ఏదీ.. ప్రకృతి సేవ

ABN , First Publish Date - 2022-01-22T06:26:23+05:30 IST

లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మాణం జరిగింది. అయితే ప్రజలకు ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉంది.

ఏదీ.. ప్రకృతి సేవ
నిడదవోలులో వైద్య సేవలు అందించని ఆయుష్‌ డిస్పెన్సరీ

నిరుపయోగంగా ప్రకృతి వైద్యశాల 

రూ. 20 లక్షలతో ఆయుష్‌ ఆధ్వర్యంలో నిర్మాణం

వైద్య సేవల కోసం ప్రజల ఎదురుచూపు

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మాణం జరిగింది. అయితే ప్రజలకు ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉంది. అదే నిడదవోలులోని ఆయుష్‌ ఆస్పత్రి.  దీనిని ప్రారంభించి  ప్రజలకు సేవలు అందించాలన్న సంకల్పం అధికారులకు, ప్రజాప్రతినిధులకు లేకపోవడం విడ్డూరం. 

నిడదవోలు, జనవరి 21 : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పట్టణంలో ప్రజలందరికీ యోగా, ప్రకృతి వైద్యం అందించేందుకు ఆయుష్‌ విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రకృతి వైద్యశాలకు శ్రీకారం చుట్టారు. నిడదవోలు గాంధీనగర్‌ 2వ వీధిలో ఉన్న మున్సిపల్‌ స్థలంలో సుమారు రూ. 20 లక్షలతో భవనాన్ని నిర్మించారు. అనంతరం రాష్ట్రంలో ఎన్నికలు రావడం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. గత రెండేళ్ళుగా ఈ ప్రకృతి వైద్యశాల భవనం ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగానే మారిపోయింది. అయితే ఈ ఏడాది జనవరి మొదటి వారంలో ఆయుష్‌ వైద్యులు ఒకరు వచ్చి ఒకరోజు భవానాన్ని శుభ్రం చేయించి వెళ్ళిపోయారు. అసలు వారంలో ఇక్కడ ఎన్నిరోజులు సేవలు అందుతాయి... ఏయే రోజుల్లో  వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందిస్తారు.. ఏ  సమయాల్లో ఉంటారు.. ఏ సేవలు అందుతాయి అనేది ప్రశ్నార్థకం. ఎప్పుడు చూసినా ఈ భవనానికి  తాళం వేసి ఉంటుంది. ఇక్కడ వైద్యసేవల వివరాలు కాని, సంబంధిత వ్యక్తుల కాం టాక్ట్‌ నెంబర్లు కాని లేకుండా ఇలా ఖాళీ భవనం దర్శనమిస్తుంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార్లు దీనిపై దృష్టి సారించి ప్రతిష్టాత్మకంగా నిర్మిం చిన ఆయుష్‌ ఆస్పత్రి సేవలందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-01-22T06:26:23+05:30 IST