ఐడీ నంబర్లివ్వరు.. బిల్లులు రావు..

ABN , First Publish Date - 2022-06-26T07:17:00+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పీఎంఏవై – వైస్సార్‌ గ్రామీణ్‌ పథకం ద్వారా మంజూరు చేసిన ఇళ్ళకు ఐడీ నెంబర్లు రాకపోవటంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఐడీ నంబర్లివ్వరు.. బిల్లులు రావు..
చింతలవల్లిలో నిర్మాణంలో ఉన్న ఇల్లు

పీఎంఏవై, వైస్సార్‌ గ్రామీణ్‌ పథకం లబ్ధిదారుల వెతలు

ముసునూరు మండలంలో 559 ఇళ్లు మంజూరు 

నిర్మాణాల్లో 141 ఇళ్లు.. సొమ్ము కోసం ఎదురుచూపు


ముసునూరు, జూన్‌ 25: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పీఎంఏవై – వైస్సార్‌ గ్రామీణ్‌ పథకం ద్వారా మంజూరు చేసిన ఇళ్ళకు ఐడీ నెంబర్లు రాకపోవటంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో సొంత స్థలాలు ఉన్న పేదలకు 559 పక్కా ఇళ్లు ఈ పథకంలో మంజూరయ్యాయి. ఒక్కో ఇంటికి రూ 1.80 లక్షలు మంజూరు చేయగా ఇందులో రాష్ట్రం రూ. 78 వేలు, కేంద్రం రూ. 72 వేలు, ఉపాధి పథకం నుంచి రూ. 30 వేలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం 141 ఇళ్ళ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ఇళ్ళు మంజూరై నెలరోజులు గడుస్తున్నా నేటికీ ఇళ్ళకు ఐడీ నంబర్లు రాకపోవటంతో  లబ్ధిదారులకు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, మిగిలిన లబ్ధిదారులు ఇళ్ళ నిర్మాణాలకు ముందుకు రావటం లేదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెవెన్యూ గ్రామం పాతిపదికన అర్హులను గుర్తించి పక్కా ఇళ్ళను మంజూరు చేశారు. కొందరు లబ్ధిదారులు ఎలాగోలా ఇళ్ళ నిర్మాణాలు చేపట్టినా నిబంధనల ప్రకారం దఽశల వారీగా బిల్లులు చెల్లించాల్సి ఉండగా, ఐడీ నెంబర్లు ఇవ్వకపోవటంపై లబ్ధిదారుల్లో అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఒక వైపు వర్షకాలం, మరో వైపు ఖరీఫ్‌ వ్యవసాయ పనుల నేపథ్యంలో మరో నెల రోజులపాటు ఇళ్ళకు ఐడీ నంబర్లు రాకపోతే పక్కా ఇళ్ళ నిర్మాణాలు  చేపట్టలేమని  పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పటికైన జిల్లా ఉన్నతాధికారులు ఐడీ నెంబర్లను   కేటాయించి, బిల్లులు చెలించేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.


 ఉన్నతాధికారులకు నివేదించాం 

మండలంలో ఐడీ నంబర్ల కేటాయింపు సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం. ఇళ్ళ ఐడీలు త్వరలోనే వస్తాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అవి రాగానే ఇళ్ళ నిర్మాణాల దశలను బట్టి బిల్లులు చెల్లిస్తాం. మిగిలిన ఇళ్ళ నిర్మాణాలను కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.

 –కేవీ సత్యనారాయణ,  హౌసింగ్‌ ఏఈ, ముసునూరు  మండలం. 

Updated Date - 2022-06-26T07:17:00+05:30 IST