గాంధేయ అధ్యయనాల పెన్నిధి

ABN , First Publish Date - 2020-11-07T06:26:02+05:30 IST

కార్యాచరణశీలురు స్వతఃన్యాయనిష్ఠాపరులు. ప్రజల పోకడలను వారు తరచు విమర్శిస్తుంటారు. పండితులు స్వార్థపరులు. పదే పదే కాకపోయినా దాపరికంతో వ్యవహరించడం కద్దు. కార్యాచరణవాది, ప్రాజ్ఞుడు అయిన ఎనుగ శ్రీనివాసులు రెడ్డి స్వార్థపరుడూ కాదు....

గాంధేయ అధ్యయనాల పెన్నిధి

కార్యాచరణశీలురు స్వతఃన్యాయనిష్ఠాపరులు. ప్రజల పోకడలను వారు తరచు విమర్శిస్తుంటారు. పండితులు స్వార్థపరులు. పదే పదే కాకపోయినా దాపరికంతో వ్యవహరించడం కద్దు. కార్యాచరణవాది, ప్రాజ్ఞుడు అయిన ఎనుగ శ్రీనివాసులు రెడ్డి స్వార్థపరుడూ కాదు, తాను ఆచరించని నీతులను ఉపదేశించేవాడూ కాదు. ఆయనలో ధైర్యసాహసాలు, విజ్ఞతా వివేకాలు దయాదాక్షిణ్యాలు, సత్యవర్తన, సదాచారాలతో చెట్టాపట్టాల్ వేసుకొని మంచితనానికి ఒరవడి అవుతున్నాయి.


ఎనుగ శ్రీనివాసులు రెడ్డి ప్రపంచానికి ఇ ఎస్ రెడ్డిగా సుపరిచితుడు. ఈ మంచి మనిషిని నేను మొట్టమొదట 1994లో న్యూయార్క్‌లో కలుసుకున్నాను. గోపాలకృష్ణ గాంధీ నుంచి ఒక పరిచయ లేఖను తీసుకువెళ్ళాను. ఈ అపురూప వ్యక్తి ‘గొప్ప గాంధీ- జ్ఞాన నిధి’ అని గోపాల కృష్ణ నాకు చెప్పారు. అదొక సార్థక నామం. పాతికేళ్ళకు పైగా ఆ మనీషి మహోదాత్తతకు నేను సాక్షిని. నా పర్సనల్ కంప్యూటర్‌లో ‘ఇ ఎస్ రెడ్డి మెటీరియల్, ఇన్‌స్టాల్‌మెంట్ 1, 2, 3’ అనే పేరుతో మూడు పెద్ద ఫోల్డర్లు ఉన్నాయి. గోపాల్ గాంధీ స్నేహితుడు (ఇప్పుడు నాకూ మంచి మిత్రుడు) అనేక సంవత్సరాలుగా నాకు కానుకగా ఇచ్చిన వందలాది ఫైళ్లు ఆ ఫోల్డర్స్‌లో ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఈ-మెయిల్స్‌ ద్వారా మరికొన్నిటిని సిడిల రూపేణా కొరియర్ ద్వారా ఆయన నాకు పంపారు. నా హితుడు, మిత్రుడు ఉదారంగా ఇచ్చిన ఆ కానుకలలో ఆరు భాషలలోని న్యూస్‌పేపర్లు, మ్యాగజైన్‌లలోని వ్యాసాలు, గాంధీ సహచరులకు సంబంధించిన పదచిత్రాలు, మహాత్ముని మరణానంతరం ప్రచురితమైన ప్రశంసాత్మక, విమర్శనాత్మక రచనలు, ఇంకా మరెన్నో ఉన్నాయి.


గాంధీ సాహిత్య పారంగతుడిగా ప్రపంచ ప్రసిద్ధుడు కాక ముందు ఇ ఎస్ రెడ్డి మరో రంగంలో విశిష్టుడిగా వెలుగొందారు. 1924లో దక్షిణ భారతావనిలోని ఒక స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించిన శ్రీనివాసులురెడ్డి తన వృత్తి జీవితాన్ని న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో గడిపారు. ఆ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలోని జాతి వివక్ష వ్యతిరేక కేంద్రానికి ఆయన నేతృత్వం వహించారు. దక్షిణాఫ్రికాలో భయానక జాత్యహంకార పాలనను రూపుమాపేందుకు, ఆ దేశం వెలుపల అకుంఠిత కృషి చేసిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. ఉద్యోగ విరమణ అనంతరం తన అరవైలలో విద్వత్ వ్యాసంగాలకు ఇ ఎస్ రెడ్డి అంకితమయ్యారు. గాంధీ జీవిత కృషి, ప్రభావం, వారసత్వం పై ఆయన డజన్‌కు పైగా పుస్తకాలు వెలువరించారు. మరో రెండు పుస్తకాలు ప్రచురణ క్రమంలో ఉన్నాయి. గాంధీ జీవిత విశేషాల గురించి, తన వద్ద ఉన్న విషయ సామగ్రిని ఆయన అడిగిన వారందరికీ ఉదారంగా అందుబాటులో ఉంచేవారు. ఇ ఎస్ రెడ్డి నిజంగా చాలా అరుదైన విద్వజ్ఞుడు. గాంధీ అధ్యయనపరులకు తోడ్పడంతో పాటు నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ, యేల్ విశ్వవిద్యాలయం మొదలైన వాటికి వేలాది డాక్యుమెంట్లను బహూకరించారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమానికి మొదటి కంప్యూటర్‌ను ఆయనే సమకూర్చారు. ఆ ఆశ్రమంలోని గాంధీ లేఖలను ఆ కంప్యూటర్ తోనే డిజిటైజ్ చేశారు.


ఇ ఎస్ రెడ్డి కొద్ది రోజుల క్రితం మరణించారు. నాకూ, నా లాంటి గాంధీ అధ్యయనపరులకు ఆయన అందించిన సహాయాన్ని గుర్తు చేసుకోవడమే ఈ వ్యాసం ఉద్దేశం. గాంధీకి సంబంధించిన అపార మౌలిక సమాచారాన్ని పంపించడంతో పాటు తప్పక చదవవలసిన కొన్ని పుస్తకాల గురించి కూడా ఆయన నాకు తెలియజేశారు. దక్షిణాఫ్రికాలో గాంధీ నిర్వహించిన సత్యాగ్రహాలకు ప్రత్యక్ష సాక్షులు అయిన భవాని దయాళ్, రజోభాయి పటేల్ రాసిన పుస్తకాలు వాటిలో చాలా ముఖ్యమైనవి, అరుదైనవి. గాంధీ జీవిత చరిత్ర రచనకు నేను ఉపక్రమించినప్పుడు ఇ ఎస్ రెడ్డి నాకు ఇలా రాశారు: ‘మీరు గాంధీ, యూదుల గురించి ఒక అధ్యాయం రాయాలి. పాశ్చాత్య పండితులు ఈ అంశంపై శ్రద్ధ చూపడం లేదు. లూయీ ఫిషర్ తన గాంధీ జీవిత చరిత్రలో, ‘జర్మనీలోని యూదులు మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవాలి’ అని చేసిన ఉటంకింపే అందుకు కారణం. అరబ్‌లతో స్నేహ సంబంధాలకు కృషి చేసిన యూదు ప్రముఖులు మార్టిన్ బూబర్ జుడా ఎల్ మాగ్నెస్‌కు గాంధీ రాసిన లేఖలను మీకు పంపుతున్నాను’. 


దక్షిణాఫ్రికాలో తన సత్యాగ్రహాల గురించి గాంధీ స్వయంగా ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ప్రస్తావించిన కొన్ని అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఇ ఎస్ రెడ్డి నాకు సూచించారు. 2009లో రాసిన ఒక లేఖలో ఆయన ఇలా పేర్కొన్నారు: ‘దక్షిణాఫ్రికా సత్యాగ్రహాలలో తమిళులు నిర్వహించిన పాత్రకు గాంధీ సముచిత ప్రాధాన్యమివ్వలేదు. గుజరాతీలు, పార్సీల గురించే ఆయన ఎక్కువగా రాశారు. సామాజిక జీవితంలో వారితో ఆయనకు గల అను బంధమే అందుకు కారణమై ఉంటుంది. అయితే గుజరాతీ వ్యాపారులు ఆ సత్యాగ్రహాల నుంచి వైదొలిగినప్పుడు తంబినాయుడు నేతృత్వంలో తమిళులు ఆ సత్యాగ్రహాలు కొనసాగేందుకు విశేషంగా తోడ్పడ్డారు. దక్షిణాఫ్రికా జీవితంలోనే గాంధీ సామాజిక దార్శనికత రూపుదిద్దుకున్నదని ఆయన వ్యాఖ్యానించారు. ‘దక్షిణాఫ్రికాలోని తన అనుభవాల కారణంగానే రైతులు, కార్మికులు, మహిళలకు తన ఉద్యమాలలో భాగస్వాములను చేశారు. వ్యాపారులు ఉద్యమం నుంచి వైదొలగగా అనేక అవస్థల నెదుర్కొంటూ కూడా పేదప్రవాసులు గాంధీని అనుసరించారు. 1913లో గాంధీ మహిళలను సత్యాగ్రహంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు. ఆయన పిలుపునకు ప్రతిస్పందించిన మహిళల సంఖ్య అధికంగా లేనప్పటికీ వారి అంకితభావం ఎంతోమంది మహిళలకు ఆ తరువాత స్ఫూర్తి నిచ్చింది’.


గాంధీ జీవితం, ఉద్యమాలకు సంబంధించి తన దగ్గర ఉన్న అపార సమాచారాన్ని ఆయనపై పరిశోధనలు చేస్తున్నవారందరికీ ఇ ఎస్ రెడ్డి చాలా ఉదారంగా అందుబాటులో ఉంచారు. గాంధీ వ్యక్తిత్వం, స్వభావంపై కూడా ఆయనకు పరిపూర్ణమైన అవగాహన ఉంది. 2011లో నేను రాసిన ఒక వ్యాసంలో గాంధీకి, మన సమకాలిక ‘పవిత్ర’ బాబాలు, గురువుల మధ్య ఉన్న వ్యత్యాసాల గురించి వ్యాఖ్యానించాను. బాబా రామదేవ్ గురించి ప్రస్తావిస్తూ అవినీతికి వ్యతిరేకంగా ఆమరణ దీక్షకు పూనుకున్న ఆయన పోలీసులు వేదిక వద్దకు రాగానే దీక్షను విరమించి వెళ్ళిపోవడం గురించి పేర్కొన్నాను. రాజకీయవేత్త, సామాజిక సంస్కర్త అయిన గాంధీ నైతిక, ఆధ్యాత్మిక జీవితానికి కూడా సమ ప్రాధాన్యమిచ్చాడని రాశాను. అయితే రాజకీయ కార్యకలాపాల వలే నైతిక అన్వేషణలను ఆయన బహిరంగంగా చేయలేదని, తన ఆశ్రమంలో మాత్రమే చేశారని గుర్తుచేశాను. గాంధీ దృష్టిలో ఏకాంతమూ, ఆధ్యాత్మికత కలసికట్టుగా ఉంటాయని పేర్కొన్నాను. ఉద్యమాల మధ్యకాలంలో మహాత్ముడు సబర్మతి, సేవాగ్రాం ఆశ్రమాలలో ఆలోచన, అన్వేషణ, ఆధ్యాత్మిక కార్యకలాపాలలో ఉండేవారని పేర్కొంటూ నేటి బాబాలు, గురువులు ఒక్కరోజుకూడా అలా ఉండరని విమర్శించాను. పోలీసుల ఒత్తిడితో ఢిల్లీ నుంచి నిష్క్రమించిన బాబారామదేవ్ తొలుత హరిద్వార్‌లో దీక్షను ప్రారంభించారు. ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఆయన దీక్షా స్థలిని నోయిడాకు మార్చారు. అనేక టీవీ ఛానెల్స్ ప్రధాన కార్యాలయాలు నోయిడాలో ఉన్న విషయం ఆయనకు బాగా తెలుసు మరి. 


నా వ్యాసాన్ని చదివిన ఇ ఎస్ రెడ్డి ఒక సుదీర్ఘ లేఖ రాశారు. రామదేవ్ లాంటి వారు ప్రచార కండూతిపరులే గానీ ఆధ్యాత్మికవేత్తలు కాదనే అభిప్రాయంతో ఏకీభవించారు. అయితే గాంధీ విషయమై ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేటి బాబాల వలే ప్రచారానికి గాంధీ ఆరాటపడక పోయినప్పటికీ తన ఆలోచనలు, ఆధ్యాత్మిక అనుభవాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు గాంధీ చాలా శ్రద్ధ చూపేవారని ఇ ఎస్ రెడ్డి పేర్కొన్నారు. ‘గాంధీ ఏకాంతంగా ధ్యానం చేసేవారు. అయితే ఆయన మత నిష్ఠ వ్యక్తిగతమైనది కాదు. ఆయన ప్రార్థనా సమావేశాలు బహిరంగంగా జరిగేవి. అన్ని మతాలను ఆయన సమంగా గౌరవించారు. గాంధీ ఆధ్యాత్మికతే రాజకీయాలలో పాల్గొనేలా ఆయన్ని పురిగొల్పింది. సమాజంలోని అన్యాయాలను రూపుమాపడమనేది ఆయనకు ఒక ఆధ్యాత్మిక ప్రేరణ. అరవిందుడి వలే ఆశ్రమ జీవితానికే గాంధీ పరిమితం కాలేదు, తనను అనుసరించమని ప్రజలను ఆయన అడుగలేదు. కాషాయ వస్త్రాలు ధరించలేదు. పేద రైతు వలే వస్త్రధారణ చేశారు. ఆయనకు తన వైఫల్యాలు ఏమిటో బాగా తెలుసు. కనుకనే తనను మహాత్ముడిగా ఆరాధించడాన్ని ఆయన అంగీకరించలేదని ఇ ఎస్ రెడ్డి అన్నారు. 


ఇ ఎస్ రెడ్డితో పరిచయమైన రెండు దశాబ్దాల అనంతరం ఆయన జన్మదినం 1924 జనవరి 1 అని వికీపీడియా ద్వారా తెలుసుకున్నాను. నిజంగా మీ పుట్టినరోజు ఆ తేదీయేనా అని అడిగాను. ఎందుకంటే మా నాన్నగారు కూడా అదే సంవత్సరం, అదే నెల, అదే రోజున జన్మించారు. వికీపీడియా సమాచారాన్ని శ్రీనివాసులురెడ్డి ధ్రువీకరించలేదు. అలా అని నిరాకరించలేదు. ఏమైనా గాంధీ అధ్యయనపరుడిగా నా మేధో ప్రస్థానానికి ‘తండ్రి’గా ఇ ఎస్ రెడ్డిని నేను గౌరవిస్తాను. చాలా మంది ఇతర గాంధీ అధ్యయనవేత్తలకు కూడా ఆయనే స్ఫూర్తి. అమెరికన్ చరిత్రకారులు నికో స్లేట్, ఇయాన్ దేశాయి; దక్షిణాఫ్రికా చరిత్రకారులు ఉమా మెస్తీరీ, కల్పనా హీరాలాల్; భారతీయ చరిత్రకారులు అనీల్ నౌరియా, వేణు మాధవ్ గోవిందు, గోపాల కృష్ణ గాంధీ, త్రిదీప్ సుహృద్ మొదలైన వారి మేధో ప్రస్థానాలకు ఆయన విశేషంగా దోహదం చేశారు. 


కార్యాచరణశీలురు స్వతః న్యాయనిష్ఠాపరులు. ప్రజల పోకడలను వారు తరచు విమర్శిస్తుంటారు. పండితులు స్వార్థపరులు, పదే పదే కాకపోయినా దాపరికంతో వ్యవహరించడం కద్దు. కార్యాచరణవాది, ప్రాజ్ఞుడు అయిన ఎనుగ శ్రీనివాసులు రెడ్డి స్వార్థపరుడూ కాదు, తాను ఆచరించని నీతులను ఉపదేశించేవాడూ కాదు. ఆయనలో ధైర్యసాహసాలు, విజ్ఞతా వివేకాలు దయాదాక్షిణ్యాలు, సత్యవర్తన, సదాచారాలతో చెట్టాపట్టాల్ వేసుకుని మంచితనానికి ఒరవడి అవుతున్నాయి. నాకు తెలిసిన మహోన్నత మానవుడు ఇ ఎస్ రెడ్డి. స్వార్థరాహిత్యానికి ఆయన ఒక దృష్టాంతం. ఆయన వారసత్వం అజరామరమైనది. 





రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2020-11-07T06:26:02+05:30 IST