భయం.. భయంగా ప్రయాణాలు

ABN , First Publish Date - 2022-09-19T07:03:03+05:30 IST

ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా మండలంలోని చిన్నంపేట–చింతలపూడి మండలం శివపురం గ్రామాల మధ్య తమ్మిలేరుపై ఉన్న కాజ్‌వే శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా తయారైంది.

భయం.. భయంగా ప్రయాణాలు
కోతకు గురైన కాజ్‌వే అప్రోచ్‌ రోడ్డు

ప్రమాదకరంగా తమ్మిలేరు కాజ్‌వే  

 వరదొస్తే రాకపోకలు బంద్‌

అసంపూర్తి నిర్మాణంతో ప్రమాదాలు 

కోతకు గురైన అప్రోచ్‌ రోడ్డు   

 విద్యార్థులు, రైతుల వెతలు 

అధికారులు స్పందించాలని వినతి


చాట్రాయి, సెప్టెంబరు 18: ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా మండలంలోని చిన్నంపేట–చింతలపూడి మండలం శివపురం గ్రామాల మధ్య తమ్మిలేరుపై ఉన్న కాజ్‌వే శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా తయారైంది. 30 ఏళ్ళ క్రితం అసంపూర్తిగా కాజ్‌వే నిర్మించి వదిలేశారు. కాజ్‌వేకి మరమ్మతులు చేయాలని పాతికేళ్లుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా పాలకులు పట్టించుకోలేదు. 1986లో చిన్నంపేటకు చెందిన కూలీలు ఏటి అవతల శివపురం పనులకు వెళ్ళి  వస్తూ తమ్మిలేరులో దిగి ఆరుగురు కూలీలు గల్లంతయ్యారు. ఈ దుర్ఘటన పట్ల నాటి సీఎం ఎన్టీఆర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అప్పట్లో మంత్రిగా ఉన్న  కోటగిరి విద్యాధరరావు కృషితో కాజ్‌వే నిర్మాణానికి 1992లో నిధులు మంజూర య్యాయి. నిధులు సరిపోకపోవటంతో చిన్నంపేట వైపు రెండు ఖానాలు తక్కువగా నిర్మించి అప్రోచ్‌ రోడ్డు వేశారు. నిధులు లేక కాజ్‌వేకి ఇరువైపులా రెయిలింగ్స్‌ కూడా నిర్మించకుండా ఉపయోగంలోకి తెచ్చారు. కాజ్‌వేకి రెయిలింగ్స్‌ లేకపోవటం వల్ల ప్రమాదాల్లో పలువురు చనిపోయారు. ప్రతి ఏటా అధిక వర్షాలు, తుఫాన్లు వచ్చినప్పుడు తమ్మిలేరుకు భారీ వరదలు వచ్చి అప్రోచ్‌ రోడ్డు కొట్టుకుపోయి రాకపోకలు ఆగి రైతులు ప్రజలు విద్యార్థులు ఇబ్బందులు పడటం  మామూలైపోయింది. చిన్నంపేట రైతులకు తమ్మిలేరు అవతల శివపురంలో, అక్కడి రైతులకు ఇటువైపు వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ కారణంతో నిత్యం కాజ్‌వేపై  రైతులు, కూలీలు, పశువులు రాకపోకలు సాగిస్తుంటాయి. అప్రోచ్‌ రోడ్డుకు గండి పడితే ఇబ్బందులు వర్ణనాతీతం. స్థానిక ప్రజాప్రతినిధులు సొంత నిధులతో అనేక సార్లు గండి పూడ్చినా ప్రభుత్వం మంజూరు చేయలేదు.  ఇటీవల సంభవించిన వరదకు అప్రోచ్‌రోడ్డు కోతకు గురైంది. దీంతో స్కూల్‌ బస్సులు నడవటం లేదు. శివపురం విద్యార్థులు సుమారు 100 మంది చిన్నంపేటలో చదువుతున్నారు. నిత్యం విద్యార్థులు కాలినడకన కాజ్‌వే దాటి ప్రమాదకరంగా పాఠశాలకు వెళ్ళి వస్తున్నారు. చిన్నంపేట, కోటపాడు గ్రామాల విద్యార్థులు కళాశాలల వాహనాల్లో రోజు కాజ్‌పై నుంచి చింతలపూడి కళాశాలకు వెళుతుంటారు. ప్రస్తుతం 15 కిలోమీటర్లు చుట్టు తిరిగి వెళ్ళవలసి వస్తున్నదని  విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం   స్పందించి కాజ్‌వేకి శాశ్వత మరమ్మతులు జరిపించాలని రెండు మండలాల ప్రజలు కోరుతున్నారు.


తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం

శివపురంలో నాకు సాగు భూమి ఉంది. ప్రతి ఏటా వర్షాకాలంలో కాజ్‌వే అప్రోచ్‌ రోడ్డు తెగిపోయి భూముల్లోకి వెళ్ళలేకపోతున్నాం. దీంతో సకాలంలో పనులు చేయలేక నష్టపోతున్నాం. కొన్ని సమయాల్లో ప్రాణాలకు తెగించి తమ్మిలేరు దాటవలసి వస్తోంది.  ప్రభుత్వం వెంటనే కాజ్‌వేకి శాశ్వత మరమ్మతులు జరిపించాలి.

– చిరిగా సత్యనారాయణ, రైతు, చిన్నంపేట


ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం

కాజ్‌వేకి చిన్నంపేట వైపు రెండు ఖానాల నిర్మాణానికి, రెయిలింగ్‌ ఏర్పాటు ఇతర పనులకు అంచనాలు తయారు చేసి, నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.నిధులు మంజూరైతే సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది.

– లక్ష్మణరావు, డీఈఈ, పంచాయతీరాజ్‌ శాఖ



Updated Date - 2022-09-19T07:03:03+05:30 IST