PKతో YSRCP విడాకులు.. సర్వేలో ఏం తేలింది.. వెంటాడుతున్న భయం..!

ABN , First Publish Date - 2022-05-05T16:38:52+05:30 IST

ప్రశాంత్‌ కిషోర్‌ అలియాస్‌ పీకే! రాజకీయాలపై కొద్దోగొప్పో అవగాహన ఉన్నవారందరికీ తెలిసిన పేరు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చెప్పగలిగే

PKతో YSRCP విడాకులు.. సర్వేలో ఏం తేలింది.. వెంటాడుతున్న భయం..!

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌కు వైసీపీ మంగళం పాడేసిందా? 2019 ఎన్నికలకు ముందు పీకేను భుజానికెత్తుకున్న వైసీపీ ఇప్పుడా బరువు దించుకోవాలనుకుంటోందా? పీకేతో కలిసి పనిచేసిన వైసీపీ కార్యకర్తలతోనే వచ్చే ఎన్నికల్లో బండి లాగించేయాలని చూస్తోందా? తద్వారా వందల కోట్లు ఆదా చేసుకోవచ్చని భావిస్తోందా? పీకేతో సాగితే బీజేపీ ఆగ్రహిస్తుందనే భయమూ వైసీపీని వెంటాడుతోందా? అసలు పీకేతో వైసీపీ విడాకుల వెనుక రీజనేంటి? అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎ సైడర్ లో తెలుసుకుందాం..


ప్రశాంత్‌ కిషోర్‌ అలియాస్‌ పీకే!
ప్రశాంత్‌ కిషోర్‌ అలియాస్‌ పీకే! రాజకీయాలపై కొద్దోగొప్పో అవగాహన ఉన్నవారందరికీ తెలిసిన పేరు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చెప్పగలిగే నైపుణ్యం పీకే సొంతం. కులాలవారీగా విభజన, భావోద్వేగాలను రెచ్చగొట్టడం, సెంటిమెంట్స్‌ రగిలేలా చేయడం పీకే ట్రేడ్‌ మార్క్‌ టెక్నిక్స్‌. ఈ పద్ధతినే 2019 ఎన్నికలలో ఏపీలో అమలు చేసి సక్సెస్‌ అయ్యారు. ఏపీ సమాజాన్ని నిట్టనిలువుగా చీల్చిన వ్యక్తిగా పీకేకు పేరుంది.  సర్వేలు చేసి ప్రజల నాడి పట్టుకోవడం, అందుకనుగుణమైన పావులు కదపడం, ప్రత్యర్థిపై విరుచుకుపడేలా ప్రచారంచేసి వైసీపీకి విజయాన్ని తెచ్చిపెట్టారు.  ఒక్క చాన్స్‌ పేరుతో రావాలి జగన్‌ .. కావాలి జగన్‌ ట్యూన్‌తో క్యాంపెయిన్‌లో స్పీడ్‌ పెంచారు. ఎన్నికలు ముగిసిన  తరువాత కూడా ఆయా జిల్లాల్లో ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌లు కార్యాలయాలను నిర్వహిస్తున్నాయి. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నివేదికలను ఇస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే నిఘావర్గాలకంటే జగన్‌ ఈ టీమ్‌ల నివేదిక పైనే ఎక్కువగా ఆధారపడ్డారు. ఈ టీమ్‌లలో ఉన్న చాలామందికి వేరే ఉద్యోగాలు రావడంతో వెళ్లిపోయారు. ఐ ప్యాక్‌ నుంచి కొత్త వారు రాలేదు.


రెండునెలల కిందట ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌ ఏపీలో సర్వే
ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్‌కు, పికేకు మధ్య మంతనాలు సాగాయి. పీకే కాంగ్రెస్‌లో చేరుతున్నారనే వార్తలు హల్చల్‌ చేశాయి. ఈ వ్యవహారం వైసీపీకి నచ్చలేదని తెలుస్తోంది. వైసీపీ బీజేపీకి దగ్గరగా ఉంది. దీంతో వైసీపీకి, పీకేకు మధ్య సత్సంబంధాలు లేవని తెలుస్తోంది. ఇప్పటికే ఐ ప్యాక్‌ టీమ్‌ నుంచి చాలామంది బయటకు వెళ్లిపోయారు. కేవలం స్కెలిటన్‌ స్టాఫ్‌ మాత్రమే ఉంది. ఈనేపథ్యంలో రెండునెలల కిందట ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌ ఏపీలో సర్వే  చేసి  ఇచ్చిన రిపోర్ట్‌   వైసీపీ వర్గాలకు ఎంత మాత్రం నచ్చలేదని తెలిసింది. అధికారంలో ఉన్నప్పుడు తమకు వ్యతిరేకం వచ్చే నివేదికలేవీ సహజంగానే  ఏలిన వారికి నచ్చవు. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉండగా ఇదే జరిగింది. ఇప్పుడు వైసీపీలోనూ  సేమ్‌ సీన్‌ రిపీటవుతోందని ఎంపి ఒకరు ఆఫ్‌ ది రికార్డ్‌గా చెప్పారు. పికే టీమ్‌ ఇచ్చిన నివేదికలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందని, ఇసుక లభ్యత లేకపోవడం, పన్నుల పెంపు, మధ్యం ధరలు, తదితర అనేక అంశాలు సామాన్య, మధ్యతరగతి ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతున్నాయని తేల్చి చెప్పారు. రాజధాని వ్యవహారం పై కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అది సైలెంట్‌ కిల్లర్‌గా మారబోతోందని, ఎన్నికల సమయంలో ఆ ప్రభావం కనిపిస్తుందని కూడా ఆ నివేదికలో తెలిపారుట.


పీకేతో కలిసి పనిచేసిన వైసీపీ సభ్యులు
కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నేతల పై వచ్చిన ఆరోపణలు ప్రభుత్వ ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేశాయని కూడా విశ్లేషించారుట. ఈ డ్యామేజ్‌ని కంట్రోల్‌ చేయకపోతే ఎంత డబ్బు ఇచ్చినా ఉపయోగం ఉండదని కూడా తేల్చి చెప్పారుట. ఒకసారి వ్యతిరేకత పతాకస్థాయికి చేరితే అరికట్టడం అంత తేలిక కాదని ఆ నివేదికలో సూచించారుట. ఈ నివేదిక పార్టీ నేతలకు ఎంత మాత్రం నచ్చలేదని తెలుస్తోంది.  ఇటీవలప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, పీకేతో  తమకు సంబంధం లేదని, ఆయన తమ కోసం పనిచేయడం లేదని చేసిన వ్యాఖ్యలు కూడా పీకే పై సాగుతున్న ప్రచారాన్ని బలపరుస్తున్నాయి. ఐ ప్యాక్‌ టీమ్‌లో కొత్త వారిని నియమించాలని పీకేని కోరినప్పటికీ, ఆయన పెద్దగా స్పందించలేదని చెబుతున్నారు.  ఇదే సమయంలో పీకేతో కలిసి పనిచేసిన కొంతమంది వైసీపీ సభ్యులు తాము పీకే వ్యూహాలను అమలు చేయగలమని పార్టీ నేతలకు చెప్పినట్టు తెలిసింది.


పీకే విషయంలో బీజేపీ నేతలు ఆగ్రహం
పార్టీ కీలక నేతలకు ఈ విషయం బాగా నచ్చిందిట.  పైగా పీకేకు వందల కోట్ల రూపాయలు ఇచ్చే బదులు తమవారితోనే పీకే వ్యూహాలు అమలు చేయిస్తే పోలా అనే నిర్ణయానికి వచ్చారు. పీకే  సేవలను ఉపయోగించుకోవాలో లేదో తాము నిర్ణయించుకోలేదని సజ్జల బహిరంగంగానే చెప్పారు. పీకే  జగన్‌కు మధ్య సంబంధాలు దెబ్బతినడం వెనుక రాజకీయం  ఉందని చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీలో జాతీయ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయ వేదిక రూపొందించేందుకు తంటాలు పడుతున్న పీకే  అంటే బీజేపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పీకేతో కొనసాగితే   ఢిల్లీలో బీజేపీ నేతలు సీబీఐ కేసుల్లో ఎక్కడ బటన్‌ నొక్కుతారోనన్న ఆందోళన కూడా వైసీపీ కీలక నేతలను వెంటాడుతోందని చెబుతున్నారు. అందుకే పీకేను దూరం పెట్టినట్టు తెలుస్తోంది.

Read more