ఒక గేదె కోసం ఇద్దరు పోటీ... యజమానిని గుర్తించిన మూగజీవి!

ABN , First Publish Date - 2020-10-12T14:09:08+05:30 IST

గేదెలు చోరీ కావడం, వాటిని వెతికేందుకు యజమానులు నానాపాట్లు పడిన ఉదంతాలు మనం వినేవుంటాం. అయితే యూపీలోని కన్నౌజ్‌లో ఇటువంటిదే ఒక విచిత్ర ఉదంతం...

ఒక గేదె కోసం ఇద్దరు పోటీ... యజమానిని గుర్తించిన మూగజీవి!

కన్నౌజ్: గేదెలు చోరీ కావడం, వాటిని వెతికేందుకు యజమానులు నానాపాట్లు పడిన ఉదంతాలు మనం వినేవుంటాం. అయితే యూపీలోని కన్నౌజ్‌లో ఇటువంటిదే ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ఒక గేదె తనదంటే తనదని గొడవకు దిగారు. ఈ వ్యవహారం పోలీసుల వరకూ చేరింది. అయితే పోలీసులు ఈ సమస్యను పరిష్కరించే లేక యజమాని ఎవరనే సంగతిని గేదెకే వదిలివేశారు. దీంతో ఆ మూగజీవి తన యజమానిని గుర్తించి, అతనితో వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే కన్నౌజ్ జిల్లాలోని అలీనగర్‌లో ఉంటున్న ధర్మేంద్రకు చెందిన గేదె మూడు రోజుల క్రితం చోరీకి గురయ్యింది. ఇదే రోజున తాలాగ్రామ్‌లో వీరేంద్ర అనే వ్యక్తి చెందిన గేదె కూడా చోరీకి గురయ్యింది. 



వీరిద్దరి ఫిర్యాదు మేరకు పోలీసులు ఒక గేదెను వెదికి పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ధర్మేంద్ర, వీరేంద్ర పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ గేదె తనదంటే తనదేనంటూ ఇద్దరూ వాదులాటకు దిగారు. దీంతో పోలీసులు ఆ గేదె ఎవరికి చెందినదో తేల్చలేకపోయారు. దీంతో యజమాని ఎవరో తేల్చుకునే పనిని గేదెకే వదిలిపెట్టారు. ఇందుకోసం పోలీసులు ఆ గేదెను దాని యజమానులమని చెప్పుకుంటున్నవారి మధ్య వదిలిపెట్టారు. దీంతో వారిద్దరూ పెద్ద గొంతుతో ఆ గేదెను తమ దగ్గరకు రమ్మని పిలిచారు. దీంతో ఆ గేదె కొద్దిసేపు తడబడి, దాని అసలైన యజమాని ధర్మేంద్రను గుర్తించి, అతని దగ్గరకు వెళ్లింది. దీంతో పోలీసులు ఆ గేదె ధర్మేంద్రదేనని నిర్థారించారు. దీంతో వీరేంద్ర కూడా అది ధర్మేంద్రకు చెందిన గేదేనని ఒప్పుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మరింది. 

Updated Date - 2020-10-12T14:09:08+05:30 IST