అమెరికా వీధికి భారతీయురాలి పేరు !

ABN , First Publish Date - 2020-10-01T21:07:05+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ఓ భారతీయురాలికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ఓ వీధికి ఆమె పేరు పెట్టడం విశేషం.

అమెరికా వీధికి భారతీయురాలి పేరు !

కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో ఓ భారతీయురాలికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ఓ వీధికి ఆమె పేరు పెట్టడం విశేషం. భారత్ నుంచి 1915లో అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడిన భారతీయురాలు కలా బగాయ్‌కు మరణానంతరం ఈ అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని బర్కిలీలోని ఓ వీధికి తాజాగా ఆమె పేరు పెట్టారు. అక్కడికి వెళ్లిన తొలినాళ్లలో బగాయ్‌ తీవ్ర జాతి వివక్షతను ఎదుర్కొన్నారు. పొరుగువారి జాత్యహంకారంతో తన కొత్త ఇంటిని కూడా వదిలిపెట్టాల్సి వచ్చింది. అయినా భయపడకుండా ఆమె అక్కడే ఉండి వాటిని తిప్పికొట్టారు. బగాయ్ పట్టుదలకు గుర్తింపుగా తాజాగా ఆమెకు ఈ గౌరవం దక్కింది.  


అమృత్‌సర్‌లో పుట్టిన బగాయ్‌కు 11వ యేటానే వివాహమైంది. దాంతో 1915లో ఆమె తన భర్త వైష్ణో దాస్ బగాయ్‌తో కలిసి అమెరికా వెళ్లారు. అప్పుడు ఆ దంపతుల వద్ద ఉన్న మొత్తం సొమ్ము 25వేల డాలర్లు మాత్రమే. అమెరికాలో సుమారు 2 వేల మంది భారతీయులు నివసిస్తున్న సమయంలో ఆమె కుటుంబం బర్కిలీలో తోటి నివాసితుల చేతిలో నిరంతరం జాత్యహంకారాన్ని ఎదుర్కొంది. బగాయ్ వాటిని పట్టుదలతో తిప్పికొట్టారు. మరోవైపు బగాయ్ గ్రేట్ బ్రిటన్ నుండి భారత్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సమయంలో యూసీ బర్కిలీలోని విద్యార్థులు ప్రారంభించిన 'గదర్ పార్టీ' ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అదే సమయంలో అమెరికా వలస వచ్చే భారత సమాజం కోసం బగాయ్ తనవంతు కృషి చేశారు. వారు జాత్యహంకారాన్ని గురికాకుండా బగాయ్ పలు ప్రచార కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించారు. అమెరికా వచ్చే భారతీయులకు భరోసా కల్పించారు. వారి హక్కుల గురించి తెలియజేశారు. 1950లో అమెరికా పౌరసత్వం పొందిన బగాయ్ 1983లో మరణించారు.    

Updated Date - 2020-10-01T21:07:05+05:30 IST