యూఏఈ వెళ్లాలా.. కొంచెం రిస్క్ అయినా ఓకే అంటే ఇలా ట్రై చేయొచ్చు!

ABN , First Publish Date - 2021-05-16T17:38:13+05:30 IST

కొవిడ్ విజృంభణ కారణంగా భారత్ నుంచి వెళ్లే ప్రయాణికులపై యూఏఈ నిషేధం విధించింది. ఈ క్రమంలో యూఏఈ వెళ్లేందుకు ప్రయాణికులు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రయాణికుల ఆసక్తిని గమని

యూఏఈ వెళ్లాలా.. కొంచెం రిస్క్ అయినా ఓకే అంటే ఇలా ట్రై చేయొచ్చు!

అబుధాబి: కొవిడ్ విజృంభణ కారణంగా భారత్ నుంచి వెళ్లే ప్రయాణికులపై యూఏఈ నిషేధం విధించింది. ఈ క్రమంలో యూఏఈ వెళ్లేందుకు ప్రయాణికులు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రయాణికుల ఆసక్తిని గమనిస్తున్న ట్రావెల్ ఏజెంట్లు కూడా అందుబాటు ధరల్లో ప్యాకేజీలను రూపొందిస్తూ ఆకర్షిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇండియాలో మహమ్మారి విజృంభిస్తుంది. దీంతో భారత ప్రయాణికులపై యూఏఈ నిషేధం విధించింది. ఈ క్రమంలో యూఏఈలో ఉద్యోగం చేస్తూ, కుటుంబ సభ్యులను కలవడానికి లేదా ఇతర కారణాల వల్ల ఇండియాకు వచ్చిన వేలాది మంది భారతీయులు ఇక్కడే చిక్కుకున్నారు. విదేశాల్లో 14 రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉన్న ప్రయాణికులకు ఇచ్చిన మినహాయింపును ఉపయోగించుకుని యూఏఈలోకి వెళ్లేందుకు భారత ప్రయాణికులు నూతన మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ వంటి దేశాలకు వెళ్లి, అక్కడ 14 రోజులపాటు ఉండి యూఏఈకి తిరిగి వెళ్లడాన్ని ప్రారంభించారు.



అయితే ఈ దేశాల్లో కూడా కరోనా కేసులు పెరగడంతో ఆయా దేశాలపై కూడా యూఏఈ నిషేధం విధించింది. దీంతో ప్రయాణికులంతా అర్మెనియా, ఉజ్బెకిస్తాన్ బాట పడుతున్నారు. ఈ క్రమంలో పలు ట్రావెల్ సంస్థలు కూడా 6000-7000 దిర్హమ్‌లతో ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నాయి. పీసీఆర్ టెస్ట్, విమానం టికెట్, 14 రోజులపాటు హోటల్ స్టే, ఫుడ్ ఇలా అన్నింటికి కలికి గరిష్ఠంగా 7వేల దిర్హమ్‌ల వరకు వసూలు చేస్తున్నాయి. Musafir.com జనరల్ మేనేజర్ రహీష్ బాబు మాట్లాడుతూ మే 22 నాడు ముంబై నుంచి అర్మేనియా రాజధాని యెరెవాన్‌కు విమానాన్ని సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. ఈ విమానంలో ప్రయాణించిన వారంతా యెరెవాన్‌లో 14 రోజులపాటు క్వారెంటైన్‌లో ఉండి, జూన్ 6న దుబాయ్‌కి చేరుకుంటారని వెల్లడించారు. అయితే అర్మేనియా, ఉజ్బెకిస్థాన్ దేశాలపై కూడా యూఏఈ నిషేధం విధిస్తే ప్రయాణికులకు పాట్లు తప్పవని పేర్కొన్నారు. ఉద్యోగాలను కాపాడుకోవాలని  తప్పనిసరి పరిస్థితుల్లో చాలా మంది ప్రయాణికులు ఈ దారిని ఎంచుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. 


Updated Date - 2021-05-16T17:38:13+05:30 IST