అకాల వర్షం.. అన్నదాతకు నష్టం

ABN , First Publish Date - 2021-05-17T06:37:13+05:30 IST

ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో పడుతున్న వర్షాలకు రైతులు బెంబేలెత్తి పోతున్నారు.

అకాల వర్షం.. అన్నదాతకు నష్టం
లక్కవరంలో ధాన్యం రాశులపై బరకాలు కప్పిన దృశ్యం

కల్లాలలోనే ధాన్యం, ఇతర పంటలు

 కొనుగోళ్లు లేక దిగాలు

నష్టానికే వ్యాపారులకు మొక్కజొన్న అమ్మకాలు

జంగారెడ్డిగూడెం, మే 16 : ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో పడుతున్న వర్షాలకు రైతులు బెంబేలెత్తి పోతున్నారు. ఆదివారం మద్యాహ్నం బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, కుక్కునూరు, జీలుగుమిల్లి తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించి వర్షం పడింది. దీంతో మొక్కజొన్న, వరి, వేరుశెనగ రైతులకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా గడిచిన 10 రోజలుగా ప్రతి రోజు ఈ ప్రాంతాల్లో  గాలిదుమ్ము, ఉరుములతో కూడిన వర్షం పడుతోంది.  మరో పక్క ఈ ఏడాది ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న జాప్యం,  అకాల వర్షాలు రైతుల నడ్డి విరుస్తున్నాయి. కోతలు పూర్తి చేసుకుని కల్లాల్లో ఉన్న ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం, ఇదే క్రమంలో తరచూ వస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి పోకుండా రైతులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.  ఇక గాలిదుమ్ము  కారణంగా ఈ ఏడాది మామిడి పంటకు కూడా నష్టం వాటిల్లింది.  

నష్టానికే మొక్కజొన్న విక్రయాలు

జీలుగుమిల్లి: వర్షాలతో చేతికి వచ్చిన పంట తడిసిపోవటం, ఆరబెట్టేందుకు గిరిజన ప్రాంతాల్లో కల్లాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు కరోనా కారణంగా కూలీలు పనులకు రావడంలేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దక్కించుకునేందుకు అన్నదాతలు అవస్థల పాలవక తప్పటం లేదు. మరో వైపు గిట్టు బాటు ధర కల్పించినట్టు చెబుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో  అమలు చేసేందుకు చర్యలు తీసుకోవటం లేదనేది రైతుల వాదన. ఇటీవల మొక్కజొన్న పంటను ప్రభుత్వం మార్క్‌ ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసేందుకు సొసైటీలకు అనుమతి చ్చింది. క్వింటాలుకు మద్దతు ఽధర రూ.1850గా ప్రకటించారు. అయితే ఆయా కొనుగోలు కేంద్రాల్లో పంట కొనుగోలుకు నోచుకోక దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది.  క్వింటాలు రూ.1500–1600 మధ్య రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. సొమ్ము చెల్లించేందుకు నెలల తరబడి వాయిదాలు పెడుతున్నారు. వాతావరణ పరిస్థితులకు భయపడి వచ్చిందే చాలన్నట్టు  పంట నిల్వ చేసే వీలు లేక అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. మండలంలో ప్రస్తుతం 400 హెక్టార్లలో మొక్కజొన్న,  500 హెక్టార్లలో వేరుశనగ పంట సాగు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. 



Updated Date - 2021-05-17T06:37:13+05:30 IST