Advertisement
Advertisement
Abn logo
Advertisement

తిరుపతిలో విచిత్రం

భూమిలోని సంప్‌ తొమ్మిది అడుగులు పైకొచ్చిన వైనం


తిరుపతి(పద్మావతినగర్‌), నవంబరు 26: సిమెంటు వరలతో భూమిలోపల ఏర్పాటుచేసిన నీటి సంప్‌ అకస్మాత్తుగా పైకి వచ్చిన ఘటన గురువారం సాయంత్రం తిరుపతిలో చోటుచేసుకుంది.పెయింటర్‌ ఈశ్వర్‌, మునెమ్మ దంపతులు తిరుపతిలోని మహిళావర్శిటీ సమీపంలో వున్న శ్రీకృష్ణనగర్‌ 15వ వీధిలో కాపురముంటున్నారు. నీటి నిల్వకోసం పదేళ్లక్రితం ఇంటి ఆవరణలో 18 సిమెంటు వరలతో సంప్‌ను నిర్మించారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతమంతా జలమయమైంది. వరద నీరు తగ్గిపోయిన తరువాత సంప్‌లో చేరిన బురదనీటిని శుభ్రం చేసేందుకు మునెమ్మ సంప్‌ పైకెక్కింది. సగానికి పైగా తోడేసిన తరువాత... సంప్‌ ఒక్కసారిగా పైకి రావడం ప్రారంభమైంది. భయపడి స్థాణువులా నిలబడిపోయిన మునెమ్మ తేరుకునేటప్పటికి సంప్‌తో పాటు భూమిపై నుంచి సుమారు తొమ్మిది అడుగులు పైకి వెళ్లిపోయింది. మునెమ్మ కేకలు విని అక్కడికి చేరుకున్న ఇరుగుపొరుగు జనం ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈలోపు అక్కడికి చేరుకున్న మునెమ్మ భర్త ఈశ్వర్‌ ఆమెను క్షేమంగా కిందకు దించారు.శుక్రవారం ఉదయం తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి శ్రీకృష్ణనగర్‌కు చేరుకుని ఆ సంప్‌ను పరిశీలించారు. శంకర్‌ కుటుంబానికి, స్థానికులకు ధైర్యం చెప్పారు. ఎస్వీయూ జియాలజీ ప్రొఫెసర్‌ మధును పిలిపించి చూపించారు.అప్పుడప్పుడూ ఇలా జరగడం సాధారణమేనని ఆయన స్పష్టం చేశారు. పురాతన కాలంనుంచి  75 సంవత్సరాల క్రితం వరకు శ్రీకృష్ణనగర్‌ పరిసర ప్రాంతాలు స్వర్ణముఖి నది క్యాచ్‌మెంట్‌ ఏరియా అన్నారు. సుమారు 60-70 సంవత్సరాల తరువాత మళ్లీ అంతటి వర్షపాతం తిరుపతిలో ఇటీవల కురిసిన వర్షాలవల్ల నమోదైందని, ఈ పరిస్థితుల్లో భూమిలోని ప్రతీ పొరలోను నీరు పుష్కలంగా చేరిందన్నారు. ఇక సుమారు 15 అడుగుల లోతున భూమిలో వరలతో సంప్‌ను నిర్మించారని, ప్రస్తుతం సంప్‌ చుట్టూ, కింద ఉన్న మట్టి బురదలా మెత్తబడడం, భూగర్భ జలాలు పెరగడంతో... ఓ డ్రమ్‌ను నీళ్లలో పెడితే ఎలా పైకి లేస్తుందో అలాగే సంప్‌ పైకి తేలిందని వివరించారు.తిరుపతి ప్రాంతంలో భూమిలోపల గట్టి శిల ఉందని, భయపడాల్సినంత భూకంపం వచ్చేందుకు ఇక్కడ పెద్దగా అవకాశం లేదన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

Advertisement
Advertisement