నకనకలాడుతున్న వీధికుక్కలు!

ABN , First Publish Date - 2020-03-29T10:38:26+05:30 IST

రోజూ మాంసం ముక్కలు, మేక బొక్కలు వేసే మటన్‌ దుకాణం మస్తాన్‌ ఏమయ్యాడు? బ్రెడ్డు ముక్కలు పెట్టే బేకరీ యజమానికి ఎక్కడికెళ్లాడు? ‘జూ.. జూ..’ అని పిలుస్తూ, ఇంట్లో మిగిలిన అన్నాన్ని పెట్టే ముసలావిడ

నకనకలాడుతున్న వీధికుక్కలు!

అన్నం పెట్టేవారు.. ఆదరించేవారు కరువు... ఆకలితో అలమటిస్తున్న శునకాలు

అక్కడక్కడా స్వచ్ఛంద సంస్థల సాయం

వాటి మరణాలతో రేబిస్‌ ముప్పు


హైదరాబాద్‌ సిటీ, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రోజూ మాంసం ముక్కలు, మేక బొక్కలు వేసే మటన్‌ దుకాణం మస్తాన్‌ ఏమయ్యాడు? బ్రెడ్డు ముక్కలు పెట్టే బేకరీ యజమానికి ఎక్కడికెళ్లాడు? ‘జూ.. జూ..’ అని పిలుస్తూ, ఇంట్లో మిగిలిన అన్నాన్ని పెట్టే ముసలావిడ ఏమైపోయింది? నిత్యం బువ్వ పెట్టే ఫంక్షన్‌ హాల్స్‌లో జనాలు ఎందుకు ఉండటం లేదు? అసలు ఈ నగరానికి ఏమైంది..! మాకు కనీసం అన్నం ముద్ద పెట్టేవారే లేరా..!! అంటూ ఏం జరుగుతోందో తెలియక నగరంలోని వీధికుక్కలు అయోమయంతో.. ఆకలితో.. అలమటిస్తున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా సకలం బంద్‌ అవ్వడంతో.. వాటి బాగోగులు చూసేవారు లేక.. చిక్కి శల్యమైపోతున్నాయి. దీనికి తోడు.. పెరిగిన ఎండలతో డీ-హైడ్రేషన్‌కు గురై.. సొమ్మసిల్లి పడిపోతున్నాయి. ఆకలితో డొక్కలెండిపోయి చనిపోతున్నాయి.


కుక్కలపై పుకార్లతో..

లాక్‌డౌన్‌ వల్ల వీధి కుక్కలకు ఇంత బువ్వపెట్టేవారు లేకపోగా.. పిల్లులు, కుక్కలు కూడా కరోనా వ్యాపకాలంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లతో మిగతావారు కూడా వాటి జోలికి వెళ్లడం లేదు. ఇంట్లో మిగిలిన అన్నాన్ని వాటికి పెట్టే ప్రయత్నం చేసేవారిని అడ్డుకుంటున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా ఉంటున్న ఆరేడు లక్షల వీధి శునకాలను ఇప్పుడు ఆదరించేవారే కరువయ్యారు. నిజానికి వీధికుక్కలు ఒక ప్రదేశాన్ని వీడి మరో ప్రాంతానికి వెళ్లనే వెళ్లవు. అలాంటిది ఇప్పుడు ఆకలి వాటిని వలసజీవులుగా మార్చేసింది. కాలనీలు వీడి.. వేరే చోట్లకు వెళుతున్నాయి. అక్కడ ఉండే కుక్కలు వీటిపై దాడి చేస్తున్నాయి. ఈ క్రమంలో.. వాటిలో అవే గాయపరుచుకుంటున్నాయి.


ఇలాంటి పరిస్థితులకు తోడు.. వీధుల్లో కుక్కల మరణాలతో రేబిస్‌ వంటి వ్యాధులు, వాటి మృతకళేబరాల నుంచి వచ్చే వాసనలు, బ్యాక్టీరియాతో అంటువ్యాధుల ముప్పు కూడా పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలనీల్లో ఉండే వీధికుక్కల పరిస్థితి కొంత ఫర్వాలేదనిపించినా.. వ్యాపార సముదాయాలు, ఐటీ కారిడార్‌లో ఉండే వీధికుక్కలను పట్టించుకునేవారే కరువయ్యారు. 


స్వచ్ఛంద చొరవ

వీధి కుక్కలను ఆదుకోవాలనే ఉద్దేశంతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. ఆసరా సంస్థ కొంత వరకు వాటి ఆకలిని తీరుస్తుండగా.. యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఏడబ్ల్యూబీఐ) వంటి సంస్థలు వీధికుక్కలను ఆదుకోవాలని, వాటివల్ల కరోనా రాదంటూ అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖలు రాస్తున్నాయి. వీధికుక్కలకు అన్నం పెట్టకున్నా.. వాటికోసం కనీసం నీటిని అందించాలని ఆసరా సంస్థ ప్రజలను కోరుతోంది. ఆ సంస్థ కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో వీధికుక్కల కోసం వంటలు చేస్తోంది. ఆసరా కార్యదర్శి వందన మణికొండలో రోజూ 40-50 కుక్కలకు అన్నం పెడుతుండగా.. ఆ సంస్థ అధ్యక్షురాలు వసుంధర.. వీధికుక్కలకు అన్నం పెట్టాలని ప్రచారం చేస్తున్నారు. 


ప్రభుత్వ సాయం అడిగాం

వీధికుక్కలకు ఆహారం అందించడం అవసరమే. ప్రభుత్వ స్థాయిలో పోలీసు అదనపు డీజీ, స్టేట్‌ యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు సాయం అడిగాం. వారు ఏదైనా ప్రకటన చేస్తారని ఎదురుచూస్తున్నాం. ప్రజలు కూడా వాటికి ఆహారం పెట్టాలి. అందుకోసం ప్రత్యేకంగా ఖర్చుచేయాల్సిన అవసరం లేదు. వారి ఇళ్లలో మిగిలిన ఆహారాన్ని పెడితే చాలు.

వసుంధర, ఆసరా అధ్యక్షురాలు

Updated Date - 2020-03-29T10:38:26+05:30 IST