చదివేదెట్టా..?

ABN , First Publish Date - 2022-07-01T06:46:02+05:30 IST

ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశించేందుకు గేట్‌ వేగా పరిగణించే ఇం టర్మీడియట్‌ కళాశాలలు వేసవి సెలవుల అనంతరం శుక్రవారం నుంచి తెరుచుకుంటున్నాయి.

చదివేదెట్టా..?

శిథిల భవనాలు.. అతిథి అధ్యాపకులు

అడకత్తెరలో ఇంటర్‌ విద్య

నేటి నుంచి జూనియర్‌ కశాశాలలు ప్రారంభం.. రేపటి నుంచి ఫస్టియర్‌

మండలానికో మహిళా కళాశాల ఏదీ ? 

టెన్త్‌ పాసైన విద్యార్థినులకు టీసీలు ఇవ్వని హైస్కూళ్లు.. సర్వత్రా ఆందోళన

ఏలూరు ఎడ్యుకేషన్‌, జూన్‌ 30 : ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశించేందుకు గేట్‌ వేగా పరిగణించే ఇం టర్మీడియట్‌ కళాశాలలు వేసవి సెలవుల అనంతరం శుక్రవారం నుంచి తెరుచుకుంటున్నాయి. తొలుత సెకండియర్‌ తరగతులు, శనివారం నుంచి ఫస్టియర్‌ ప్రారంభించేందుకు వీలుగా ప్రభుత్వం నిర్దేశించింది. ఎంతో కీలకమైన ఇంటర్‌ విద్యను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం కొన్నేళ్లుగా నూతన భవనాల నిర్మాణం, మరమ్మతులు, మౌలిక సదుపాయాలను పట్టించుకో కుండా నిర్లక్ష్యంగా వదిలేసింది. కనీసం రెగ్యులర్‌ ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకుల నియామకాలను చేపట్టక పోవడంతో ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. ఇది ఓ రకంగా ప్రైవే టు కళాశాలలను ప్రోత్సహించడమే.  


మరమ్మతులు ఎప్పటికి..

ఏలూరు జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లు 20, ఎయిడెడ్‌ 3, ఇన్సెంటివ్‌ 4, సోషల్‌ వెల్ఫేర్‌ 6, ట్రైబల్‌ వెల్ఫేర్‌ 2, సహకార 1, కేజీబీవీ 1, ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ 71 కలిపి మొత్తం 108 కళాశాలలు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఇంటర్‌ ఫస్టి యర్‌ పరీక్షల్లో మొత్తం 18,895 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావడంతో ఆ మేరకు వీరంతా ఆయా కళాశాలల్లోనే శుక్రవారం నుంచి ద్వితీయ సంవత్సర తరగతులకు హాజరయ్యేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలోకి అడ్మిషన్లు అన్ని కళాశాలల్లో కలిపి సుమారు 27 వేల వరకు ఉండొచ్చని అధికారుల అంచనా. జిల్లాలో ఒక టి, రెండు మినహా దాదాపు అన్ని ప్రభుత్వ జూని యర్‌ కళాశాలల్లో భవనాలు శిథిలావస్థకు చేరడమో లేదా మరమ్మతులకు గురికావడమో జరిగింది. నాడు–నేడు కార్యక్రమంలో జూనియర్‌ కళాశాలలకు కూడా నూతన భవనాలను నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పినా, జిల్లాలో ఒక్క ఏలూరు కోటదిబ్బలోని కళాశాలకు మరమ్మతు పనులకు మాత్రమే అనుమ తులు మంజూరయ్యాయి. 


అతిథి అధ్యాపకులతోనే సరి

ఉమ్మడి జిల్లాలో ఆచంట, అత్తిలి, బుట్టాయి గూడెం, చింతలపూడి, దుంపగడప, యలమంచిలి, తాడేపల్లిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, కు క్కునూరు, నిడదవోలు (బాలురు, బాలికలు), పోలవ రం, వి.పురం, గణపవరం, కోరుకొల్లు, మండవల్లి, కలిదిండిలలోని కళాశాలలకు రెగ్యులర్‌ ప్రిన్సిపాల్స్‌ ఇప్పటికీ లేరు. సీనియర్‌ అధ్యాపకులనే ఎఫ్‌ఏసీ బాధ్యతలపై అదనపు భారాన్ని మోపి ఏళ్ల తరబడి నెట్టుకొస్తున్నారు. మరోవైపు రెగ్యులర్‌ జూనియర్‌ అధ్యాపకులు రిటైర్‌ అవుతున్నా ఆ ఖాళీలను కాం ట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, గెస్ట్‌ అధ్యాపకులను నియ మించి మొక్కుబడిగా బోధన ముగిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన యర్నగూడెం, గోపాలపురం కళాశాలలకు ఇంత వరకు ప్రిన్సిపాల్‌, బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను అసలు మంజూరే చేయకుండా గెస్ట్‌ ఫ్యాకల్టీతో నిర్వహిస్తున్నారు. న్యాయస్థానంలో పెండింగ్‌లో వున్న వ్యాజ్యాన్ని సాకుగా చూపుతూ రెగ్యులర్‌ నియామకాల జోలికి పోవడం లేదు.


హైస్కూల్‌ ప్లస్‌లతో.. తెరమరుగు

ఈ ఏడాది నుంచి మండలానికి ఒకటి చొప్పున బాలికల కోసం ప్రత్యేకంగా జూనియర్‌ కళాశాలలను తెరవనుండటంతో ఆ మేరకు పాఠశాల విద్యా శాఖ ఆద్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 43 మండలాల్లో ఇంటర్‌ విద్యతో కూడిన హైస్కూల్‌ ప్లస్‌లను ప్రారంభించాలని ప్రతిపాదించారు. హైస్కూలులో టెన్త్‌ పాసైన బాలికలు అదే ప్రాంగణంలో హైస్కూల్‌ ప్లస్‌ పేరిట ప్రారంభించనున్న ఇంటర్‌ విద్యలో చేరవచ్చు. ఇలా చేయడం వల్ల ఇప్పటి వరకు వున్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు ఫీడర్‌ హైస్కూళ్ల నుంచి వచ్చి చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి చివరకు కళాశాలల మూసివేతకే దారి తీస్తుందన్న ఆందోళనను జూనియర్‌ లెక్చరర్లు వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్‌ విద్యతో కొత్తగా ప్రారంభించే హైస్కూల్‌ ప్లస్‌లలోనైనా ప్రిన్సిపాల్స్‌, ఫ్యాకల్టీ నియామకాలు చేపట్టారా అంటే అదీ లేదు. హైస్కూళ్ళలో పనిచేస్తోన్న హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్లనే ప్రిన్సిపాల్స్‌, జూనియర్‌ లెక్చరర్లుగా నియమించేందుకు రూపొందించిన ప్రతిపాదన లు మరొక్క రోజులోనే ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభమ వుతున్నా అడుగు ముందుకు పడలేదు. ప్రస్తుతానికి హైస్కూల్‌ ప్లస్‌లపై స్థాని కంగా ప్రచారం చేయాలని అధికారులు సూచించారు.


ఆ హైస్కూళ్లలో బాలికలకు టీసీల్లేవ్‌

షెడ్యూలు ప్రకారం ఫస్టియర్‌ తరగతు శనివారం నుంచి మొదలవుతాయి. ఈ నేపథ్యంలో కొత్తగా బాలికల జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేయ ప్రతిపాదించిన జిల్లాలోని 26 మండలాల్లోని సంబంధిత హైస్కూళ్ళలో ఈ ఏడాది పదో తరగతి ఉత్తీర్ణత సాదించిన బాలికలకు అక్కడే ఇంటర్‌ అడ్మిషన్లు ఇచ్చేలా ప్రభుత్వం కట్టడి చేయడంపై ఓ వైపు విద్యార్థినుల నుంచి, మరోవైపు తల్లిదండ్రుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. తమకు నచ్చిన కళాశాలలో ఇంటర్మీడియట్‌లో బాలికలు చేరతా మంటున్నా, ప్రభుత్వం నుంచి ఎక్కడ ఇబ్బందులు వస్తాయేనన్న భయాందోళనలతో హెచ్‌ఎంలు టెన్త్‌ పాసైన విద్యార్థినులకు టీసీలు ఇవ్వడం లేదు. హైస్కూళ్లలో జూనియర్‌ కళాశాలలు ఎప్పటికి ప్రారంభమవుతాయో, ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకుల నియామకాలు, ఫర్నీచర్‌, ల్యాబ్‌ల ఏర్పాటు ఎంత కాలానికి జరుగుతాయో ఇంత వరకు స్పష్టతలేకపోవడం విద్యార్థినుల అనాసక్తికి ఓ కారణమని చెప్పవచ్చు. బాలికల జూనియర్‌ కళాశాలలను అట్టహాసంగా ప్రకటించిన ప్రభుత్వం ఇంటర్‌ తరగతులు ప్రారంభమవుతున్నా ఆ దిశగా ఏర్పాట్లు చేయకుండా విద్యార్థినులను మాత్రం అగమ్యగోచరంలోకి నెట్టేసింది.

Updated Date - 2022-07-01T06:46:02+05:30 IST