సాగు చేసేదెలా..?

ABN , First Publish Date - 2022-01-20T06:12:24+05:30 IST

పంటకాల్వల నుంచి వచ్చే నీటితో ఆ ప్రాంత చేలల్లో మోకాళ్ల లోతు నీరు చేరింది.

సాగు చేసేదెలా..?
పెరవలిలో వర్షాకాలం ముంపును తలపించేలా ఉన్న చేలు

చేలో మోకాళ్ల లోతు నీరు

నీరు లాగే దారి లేదు

ఆక్రమణలతో పూడుకుపోయిన మురుగు బోదె

ఏం చేయాలో తెలియక అన్నదాత ఆందోళన

పెరవలి, జనవరి 19 : పంటకాల్వల నుంచి వచ్చే నీటితో ఆ ప్రాంత చేలల్లో మోకాళ్ల లోతు నీరు చేరింది. నీరు లాగదు. కారణం నీరు లాగేం దుకు ఉన్న మురుగ బోదె ఆక్రమణలతో పూడుకు పోయింది. దీంతో చేలన్నీ నీటితో నిండి దమ్ముచేయడానికి, నాట్లు వేయడానికి వీలు లేకుండా పోయా యని రైతులు వాపోతున్నారు. పెరవలి యూనియన్‌ బ్యాంక్‌ (పాత ఆంధ్రాబ్యాంక్‌) సమీపంలో ఉన్న చేలల్లో నీరు లాగక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గర్భ, పేకేటి కాలువల మధ్యన ఉన్న సుమారు 50 ఎకరాల పరిస్థితి ఈ విధంగా ఉండటంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.  పంట కాల్వలకు నీటిని పంపే గేట్ల తలుపులు పాడై నీరు అదుపు చేయడానికి వీలు లేక  చేలన్నీ ముంపునకు గురవుతున్నాయి. చేల నుంచి మురుగు పోయేందుకు మురుగు డ్రెయిన్‌ కూడా ఆక్రమణకు గురికావడంతో నీరు బయటకు పోయే దారి లేదు. నాట్లు వేసిన నాటి నుంచి కోతలు కోసే వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు సమస్య  పరిష్కరించాలని  ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు. పంట కాలువకు వచ్చే నీటిని అదుపు చేయడంతో పాటు మురుగునీరు పోయేలా పూడుకు పోయిన మురుగు బోదెని తవ్వించాలని కోరుతున్నారు. 

దమ్ము చేసే పరిస్థితి లేదు

ఇక్కడ రెండెకరాలు సాగు చేస్తున్నా. ప్రస్తుతం పొలాలన్నీ నీటితో నిండిపోయాయి. దమ్ము చేయడానికి కూడా వీలు కాని పరిస్థితి.. మురుగునీరు కూడా బయటకు వెళ్లేందుకు దారిలేక  నరకం చూస్తున్నాం. 

–పాలా సుబ్బారావు, రైతు, పెరవలి


మోకాళ్లలోతు నీళ్లు.. నాట్లెలా?

పొలంలో మోకాళ్ల లోతు నీరు చేరింది. నాట్లు వేద్దామంటే వీలు కావడం లేదు.  పంట కాలువల నుంచి వచ్చే నీటిని అదుపు చేస్తే ఈ ముంపు నుంచి  రక్షణ లభిస్తుంది. లేదంటే తీవ్రంగా నష్టపోవడం ఖాయం. 

–తెలగారెడ్డి లక్ష్మీనారాయణ, రైతు


గేటు పాడవడం వల్లే ఇబ్బందులు

గర్భ కాలువ నుంచి ఇక్కడి పొలాలకు నీరం దుతుంది. ఆ కాలువ  గేటు పాడైంది. ప్రస్తుతం దానిని మరమ్మతు చేసే వీలు లేదు. కాలువలు బంద్‌ చేసిన అనంతరం  మే నెలలో వాటికి మరమ్మతుచేస్తాం. ఈలోగా రైతులే నీరు రాకుండా అడ్డుకట్ట వేసుకొని పనులు చేసుకోవాలి. 

–శ్రీనివాస్‌, ఇరిగేషన్‌ డీఈ 




Updated Date - 2022-01-20T06:12:24+05:30 IST