సమస్యల స్వాగతం

ABN , First Publish Date - 2022-07-05T06:32:36+05:30 IST

పాఠశాలలు మంగళవారం పునఃప్రారంభమవుతుండగా, ఇంతవరకు ప్రభుత్వం విద్యార్థులకు విద్యా కానుక కిట్లు సరఫరా చేయకపోవటంతో సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది.

సమస్యల స్వాగతం

నేడు తెరుచుకోనున్న పాఠశాలలు

కిట్ల పంపిణీ నిల్‌.. పుస్తకాలు రాలేదు..

 అట్టహాసంగా యూనిఫాం పంపిణీకి సన్నాహాలు


పాఠశాలలు మంగళవారం పునఃప్రారంభమవుతుండగా, ఇంతవరకు ప్రభుత్వం విద్యార్థులకు విద్యా కానుక కిట్లు సరఫరా చేయకపోవటంతో సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. గతంలో  కిట్లు పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థుల చేతికందేవి.


చాట్రాయి, జూలై 4:  స్కూల్‌ బ్యాగ్‌, షూ, సాక్స్‌, బెల్ట్‌, పాఠ్యపుస్తకాలు, 2 జతల యూనిఫాంతో కిట్లు పంపిణీ అయ్యేవి. ఈ ఏడాది కిట్లకు బదులు ప్రతి స్కూల్‌కి కేవలం 2 జతలు యూనిఫారంలు సెట్లు సరఫరా చేశారు. వీటిని మంగళవారం ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేయాలని ఆదేశించటం గమనార్హం. ఈ ఏడాది పాఠ్యపుస్తకాల సరఫరా  జరగలేదు. గత ఏడాది పుస్తకాలను సర్దుబాటు చేశారు. ఇలా చేసినా ప్రాథమిక పాఠశాలలకు 80 శాతం, హైస్కూల్స్‌కి 20 శాతం మంది విద్యార్థులకు మాత్రమే సరిపోతాయి. మండలంలో ప్రభుత్వ  ప్రాథమిక పాఠశాలలు 54, ప్రాథమికోన్నత పాఠశాలలు 7, ఉన్నత పాఠశాలలు 7 మొత్తం 68 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 24 ప్రాథమిక పాఠశాలలు సింగిల్‌ టీచర్లతో నడుస్తుండగా, 7 ప్రాథమిక పాఠశాలలకు అసలు టీచర్లే లేరు. అసలు  టీచర్లు లేని పాఠశాలలు ఎలా పునఃప్రారంభిస్తారో తెలియదు. 70 మంది విద్యార్థులున్న సోమవరం పాఠశాలలో కేవలం ఒక్క టీచరే ఉండగా, 150 మంది విద్యార్థులు ఉన్న కోటపాడు స్కూల్‌లో ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ  స్థానిక సర్పంచ్‌ పరసా సత్యనారాయణ తన సొంత నిధులతో విద్యా వలంటీర్లను నియమించి విద్యా బోధన చేయిస్తున్నారు. పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, తగినంత మంది ఉపాధ్యాయులు లేకుండా  బోధన ఎలా అని తల్లిదండ్రులు  ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యమిచ్చి భారీగా నిధులు ఖర్చు చేస్తున్నట్టు ఘనంగా ప్రకటనలు చేస్తున్నారే కానీ క్షేత్ర  స్థాయిలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు.


పాపం ఎయిడెడ్‌ విద్యార్థులు..

ముదినేపల్లి రూరల్‌:  గురజ దళితవాడలో ఎయిడెడ్‌ పాఠశాలని శాశ్వతంగా మూసివేయటంతో ఆ పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అయోమయంలో ఉన్నారు. తమ పిల్లలను దూరంగా ఉన్న ఉన్నత పాఠశాలలో చేర్పించాలంటే ప్రధాన రహదారి దాటి వెళ్లటానికి భయ పడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. సదరు పాఠశాలలోని ఐదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు హైస్కూల్‌లో ఆరవ తరగతికి అడ్మిషన్‌ పొందారు. మిగిలిన 1, 2, 3, 4 తరగతుల విద్యార్థులు ఇప్పటి వరకు ఏ పాఠశాలలోనూ అడ్మిషన్‌ పొందలేదు. దీనిపై విద్యాశాఖాధికారి, సీఆర్పీ సైతం విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్యపర్చకపోవటం ఏమిటని విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. రద్దు చేసిన పాఠశాల సమీపంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌లో తమకు పాఠశాల ఏర్పాటుచేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 30 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలను ఇలా ఆకస్మాత్తుగా రద్దు చేయటం ఏమిటని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలను ఇక్కడ ఏర్పాటు చేస్తేనే తమ పిల్లలను పాఠశాలకు పంపుతామని, లేనిపక్షంలో పాఠశాలలో చేర్పించేది లేదని పేర్కొంటున్నారు. దీనిపై విద్యాశాఖాధికారులు స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. విద్యార్థులు డ్రాప్‌ అవుట్‌ కాకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉండటంతో సమస్య పరిష్కారానికి ఏ విధంగా స్పందిస్తారోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.  దీనిపై ఇన్‌చార్జి ఎంఈవో నరేష్‌ను వివరణ కోరగా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానన్నారు.

Updated Date - 2022-07-05T06:32:36+05:30 IST