నిఘా కళ్లు నిద్రలోకి..

ABN , First Publish Date - 2020-12-03T05:42:51+05:30 IST

దొంగతనాల నివారణకు, రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి పోలీస్‌శాఖ ఏర్పాటు చేసిన నిఘానేత్రాలు నిద్రపోతున్నాయి.

నిఘా కళ్లు నిద్రలోకి..


పనిచేయని సీసీ కెమెరాలు

కొవ్వూరులో 27కి.. పనిచేసేవి నాలుగే!

పోలీసులకు సవాల్‌గా మారిన నేరస్థుల గుర్తింపు

కొవ్వూరు, డిసెంబరు 2: దొంగతనాల నివారణకు,  రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి పోలీస్‌శాఖ ఏర్పాటు చేసిన నిఘానేత్రాలు నిద్రపోతున్నాయి.  కొవ్వూరు పట్టణ  పరిధిలో జాతీయ రహదారి  విస్తరించి వుంది. పట్టణంతో పాటు దొమ్మేరు, వాడపల్లి, వేములూరు, ఆరికిరేవుల గ్రామాలు పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనే  ఉన్నాయి. జాతీయ రహదారితోపాటు రోడ్‌కమ్‌రైలు బ్రిడ్జి, గామన్‌ వంతెనలపై ప్రయాణం  ప్రమాదకరంగా మారింది. ఇక రాత్రి సమయాలలో జరిగే ప్రమాదాలు చెప్పనవసరం లేదు. దీంతో పట్టణం పరిధిలో దొంగతనాలు, నేరాలతో పాటు వాహన ప్రమాదాల కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. ఈ సందర్భంలో కీలక కేసులలో సమాచార సేకరణ,నిందితుల గుర్తింపు కష్టసాధ్యం అవుతుండటంతో  అధికారులు పట్టణ పరిధిలోని ప్రధాన కూడళ్లలో దాతల సహకారంతో 27 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు.  వీటి పర్యవేక్షణకు కొవ్వూరు రూరల్‌  పోలీస్‌ స్టేషన్‌లో సీసీ ఫుటేజి భద్రపరిచే విధంగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి కొన్ని కీలక కేసుల్లో  ఈ నిఘా నేత్రాలు  ఎంతగానో ఉపయోగపడ్డాయి. కెమెరాల పర్యవేక్షణకు ఒక సంస్థతో  కుదుర్చుకున్న  ఒప్పందం గడువు ముగియడంతో, నిఘా వ్యవస్థ  పర్యవేక్షణ లేకపోవడంతో  ఒక్కొక్కటిగా మరమ్మతులకు గురవుతూ  ప్రస్తుతం 4 మాత్రమే పనిచేస్తున్నాయి.  దీంతో కొన్ని ప్రమాదాలు, నేరాలు జరిగినప్పుడు వాహనాలను, నేరస్థులను గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది.  సీసీ కెమెరాలను వినియోగంలోకి తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. 

సీఐ ఏమన్నారు?

ఈ విషయమై పట్టణ సీఐ ఎంవీవీఎస్‌ మూర్తి మాట్లాడుతూ సీసీ కెమెరాల వినియోగంపై ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని, పట్టణంలో నేరాలు, దొంగతనాలు అరికట్టడానికి సహకరించాలని సూచిస్తున్నాం. 


Updated Date - 2020-12-03T05:42:51+05:30 IST