రోడ్లు పాట్లు

ABN , First Publish Date - 2022-07-07T06:10:39+05:30 IST

నూజివీడు నియోజకవర్గంలో జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర హైవే, అంతర్గత రహదారులు ప్రయాణికులకు నిత్యం నరకం చూపిస్తున్నాయి.

రోడ్లు పాట్లు
ఆగిరిపల్లి–విజయవాడ ప్రధాన రహదారిపై మాదలవారిగూడెం వద్ద..

రోడ్లపైకి వెళ్లేందుకు హడలిపోతున్న ప్రజలు

గోతులతో అధ్వానంగా రహదారులు

నీటి మూటలైన ప్రజాప్రతినిధుల హామీలు.. 


నూజివీడు నియోజకవర్గంలో జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర హైవే, అంతర్గత రహదారులు ప్రయాణికులకు నిత్యం నరకం చూపిస్తున్నాయి.  వర్షాకాలం పూర్తయ్యాక, నియోజకవర్గంలో రహదారుల పునర్నిర్మాణం, మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని అధికార పార్టీ నాయకులు గత ఏడాది పేర్కొన్నారు. అయితే ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో  మరింత అధ్వాన స్థితికి చేరి ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.


(నూజివీడు) 

నూజివీడు నియోజకవర్గంలో మచిలీపట్నం – కల్లూరు స్టేట్‌ హైవే 46ను ఇటీవల కాలంలో నేషనల్‌ హైవే 216 హెచ్‌గా కేటాయించారు. అయితే ఈ ప్రధాన రహదారి పై నూజివీడు మండల పరిధిలోని సీతారాంపురం, మర్రి బంధం, గొల్లపల్లి గ్రామాల్లో రహదారి తీవ్రంగా దెబ్బతిని, ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. నూజివీడు –విజయవాడ ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు దాదాపు రెండు ఏళ్ళ క్రితం రాష్ట్రప్రభుత్వం రూ. 32 కోట్లు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇరువైపులా మార్జిన్‌లు తవ్వి రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు. అయితే నిధుల కొరతతో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండగా  నూజివీడు – ఆగిరిపల్లి ప్రధానరహదారి పై వడ్లమాను వద్ద ఇతర గ్రామాల్లోనూ, ఆగిరిపల్లి–గన్నవరం ప్రధాన రహదారిలో అనేక గ్రామాల్లో రోడ్లు అధ్వాన్న స్థితికి  చేరాయి. దీంతో నూజివీడు నుంచి విజయవాడకు వైద్యం కోసం వెళ్ళే రోగులు  హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా విజయవాడ  వెళ్తున్నారు. దీంతో  సమయం వృధా అయ్యి, రోగులకు ప్రాణసంకటంగా సైతం మారుతోంది. 

  చాట్రాయి మండలంలో కాకర్ల –కోటపాడు రహదారి, చిత్తపూరు –బూరగ్గూడెం రహదారులు,  ముసునూరు మండలంలోని పలు రహదారులు  తీవ్రంగా దెబ్బతిన్నాయి.  ఏలూరు – నూజివీడు రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించామని ఎంపీ కోటగిరి శ్రీధర్‌, దెందులూరు  ఎమ్మెల్యే అబ్బ య్య చౌదరి ప్లీనరీలో ఆర్భాటంగా ప్రకటించారే తప్ప అమలు లేదు. నూజి వీడు –ధర్మాజిగూడెం, ఏలూరు రహదారిపై భారీ గండ్లుపడి ఏళ్లు గడుస్తున్నా మరమ్మతుల ఊసే లేదు. దీంతో భారీవాహనాలు, రాత్రి సమయా ల్లో ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. నూజివీడు –మైలవరం నియోజక వర్గాలను కలిపే  మిట్టగూడెం–అన్నేరావుపేట రహదారి సైతం ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. ఏది ఏమైనా ఇది వర్షాకాలమని అధికార పార్టీ నాయకులు  చెప్తారా? లేక రహదారి అభివృద్ధి పనులను ప్రారంభిస్తారో  వేచి చూడాలి.


అక్రమంగా తరలుతున్న గ్రావెల్లో ఒక్క శాతంతోనైనా..

నూజివీడు నియోజకవర్గంలోని తోటపల్లి క్వారీ నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనేక ప్రాంతాలకు గ్రావెల్‌ అక్రమంగా ప్రతిరోజూ వందల సంఖ్య లారీల్లో తరలి వెళుతోంది. ఈ నేపథ్యంలో అక్రమంగా తరలివెళుతున్న గ్రావెల్లో కేవలం ఒక్క శాతం గ్రావెల్‌ను ఉపయోగిస్తే ఈ రహదారుల దుస్థితిని తాత్కాలికంగానైనా మార్చవచ్చని   నియోజకవర్గ వాసులు అంటున్నారు.


 అధికారుల పర్యవేక్షణ లోపం.. ప్రయాణికులకు శాపం

ముసునూరు, జూలై 6: మండలంలో ప్రఽధాన రహదారుల మార్జిన్లలో మట్టి పోయటం వల్ల వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రహదారుల మార్జిన్‌లో గ్రావెల్‌ లేదా ఎర్రమట్టి పోసి రోలింగ్‌ చేయాల్సిన కాంట్రాక్టర్లు జిగురు మట్టిని పోసి చేతులు దులుపుకున్నారని వాహనదా రులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసినా ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించు కోక పోవడం వల్లే  వర్షానికి  మార్జిన్‌లు బురదకయ్యలుగా మారాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్త్తున్నారు.  రెండు రోజుల క్రితం సూరేపల్లి గ్రామానికి చెందిన బందెల వెంకటేశ్వరరావు బైక్‌పై ఇంటికి వస్తుండగా లారీ ఎదురుగా రావటంతో దానిని తప్పించబోయి  మార్జిన్‌లోకి దిగటంతో బైక్‌ జారి తలకు బలమైన గాయమైందని, ఈ వారంలో ఐదుగురు ప్రమాదానికి గురయ్యారని స్థానికులు వాపోయారు.  సూరేపల్లి, ముసునూరు, చెక్కపల్లి, రమణక్కపేట తదితర గ్రామాల ప్రధాన రహదారుల మార్జిన్‌లో మట్టిపోశారని,   గ్రావిల్‌, ఎర్రమట్టితో అభివృద్ధి చేయాలని   కోరుతున్నారు. 

Updated Date - 2022-07-07T06:10:39+05:30 IST