బలివే తమ్మిలేరుపై హై లెవల్‌ బ్రిడ్జి నిర్మాణం జరిగేనా?

ABN , First Publish Date - 2022-09-21T05:56:11+05:30 IST

బలివే తమ్మిలేరుపై హై లెవల్‌ బ్రిడ్జి నిర్మిస్తామని ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నీటిపై రాతల్లా మారాయి.

బలివే తమ్మిలేరుపై హై లెవల్‌  బ్రిడ్జి నిర్మాణం జరిగేనా?
వరద ఉధృతికి కొట్టుకుపోయిన తాత్కాలిక రహదారి

 ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చి మూడేళ్ళు

 టీడీపీ హయాంలో భూ సేకరణకు నిధులు

 రివర్స్‌ టెండరింగ్‌తో నిలిచిన  నిర్మాణ ప్రక్రియ

 బ్రిడ్జి నిర్మాణానికి కలెక్టర్‌కు గ్రామస్థుల వినతి


ముసునూరు, సెప్టెంబరు 20: బలివే తమ్మిలేరుపై హై లెవల్‌ బ్రిడ్జి నిర్మిస్తామని ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నీటిపై రాతల్లా మారాయి.  అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించకపోవటంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమౌతోంది. బలివే నుంచి విజయరాయి వెళ్ళేందుకు తమ్మిలేరులో తాత్కాలిక రహదారి ఉండేది. అయితే ప్రతి ఏటా వర్షాకాలంలో తమ్మిలేరుకు వరద రావటం, ఈ రహదారి కొట్టుకు పోవటం జరుగుతోంది. దీంతో నెలల తరబడి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పంచాయతీ ఆధ్వర్యంలో లక్షలాది రూపాయలు  ఖర్చుచేసి రహదారిని పునరుద్ధరించటం, మరలా వరద ఉధృతికి కొట్టుకుపోటం అనవాయితీగా మారింది. ప్రతి ఏటా లక్షల్లో ప్రజాధనం వృథా అవటంతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో నేటి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌, నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు బ్రిడ్జి నిర్మాణాన్ని ఏడాదిలోపే పూర్తిచేస్తామన్న  హామీ  మరిచా రనే విమర్శ లు వ్యక్తమౌతున్నాయి. అయితే ప్రజల ఇబ్బందులకు గుర్తించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం  2017లో బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన టెండర్‌ ప్రక్రియను పూర్తిచేసి, భూ సేకరణకు రూ. 90లక్షల నిధులను విడుదల చేసింది. విజయరాయి, బలివే గ్రామాల వైపు భూసేకరణ ప్రక్రియను సంబంధిత అధికారులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో గత ప్రభుత్వం టెండర్లన్నీ రద్దు చేయటంతో నేటికీ బ్రిడ్జి నిర్మాణానికి పునాది పడలేదు. వైసీపీ  అనాలోచిత నిర్ణయం వల్లే ఈ దుస్థితి నెలకొందని వాహనదారులు, ప్రజలు మండిపడు తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

 

కలెక్టర్‌కు అర్జీ


బలివే తమ్మిలేరుపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి నిర్మాణాన్ని ప్రారంభించాలని వైసీపీ నాయకుడు, సర్పంచ్‌ భర్త రావు సుధాకర్‌ ఆధ్వర్యంలో  స్థానికులు సోమవారం నూజివీడులో జరిగిన స్పందనలో కలెక్టర్‌  ప్రసన్న వెంకటేశ్‌కు ఆర్జీ ఇచ్చారు. ఏలూరును జిల్లాగా ఏర్పాటు చేసిన నేపధ్యంలో ప్రజల రాకపోకలకు బలివే తమ్మిలేరు నుంచి అతిదగ్గర దారి అని, అలాగే దక్షిణ కాశీగా పిలువబడే బలివే రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఐదురోజులు పాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల్లో భక్తులు వస్తారని కలెక్టర్‌కు వివరించారు. తమ్మిలేరులో తాత్కా లిక రహదారి వద్ద తొక్కిసలాట జరుగుతుండటంతో భక్తులు నరకం చూస్తున్నారని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి నిర్మించాలని  కోరారు. జిల్లా కలెక్టర్‌ చొరవతోనైన తమ్మిలేరుపై బ్రిడ్జి నిర్మాణానికి అంకురార్పణ జరుగుతుందో.. లేదో వేచి చూడాలి. 


ప్రతిపాదనలు పంపాం


 దీనిపై తమ్మిలేరు ఏలూరు జిల్లా జేఈ త్రిసిల్లాను వివరణ కోరగా బలివే తమ్మిలేరుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ. 16 కోట్లు  అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని నిధులు మంజూరు కాగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 



Updated Date - 2022-09-21T05:56:11+05:30 IST