ప్రభుత్వ భవన నిర్మాణాల ముసుగులో.. ఇసుక దందా?

ABN , First Publish Date - 2022-07-01T06:25:25+05:30 IST

ప్రభుత్వ పథకాల ముసుగులో అధికార పార్టీ నాయకులు ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు.

ప్రభుత్వ భవన నిర్మాణాల ముసుగులో.. ఇసుక దందా?

 ట్రిప్పు రూ. 3 నుంచి 4 వేల  వరకు విక్రయాలు

 తనిఖీలకు దూరంగా మైనింగ్‌ అధికారులు

రికార్డులు పరిశీలించాలంటున్న స్థానికులు


ప్రభుత్వ పథకాల ముసుగులో అధికార పార్టీ నాయకులు ఇసుక అక్రమ  రవాణాకు తెరలేపారు. నూతన భవనాల నిర్మాణాలకు రెండేళ్ళ నుంచి వేలాది ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నప్పటికి, నేటికి గ్రామాల్లో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌ భవనాలు పూర్తి కాలేదు. ఒక్కొక్క భవనానికి అవసరమైన ఇసుక కంటే లెక్కకు మించి కాంట్రాక్టర్లకు  అధికారులు ఇసుక రవాణాకు  అనుమతులు  ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.


ముసునూరు, జూన్‌ 30: మూడేళ్ళ క్రితం కలెక్టర్‌ ఇచ్చిన జీవోను అడ్డుపెట్టుకుని ఎంపీడీవో ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వటంతో అక్రమ రవాణా యఽథేచ్ఛగా కొనసాగుతోందని తమ్మిలేరు పరివాహక ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలను అడ్డుపెట్టుకుని తమ్మిలేరు నుంచి అక్రమంగా ఇసుకను తరలింటం వల్ల భూగర్భజలాలు తగ్గిపోతు న్నాయని, వెంటనే ఇసుక రవాణాకు అనుమతులు నిలిపివేయాలని ఇటీవల యల్లాపురం టీడీపీ నాయకులు, స్ధానిక రైతులు సంయుక్తంగా ఏలూరు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. దీంతో రెండు నెలల పాటు ఇసుక రవాణాకు బ్రేక్‌ పడింది. తాజాగా మంగళవారం నుంచి నూజివీడు, ముసునూరు మండలాల్లో నిర్మిస్తున్న నూతన భవనాలకు మరలా సుమారు 423 ఇసుక ట్రిప్పులకు ఎంపీడీవో అనుమతులు ఇచ్చారు. రెండు రోజుల నుంచి  సుమారు 83 ట్రాక్టర్‌లతో ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. అయితే భవనాల వద్దకు వెళ్ళాల్సిన ఇసుకను ట్రిప్పు రూ. 3 వేలు నుంచి 4 వేల వరకు అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని, దీనిపై పలుమార్లు  అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న నాధుడే లేడని యల్లాపురం గ్రామస్ధులు అంటున్నారు. మండలంలోని ప్రభుత్వ నూతన భవన నిర్మాణాలు ప్రారం భించిన నాటి నుంచి నేటి వరకు కాంట్రాక్టర్లకు ఇచ్చిన ఇసుక రికా ర్డులను తనిఖీ చేస్తే ఎన్ని ట్రిప్పుల ఇసుక అక్రమంగా తరలిపోయిందో తెలు స్తుందని స్ధానికులు అంటున్నారు. బలివే, యల్లాపురం తమ్మిలేరుల్లో అధికారులు ఇసుకకు అనుమతి ఇచ్చిన తరువాత మైనింగ్‌ అధికారులు తనిఖీ చేయటం కాని, రికార్డులు పరిశీలించటం కాని జరగలేదని, దీంతో  అధికార పార్టీ  నాయకులే కాంట్రాక్టర్లు అవటంతో  ఇసుక అక్రమ రవాణాకు అడ్డు, అదుపు లేకుండా పోయిందని  ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఇసుక రవాణా రికార్డులను జిల్లా ఉన్నతాధికారులు  పరిశీలించి, ప్రభుత్వ భవన నిర్మాణాల ముసుగులో జరుగతున్న అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని తమ్మిలేరు పరివాహక ప్రాంత ప్రజలు, టీడీపీ నాయకులు కోరుతున్నారు. 


అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు:  ఎంపీడీవో

ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ఇసుక తోలేందుకు 2019లో జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన జీవో ప్రకారం అనుమతి ఇస్తున్నామని ఎంపీడీవో సత్యనారాయణ అన్నారు. అయితే పంచాయతీరాజ్‌ ఏఈలు రిఫర్‌ చేసిన కాంట్రాక్టర్లకు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతి ఇస్తున్నామని, ప్రభుత్వ పథకాల ముసుగులో  ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే   చర్యలు తప్పవన్నారు. 

Updated Date - 2022-07-01T06:25:25+05:30 IST