పోలవరంపై మరో మెలిక

ABN , First Publish Date - 2022-09-05T06:03:19+05:30 IST

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం మరో మెలిక పెట్టింది. అంచనా వ్యయాన్ని మదింపు చేసేందుకు వీలుగా దీని పరిధిలో ఉన్న అన్ని ప్రాజెక్టుల సమగ్ర సమాచారం ఇవ్వాలని ఇటీవల రాష్ట్రాన్ని కోరింది.

పోలవరంపై మరో మెలిక

పరిధిలో లేని ప్రాజెక్టుల వివరాలూ ఇవ్వండి 

రాష్ట్రాన్ని కోరిన కేంద్ర జలశక్తి శాఖ 

నిధుల విడుదలలో మరింత జాప్యానికే  

ఎత్తుగడ అంటున్న జల వనరుల నిపుణులు 

రేపు తుది అంచనా వ్యయంపై కేంద్రం సమీక్ష 

అమరావతి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం మరో మెలిక పెట్టింది. అంచనా వ్యయాన్ని మదింపు చేసేందుకు వీలుగా దీని పరిధిలో ఉన్న అన్ని ప్రాజెక్టుల సమగ్ర సమాచారం ఇవ్వాలని ఇటీవల రాష్ట్రాన్ని కోరింది. అయితే రాష్ట్రం పంపిన సమాచారంతో సంతృప్తి చెందకుండా పోలవరం పరిధిలోకి రాని ప్రాజెక్టుల సమా చారం కూడా పంపాలని తాజాగా కోరడం సందేహాలకు తావిస్తోంది. చింతలపూడి, పురుషోత్తపట్నం, పట్టిసీమ, వెంకటనగరం, కొవ్వాడ కాల్వ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాలకు సంబంధించి ఆయకట్టు, ఎన్ని టీఎంసీల జలాలు అవసరం, అంచనా వ్యయం తదితర సమాచారం కావాలని కేంద్రం కోరింది. వీటిలో ఎడమ కాలువ పరిధిలోని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా మిగిలినవేవీ పోలవరం పరిధిలోకి రావని రాష్ట్ర జల వనరుల శాఖ పేర్కొంటోంది. సుజల స్రవంతి మాత్రమే పోలవరం పరిధిలోకి వస్తుందంటూ 2009లోనే ప్రస్తావించడాన్ని గుర్తుచేస్తోంది. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలు కూడా పోలవరం నుంచి వేరుపడ్డాయని, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పట్టిసీమ డీఫంక్ట్‌ (పని చేయనిది) అవుతుందని స్పష్టం చేస్తోంది. ఇలాంటి ప్రాజెక్టుల సమాచారం కూడా ఇవ్వాలంటూ కేంద్రం కోరడంపై పలు సందేహాలు వ్యక్తమవు తున్నాయి. ఇప్పటికే పోలవరం అంచనా వ్యయంపైనా, రావాల్సిన నిధులపైనా కేంద్రానికి పలు దఫాలుగా నివేదికలు అందించామని, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో పాటు మంత్రులు నిర్మలా సీతారామన్‌, గజేంద్రసింగ్‌ షెకా వత్‌కు వినతిపత్రాలు సమర్పిస్తూనే ఉన్నామని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. అడ్‌హాక్‌ కింద రూ.10,000 కోట్లు ఇవ్వాలంటూ కేంద్రాన్ని సీఎం జగన్‌ లిఖిత పూర్వకంగా కోరా రని గుర్తుచేస్తున్నారు. ఈ అంశాలన్నింటిపై ఆగస్టు 25న ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయం కేంద్ర ఆర్థిక శాఖ కార్య దర్శి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలోనూ ప్రస్తావించామని, అడ్‌హాక్‌ మొత్తం రూ.10 వేలకోట్లు లేదా రూ.7,230 కోట్లు ఇవ్వాలని కోరినా ఇప్పటివరకూ ఏ స్పందనా లేదంటున్నారు. పైగా మరిన్ని ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాలని కోరడం వెనుక పోలవరం తుది అంచనా వ్యయం ఖరారుతో పాటు కేబినెట్‌లో తీర్మానం చేయడంపై మరింత జాప్యం చేసే యోచన ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


కమిటీలతో కాలయాపన చేసేందుకే... 


పోలవరం ప్రాజెక్టుకు 2017–18 అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలంటూ గత ప్రభుత్వ హయాం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్తూనే ఉన్నాయి. ఇదే మొత్తానికి కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) 2019 ఫిబ్రవరిలోనే ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థికశాఖ సైతం రూ.47,725.74 కోట్లకు ఆమోదించినా కూడా కేంద్రం కేబినెట్‌లో పెట్టి ఆమోదించడం లేదు. 2013–14 అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు నుంచి జల విద్యుత్తు కేంద్రం వ్యయం తొలగించాలని రాష్ట్రం కోరింది. అయితే మంచినీటి పథకాల వ్యయం రూ.4,776 కోట్లను ప్రాజెక్టు ఖర్చుల నుంచి తొలగించాలని కేంద్రం స్పష్టం చేసింది. కానీ ఇప్పుడు మంచినీటి పథకాలు, చింతలపూడి, పురుషోత్తపట్నం, పట్టిసీమ, వెంకటనగరం, కొవ్వాడ కాల్వ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని కూడా కలిపి మొత్తం వ్యయం ఎంతో స్పష్టం చేయాలని కోరుతోంది. అయితే వీటన్నిటి వ్యయాలు కలుపుకుంటే పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.80,000 కోట్లు దాటుతుందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రాజెక్టులు చేర్చితే దీనిపై మళ్లీ కమిటీలతో కాలయాపన చేసేందుకే కేంద్రం ఈ ఎత్తు గడ వేసిందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. పోలవరం పూర్తయ్యేందుకు భూసేకరణ, సహాయ, పునరావా సానికి రూ.23,000 కోట్లు, కాంక్రీట్‌ పనులకు మరో రూ.5,000 కోట్లు, ఇతరత్రా సహాయ కార్యక్రమాల కోసం రూ.2,500 కోట్లు అవసరమని, ఈ నిధులు మంజూరు చేయకుండా కొత్తగా అదనపు సమాచారం కోరడమేంటని ప్రశ్నిస్తున్నాయి. కేంద్రం కోరిన సమాచారాన్ని రాష్ట్రం ఇప్పటికే పంపింది. తుది అంచనా వ్యయంపై సమీక్షించేందుకు ఈ నెల 1న రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని కేంద్ర జలసంఘం బృందం భావించింది. కానీ దీనిని ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున పోలవరం పరిధిలోకి వచ్చే అన్ని ప్రాజెక్టులపై అన్‌లైన్‌లో సమీక్ష జరగనుంది. ఆ తర్వాత కేంద్రం తుది నిర్ణయం తీసుకునేందుకు ఇంకెంత కాలం పడుతుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


పోలవరం పనుల నాణ్యతపై కేంద్రం ఆరా


పోలవరం ప్రాజెక్టు పనుల నాణ్యతపై కేంద్రం ఆరా తీస్తోంది. ప్రాజెక్టు నిర్మాణానికి వినియోగిస్తున్న రాళ్ల గట్టితనాన్ని కేంద్ర సంఘం ఆధ్వర్యంలోని సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ బృందం పరిశీలిస్తోంది. ప్రాజెక్టు ప్రాంతంలో రాతి నమూనాలను, గైడ్‌బండ్‌ కోసం వాడుతున్న రాళ్లను శుక్ర, శనివారాల్లో బృందం సభ్యులు పరిశీలించారు. రాతికట్టతో పాటు కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని ఈ బృందం పరిశీలించింది. పీపీఏ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్‌ సమక్షంలో పోలవరం క్షేత్రస్థాయిలోని ల్యాబ్‌లో రాళ్లకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత కేంద్ర జలసంఘం తన అభిప్రాయాన్ని రాష్ట్ర జల వనరుల శాఖకు వివరించనుంది. 

Updated Date - 2022-09-05T06:03:19+05:30 IST