గప్‌ చుప్‌..

ABN , First Publish Date - 2021-05-13T06:22:01+05:30 IST

కరోనా భయంతో జ్వరమొచ్చినా చెప్పేందుకు కొందరు సాహసించడం లేదు.

గప్‌ చుప్‌..

కరోనా దెబ్బకు జ్వరమొచ్చినా దాస్తున్న జనం

మందుబిళ్లలతో ఇళ్లల్లోనే వైద్యం

పరిస్థితి విషమించాక ఆస్పత్రులకు పరుగులు

కరోనా భయంతో జ్వరమొచ్చినా చెప్పేందుకు కొందరు సాహసించడం లేదు.   ఏ మాత్రం లక్షణాలున్నా కరోనఆ టెస్ట్‌లు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నా ప్రజల్లో మాత్రం కరోనా హాని కంటే చుట్టుపక్కల వారు ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నారు. సమీపంలోని మందుల షాపులకు వెళ్లి మాత్రలు తెచ్చి వేసుకునేందుకే మొగ్గుచూపుతున్నారు తప్ప తమ ప్రాణంతో పాటు తమ కుటుంబీకుల ప్రాణాలకు ముప్పుందని ఆలోచించడం లేదు. దీంతో పరిస్థితి విషమించాక ఆసుపత్రులకు వెళ్లడం అప్పటికే పరిస్థితి చేయిదాటి పలువురు మృత్యువాత పడుతున్నారు.

జంగారెడ్డిగూడెం, మే 12: కరోనా పేరు చెబితేనే గుండెల్లో దడ పుడుతుంది. ఇప్పుడు ఊరూరా కరోనా బాధితులు కన్పిస్తున్న క్రమంలో చిన్నపాటి జ్వరం వచ్చినా కరోనా సోకిందేమోనని భయపడాల్సిన పరిస్ధితి. ఇక వేసవిలో వచ్చే సీజనల్‌ జ్వరాలు సైతం అక్కడక్కడ  ఉండటంతో అసలు వైరస్‌ ఫీవరా, లేక కరోనా సోకిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కొద్దిగా ఒళ్లు వేడిపడినా, కాస్త అలసటగా అన్పించినా అదేనేమోనని అనుమానం. ఈ క్రమంలో మందుల దుకాణాల వద్దకు వెళ్లి జ్వరం, దగ్గు, రొంప, ఒళ్లు నొప్పులు విడివిడిగా వేరు వేరు సమయాల్లో కొనుగోలు చేసుకుని మరీ మింగేస్తున్నారు. ఇంకొంత మంది వీటితో పాటు  విటమిన్‌ మాత్రలను కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో   మెడికల్‌ దుకాణాలు రద్దీగా కన్పిస్తున్నాయి.

భయం..భయం

కరోనా వైరస్‌ ఉధృతి నిపుణుల అంచనాలకు మించి ఉంది. ప్రభుత్వాలు గుర్తించే సరికే చాపకింద నీరులా విస్తరించింది. ఈ క్రమంలో పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా అంతా చుట్టేసింది. దీంతో ఆసుపత్రులన్నీ నిండిపోతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో వైరల్‌ ఫీవర్‌లు గ్రామీణ ప్రాంతాల్లో నెమ్మదిగా మొదలయ్యాయి. కరోన ఎఫెక్ట్‌ కారణంగా జ్వరం వచ్చినా  మందు బిళ్ల వేసుకుని మౌనంగా ఉంటున్నారు. జ్వరం వచ్చిందని చెబితే కరోనా అంటూ హడావుడి జరుగుతుందేమోనని గ్రామీణ ప్రాంతాల్లో జ్వర పీడితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరల్‌ ఫీవర్‌లు, టైఫాయిడ్‌లు చుట్టుముడుతున్నట్టు తెలుస్తోంది.

జ్వరం వచ్చినా చెప్పడానికి భయం....!

ప్రస్తుత పరిస్ధితుల్లో జ్వరం వచ్చినా చెప్పేందుకు చాలా మంది భయపడుతున్నారు. గడిచిన 15 రోజులుగా ఎక్కడ చూసినా కరోన వైరస్‌ పైనే చర్చ సాగుతుంది. డోర్‌ టు డోర్‌ సర్వే చేసి జ్వర పీడితుల్లో కరోనా లక్షణాలు ఉన్నాయా అని జల్లెడ పడుతున్నారు.  ఈ క్రమంలో ప్రతి ఏడాది వేసవిలో వచ్చే వైరల్‌ ఫీవర్‌ మొదలైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో టైఫాయిడ్‌  బాధితులున్నారు. అయితే వీరంతా బయటకు రావ డం లేదు. ఇప్పటికే అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు మూసివేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళాలంటే కరోనా పేరుతో భయపడుతున్నారు. దీంతో స్థానికంగా మెడికల్‌ షాపుల్లో జ్వరం తగ్గే మందులను వేసుకోవడం,  ల్యాబ్‌ నిర్వాహకుల నుంచే కొన్ని మందులు రాయించుకుని ఇళ్ళల్లోనే  ఉంటున్నారు.  కరోనా వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవడం అందరికీ శ్రేయస్కరం. 

Updated Date - 2021-05-13T06:22:01+05:30 IST