దారి తప్పిన ‘ధరణి’!

ABN , First Publish Date - 2021-12-25T08:13:14+05:30 IST

అవి మొత్తం 365 ఎకరాలు. ఇందులో 65 ఎకరాలు 98 మంది

దారి తప్పిన ‘ధరణి’!

  • ఒకే సర్వే నంబరుపై 365 ఎకరాలు..
  • చనిపోయిన రైతు పేరిట నమోదు..
  • 98 మంది భూములు మాయం 
  •  లోపాలతో తాటికోలువాసుల్లో ఆందోళన


నల్లగొండ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అవి మొత్తం 365 ఎకరాలు. ఇందులో 65 ఎకరాలు 98 మంది రైతుల పట్టా భూములు కాగా, మిగతావి ప్రభుత్వ భూములు. అయితే, ఈ మొత్తం భూములన్నీ ఓ రైతు పేరిట పాస్‌ పుస్తకంలో నమోదై ఉన్నాయి... పైగా ఆ రైతు ఇప్పటికే మృతి చెందాడు... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలులోకి తెచ్చిన ధరణి పోర్టల్‌లోని లోపాలు, దోషాలు, చిత్ర విచిత్రాల్లో ఇదొకటి.


నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం తాటికోలు గ్రామానికి చెందిన బాలగోని ఇద్దయ్యకు సంబంధించిన పాస్‌పుస్తకం నంబరు టి28080110368లో, సర్వే నంబరు 490బై ఆ2 ఖాతానంబరు 607 కింద ఈ నమోదు జరిగింది. పోర్టల్‌లో నమోదు క్రమం, ఆ తరువాత వాటికి పరిష్కారాలు లేకపోవడమే సమస్యకు మూల కారణమని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే ఆ ఖాతాలో భూములు నమోదైనా డిజిటల్‌ సైన్‌ పెండింగ్‌ జాబితాలో నమోదు చేశారు. కేవలం ఆరు సర్వే నెంబర్లకు మాత్రమే డిజిటల్‌ సంతకం చేసినట్లుగా రికార్డులో ఉంది. మిగతా సర్వే నెంబర్లు సబ్‌ డివిజన్ల పైన ఉన్న విస్తీర్ణానికి సంబంధించి డిజిటల్‌ సంతకం పెండింగ్‌లో ఉంది. ఈ మొత్తం 365 ఎకరాలు ఇద్దయ్య పేరిట నమోదైనట్లు ధరణి పోర్టల్‌లో చూపిస్తోంది.


ఇద్దయ్య 2018లో మృతి చెందగా, ఆయనకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా; కుమారుడికి 18 ఏళ్లు. ఇక బాధిత రైతులంతా ఒక గుంట నుంచి మొదలుకొని మూడెకరాల భూమి కలిగిన వారే. ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులే ఉన్నారు. ధరణి పోర్టల్‌లో నమోదుచేసే సమయంలో పొరపాటు కారణంగా ఇద్దయ్య నుంచి ఆ భూమిని తిరిగి ఇప్పుడు అసలు రైతులకు ఇవ్వలేని పరిస్థితి ఉంది. దీంతో ఏడాదిగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ 365 ఎకరాల పరిస్థితి ఇలా ఉంటే గ్రామంలో మిగిలిన వారికి సంబంధించిన భూమి సైతం పూర్తిగా నమోదు కాలేదని తప్పుల తడకగా రికార్డులు ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 



అధికారుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు

భూములను తమ పేరుపైకి మార్చాలని రైతులు అధికారులు చుట్టూ తిరుగుతున్నా ఆధార్‌కార్డు తేవాలంటూ, ధ్రువీకరణ పత్రాలు కావాలంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సాంకేతిక సమస్యలంటూ జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమ భూములు వేరే రైతు పేరిట నమోదు కావడంతో 2020 నుంచి అనేక సంక్షేమ పథకాలతో పాటు రైతు బంధు, రైతుబీమా వంటి పథకాలు కూడా వారికి దక్కడం లేదు. 




  • మిస్సింగ్‌ సర్వే నంబర్లకు మోక్షమెన్నడో !?
  •  మార్పుల కోసం అన్నదాతల నిరీక్షణ


వరంగల్‌: వ్యవసాయ భూముల క్రయ, విక్రయాలను సులభతరం చేసే ఉద్దేశంతో అందుబాటులోకి తెచ్చిన ‘ఽధరణి’ పోర్టల్‌ భూ యజమానులకు చుక్క లు చూపిస్తోంది. ‘ఽధరణి’ అమల్లోకి వచ్చి ఏడాది దాటినా అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. మిస్సింగ్‌ సర్వే నంబర్ల అంశంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో దిద్దుబాటు చర్యలు తీసుకునే అధికారం లేకపోవడంతో జిల్లా అధికారులు హైదరాబాద్‌లోని భూ పరిపాలనా విభాగం చీఫ్‌ కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)కు లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్నారు.


వరంగల్‌లోని పలు ప్రాంతాలు ఒకప్పుడు వ్యవసాయ భూములుగా ఉండేవి. అవి కాలక్రమేణా నివాసిత ప్రాంతాలుగా, కాలనీలుగా మారిపోయాయి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు వాడాలనుకున్నప్పుడు ‘నాలా’ విధానంలో అనుమతులు పొందాలి. వాటిని రెవెన్యూ రికార్డుల్లో హౌస్‌ సైట్స్‌గా పేర్కొంటారు. అయితే ఎల్‌ఆర్‌యూపీ (ల్యాండ్‌ రికార్డ్స్‌ అప్‌డేషన్‌ ప్రోగ్రాం) సమయంలో రెవెన్యూ సిబ్బంది చేసిన అనేక పొరపాట్ల వల్ల వ్యవసాయ భూములు కూడా హౌస్‌ సైట్స్‌గా రికార్డయ్యాయి.


అనేక చోట్ల కబ్జాలో వ్యవసాయ భూములు ఉన్నప్పటికీ, అక్కడ ఎలాంటి ఇళ్ల నిర్మాణాలు లేనప్పటికీ.. పట్టా, అనుభవదారు కాలమ్స్‌లో హౌస్‌ సైట్స్‌అని నమోదుచేశారు. దీంతో అనేకమంది రైతుల సర్వే నంబర్లు, పేర్లు రికార్డుల్లో గల్లంతయ్యాయి. భూములు ఇప్పటికీ తమ స్వాధీనంలోనే ఉన్నాయని, ఎవరికీ అమ్మలేదని.. అయినా తమ సర్వే నంబర్లు, పేర్లు గల్లంతయ్యాయ ని అధికారులు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి పొరపాటును గుర్తించారని, దిద్దుబాటుకు సీసీఎల్‌ఏకు లేఖ రాశారని చెప్పారు. అయినా స్పందన లేదని  బాధిత రైతులు పేర్కొంటున్నారు.  




నాకు 5.37 ఎకరాల భూమి ఉంది. అయితే రికార్డులో మాత్రం 1.37ఎకరాల భూమి మాత్రమే రికార్డులో నమోదైంది. మిగిలిన 4 ఎకరాల భూమి ఎక్కడ ఉందో తెలియడం లేదు. నా భూమిని రికార్డులో నమోదు చేయాలని అధికారులకు మొర పెట్టుకున్నా లాభం లేకుండా పోయింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. 


నాలుగెకరాలు రికార్డులో లేదు.. 

- గండ్ర బాలనారి, రైతు, తాటికోలు 



ఒకే రైతు పేరిట భూమి నమోదుకు సాంకేతిక సమస్యలే ప్రధాన కారణం. పట్టా భూములకు సకాలంలో ఆధార్‌కార్డులు అందజేసి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోకపోవడంతోనే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆన్‌లైన్‌ సమస్యలన్నింటినీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం. 

సాంకేతిక సమస్యలే కారణం

-గోపీరాం, ఆర్డీఓ, దేవరకొండ 




ఖాతా నెంబరు 607లో భూములు తప్పుగా నమోదయ్యాయి. ఇది సిబ్బంది చేసిన దోషంగానే గుర్తించాం. చనిపోయిన రైతు ఇద్దయ్య వాస్తవ భూమి 6.37 ఎకరాలే. ఈ సమస్య తీరాలంటే ధరణిలో మిస్సింగ్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆప్షన్‌ ప్రభుత్వం ఇవ్వాలి. దాని కోసం చూస్తున్నాం. అది రాగానే బాధిత రైతులు దరఖాస్తు చేసుకుంటే ఇద్దయ్య ఖాతాలోంచి తొలగించి అసలైన రైతుల పేరిట నమోదు చేస్తాం. దీనికి బాధ్యులు ఎవరనేది కూడా విచారణ చేయిస్తున్నాం. 

  • సమస్యను పరిష్కరిస్తాం 
  • - చంద్రశేఖర్‌, అదనపు కలెక్టర్‌ 

Updated Date - 2021-12-25T08:13:14+05:30 IST