునిక భారత నిర్మాణం వేగవంతంగా జరుగుతుందని వారికి తెలియనిది కాదు. ‘మోదీ నాకు బాగా తెలుసు, ఆయన అవినీతి మచ్చ లేని, నిజాయితీ గల, దేశ ప్రయోజనాల గురించి తపనపడే అంకితభావం గల వ్యక్తి. మోదీ ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా విమర్శించడం ప్రత్యర్థులకు అలవాటైపోయింది’ అని మెట్రో రంగంలో విప్లవాత్మక విజయాలు సాధించిన శ్రీధరన్ చెప్పిన విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా విశాఖ ఉక్కు విషయంలోనైనా మరే నిర్ణయం గురించైనా నిర్మాణాత్మక, ఆచరణీయమైన సలహాలను ఇస్తే మోదీ సర్కార్ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నది. వీధి రాజకీయాలు చేసే వారు ఏమీ సాధించలేరు.


వై. సత్యకుమార్

బిజెపి జాతీయ కార్యదర్శి

Updated Date - 2021-02-23T06:30:51+05:30 IST