ఇంటర్‌ తంటాలు

ABN , First Publish Date - 2022-09-18T06:45:30+05:30 IST

ఉన్నత పాఠశాలల్లో జూనియర్‌ కళాశాల నిర్వహణ ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అనేలా సాగుతోంది.

ఇంటర్‌ తంటాలు
నూజివీడు బాలికోన్నత పాఠశాల


ప్రశ్నార్థకంగా పాఠశాలల్లో జూనియర్‌ కళాశాలలు

పుస్తకాలు లేవు..అధ్యాపకులు లేరు

తరగతి గదులకూ కొరతే.. అయోమయంలో విద్యార్థులు

నూజివీడు నియోజకవర్గంలో పరిస్థితి ఇదీ..


ఉన్నత పాఠశాలల్లో జూనియర్‌ కళాశాల నిర్వహణ ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అనేలా సాగుతోంది. మౌలిక వసతులు, ఇతర సౌకర్యాల గురించి పట్టించుకోకపోవడంతో స్థానికంగా ఇబ్బంది వున్నా ఆయా పాఠశాలల్లోనే కొనసాగాల్సిన పరిస్థితి. దీనికి తోడు నేటికి పాఠ్యపుస్తకాలు, అధ్యాపకుల కేటాయింపు జరగలేదు. ఫలితంగా నూజివీడు డివిజన్‌ పరిధిలోని నూజివీడు నియోజకవర్గంలో నాలుగు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతోంది. 


(నూజివీడు టౌన్‌)

బాలిక విద్యను ప్రోత్సహించేందుకు జూనియర్‌ కళాశాలలు లేని మండలాల్లో, జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే వీటి నిర్వహణ, సాధ్యాసాధ్యాలపై ఎటువంటి కసరత్తు చేయకుండానే విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసేసింది. రాష్ట్రంలో కేంద్రీయ విద్యావిధానం అమల్లో భాగంగా ప్రాఽథమిక పాఠశాలల్లోని మూడు, నాలుగు, ఐదు తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయగా, ప్రస్తుత విద్యాసంవత్సరంలో మండలానికి ఒకటి చొప్పున హైస్కూళ్లలోనే జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ వున్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులే ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేస్తున్న జూనియర్‌ కళాశాలల్లో ఫ్లస్‌–2 పేరుతో విద్యాబోధన చేయాల్సి రావడం, కళాశాలల నిర్వహణ అంటే కష్టమనే అభిప్రాయం ఉపాధ్యాయుల్లో వ్యక్తమవు తోంది. ఉత్తర్వులు ఆలస్యంగా రావడంతో కొన్ని పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణతైన విద్యార్థులు అప్పటికే వేరే కళాశాలల్లో చేరిపోయారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేరేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతోపాటు జూనియర్‌ కళాశాలలకు సెప్టెంబరు నెల సగం గడుస్తున్నా పాఠ్యపుస్తకాలు సరఫరా కాకపోవడంతో చదువు కుంటుపడుతోంది. ఫలితంగా కళాశాలల్లో చేరిన విద్యార్థులు సైతం ఒక్కొక్కరిగా కళాశాలకు దూరమవు తుండటంతో నూతనంగా ఏర్పాటైన కళాశాలల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది.


రెండు కళాశాలల్లో హాజరు సున్నా 


నియోజకవర్గ కేంద్రమైన నూజివీడులో బాలికోన్నత పాఠశాలతో పాటు ఆగిరిపల్లి మండలం ఈదర, ముసునూరు జడ్పీపాఠశాల, చాట్రా యి మండలం చాట్రాయి జడ్పీ పాఠశాలలను జూనియర్‌ కళాశాలుగా అప్‌గ్రేడ్‌ చేశారు. నియోజకవర్గంలో నూజివీడు బాలి కోన్నత, ఈదర జూనియర్‌ కళాశాలల పరిస్థితి కొంత పర్వాలేదనిపించే స్థాయిలో ఉంది. మొత్తం నాలుగు కళాశాలల్లోనూ ఎంపీసీ, బైపీసీ విభాగాలను ప్రారం భించగా, నూజివీడు బాలికోన్నత పాఠశాలల్లో ఏర్పాటైన జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ విభాగంలో 16 మంది, బైపీసీ విభాగంలో 40 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈదర జూనియర్‌ కళాశాల లోనూ ఎంపీసీ విభాగంలో ఆరుగురు, బైపీసీ విభాగంలో 18 మంది విద్య నభ్యసిస్తుండగా, ఆయా పాఠశాలల్లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేసిన ఉపాధ్యాయులు వీరికి విద్యాబోధన అందిస్తున్నారు. అయితే నేటికి వారికి పాఠ్య పుస్తకాలు సెప్టెంబరు నెల సగం గడుస్తున్నా సరఫరా కాకపోవడంతో పాఠ్యపుస్తకాల కోసం జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇండెంట్‌ పంపి, ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే విద్యాబోధనకు ఎటువంటి అవాంతరం కలగకుండా అందు బాటులో వున్న జూనియర్‌ కళాశాల నుంచి రెండు సెట్లు వంతున తెప్పించి, ఉపాధ్యాయులు బోధనను కొనసాగిస్తున్నారు. అయితే మిగిలిన రెండు కళాశాలలు, దాదాపు మూతపడే పరిస్థితి నెలకొంది. ముసునూరు జిల్లాపరిషత్‌ వున్నత పాఠశాలలో జూలై 29న ప్రారంభించిన జూనియర్‌ కళాశాలలో ఎంపీసీలో పదిమంది, బైపీసీలో 32 మంది విద్యార్థులు చేరారు. అయితే తరగతులకు మాత్రం ఒక్కరూ రావడంలేదు. చాట్రాయి జిల్లాపరిషత్‌ వున్నత పాఠశాలలో ఏర్పాటైన జూనియర్‌ కళా శాలలో ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో కేవలం ఇద్దరు చొప్పున చేరగా, వారు కళాశాలకు హాజరు కాకపోవడంతో ఈ కళాశాలలు పూర్తిగా మూతపడిన పరిస్థితి నెలకొంది.


ప్రారంభం కాని తరగతి గదుల నిర్మాణం

 

కేంద్రీయ విద్యావిధానం అమల్లో భాగంగా ఫ్లస్‌–2 తరగతులు ప్రారంభించిన జూనియర్‌ కళాశాలల్లో అదనపు తరగతి గదుల అవసరం ఉంది. నూజివీడు బాలికోన్నత పాఠశాలలో 9 అదనపు తరగతి గదులకు కోటి 8 లక్షలు మంజూరు చేశారు.ఆగిరిపల్లి మండలం ఈదర జిల్లాపరిషత్‌ వున్నత పాఠశాలలోనూ మరో ఏడు అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.84 లక్షలు మంజూరయ్యాయి అయితే అవి ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. స్టాప్‌రూమ్‌ తదితర గదుల్లో  తరగతులను నిర్వహిస్తూ ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని ఏదో విధంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ముందుకు తీసుకువెళుతున్నా ఇంటర్‌  రెండో సంవత్సరంలో మాత్రం కళాశాలలకు ప్రయోగశాలల ఏర్పాటు అవసరం ఉంటుంది. తరగతి గదులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు పాఠ్య పుస్తకాలు, ప్రయోగశాలలు త్వరితగతిన ఏర్పాటు చేస్తేనే ఫలితం ఉంటుంది.


Updated Date - 2022-09-18T06:45:30+05:30 IST