హ్యాండిల్‌ చేసేదెవరు?

ABN , First Publish Date - 2021-09-29T06:41:21+05:30 IST

ఆ మూడుచోట్ల సైకిల్‌ సారథి కోసం అన్వేషిస్తున్నారు.

హ్యాండిల్‌ చేసేదెవరు?

కన్వీనర్ల పదవులకు టీడీపీ నాయకుల్లో పోటా పోటీ

చింతలపూడిలో చిక్కులు.. కొత్త కమిటీ వైపు అధిష్ఠానం చూపు

కొవ్వూరులో కథే వేరు.. జవహర్‌కు చోటెక్కడంటూ సస్పెన్స్‌

సైకిల్‌ చుట్టూ సరికొత్త రాజకీయాలు


ఆ మూడుచోట్ల సైకిల్‌ సారథి కోసం అన్వేషిస్తున్నారు. నడిపేందుకు మేము రెడీ అంటూ తెలుగుదేశంలో సీనియర్లు, జూనియర్లు ఎక్కువ మందే పోటీ పడుతున్నారు. రిజర్వుడు నియోజకవర్గాలైన చింతలపూడి, కొవ్వూరు నియోజకవర్గాల్లో కన్వీనర్‌ పదవుల విషయంలో ఏదో తేల్చాలని అధిష్ఠానం ముందడుగేస్తోంది. గోపాలపురంలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేస్తున్నా.. ఇక్కడా సరికొత్త సీను సృష్టించవచ్చంటూ అధిష్ఠానానికి ఇంకొందరు సిఫార్సులు చేస్తున్నారు. కొద్ది మాసాలుగా సాగుతున్న ఈ పదవుల పోటీపై మరికొద్దిరోజుల్లో తెరదించడా నికి తెలుగుదేశం అధిష్ఠానం సిద్ధంగా ఉంది. 

            – (ఏలూరు–ఆంధ్రజ్యోతి)


తెలుగుదేశం పార్టీకి పెట్టనికోట చింతలపూడి. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు సరికొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గ కన్వీనర్‌ పదవి కోసం సీనియర్లు, జూనియర్లు పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీని కన్వీనర్‌ చేసి ఆయన నాయకత్వంలోనే కొన్నాళ్లపాటు ఇక్కడ పార్టీ కార్యక్రమాలను వేగిరపర్చి, నిలదొక్కుకునేలా చేయాలనేది ఒక వ్యూహం. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ఓసీకి చెందిన నేతలకు సారథ్యం ఎలా అప్పగిస్తారని కొత్త ప్రశ్న. కొన్నాళ్ళ క్రితం నరసాపురానికి కన్వీనర్‌ను ప్రకటించిన తరుణంలోనే చింతలపూడికి మురళీ పేరును వెల్లడిం చాలనుకున్నారు. కానీ వాయిదాపడింది. తాజాగా మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ జడ్పీ ఛైర్మన్‌ కొక్కిరిగడ్డ జయరాజు, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌, ఎన్‌ఆర్‌ఐ రోషన్‌కుమార్‌, ట్రాక్టర్ల కంపెనీ ఏజెన్సీ అధినేత రామారావు కన్వీనర్‌ పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కన్వీనర్‌ పదవి దక్కేలా తమకు మద్దతు ఇవ్వాలని, తనకు అన్ని విధాలా అర్హత ఉందని, తగిన అనుభవం ఉందని మాజీ మంత్రి సుజాత పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. చానాళ్లుగా ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టిన జయరాజు ఇదే బాటలో పయనిస్తున్నారు. తనకు మద్దతు ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు సహా పలువురు సీనియర్లను కలిసి అభ్యర్థిస్తున్నారు. కొవ్వూరు స్థానాన్ని ఆశిస్తున్న మాజీ మంత్రి జవహర్‌ను చింతలపూడికి పంపిస్తే ఎలా ఉంటుందంటూ ప్రచారం సాగింది. తనను కొవ్వూరు కాదని తిరువూరులో పోటీకి దింపినప్పుడు ఎదురైన అనుభవాలను జవహర్‌ గుర్తు చేస్తున్నారు. దీనికి బదులుగా సుజాతను లేదా మరొకరిని కొవ్వూరులో పోటీకి వీలుగా పంపితే ఎలా ఉంటుందనే దానిపైన పార్టీలో చర్చ సాగింది. చింతలపూడిలో చిక్కుముడి విప్పేందుకు మురళి సారధ్యాన కొత్త కమిటీ కొన్నాళ్ళపాటు కొనసాగలన్నదే అధిష్ఠానం ఆలోచనగా కనిపిస్తోంది. లేదంటే కన్వీనర్‌ పదవి ఆశిస్తున్న మిగతా వారి పేర్లను పరిగణనలోకి తీసుకుని రాబోయే పక్షం రోజుల్లో అటో ఇటో తేల్చబోతున్నారు. 


కొవ్వూరులో కథే వేరు 


సాధారణ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కొవ్వూరు తెలుగుదేశంలో అంతర్గత విభేదాలు, వర్గ పోరు కొనసాగుతూనే ఉన్నాయి. మాజీ మంత్రి జవహర్‌, సీనియర్‌ నేత అచ్చిబాబు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీ నేతలు చీలిపోయారు. ఈ రెండు శిబిరాలు పోటాపోటీగా అన్ని విషయాల్లోనూ ముందుంటున్నారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వివిధ ఆందోళన కార్యక్రమాల్లోనూ అందరూ ఉమ్మడిగా కాకుండా వేర్వేరుగా పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొనడంతో అప్పట్లో మాజీ మంత్రి జవహర్‌ను ఆయన సొంత నియోజకవర్గమైన తిరువూరు నుంచి పోటీ చేయించారు. అయినప్పటికీ పార్టీ కొత్త ముఖాన్ని ఇక్కడకు రప్పించి పోటీకి నిలిపినా ఫలితం దక్కలేదు. పరిస్థితిలో మార్పు రాకపోగా విభేదాలు ముదురుతూ వచ్చాయి. ఇప్పుడు కొవ్వూరులో పార్టీ పరిస్థితిని చక్కబెట్టేందుకు అధిష్ఠానం పావులు కదుపుతోంది. పార్టీకి నష్టదాయకం కాకుండా కార్యకర్తలు, మిగతా నేతలు ఉమ్మడిగా ముందుకు సాగేందుకు వీలుగా ద్విసభ్య కమిటీని ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. ఇప్పుడెలాగూ జవహర్‌ రాజమహేంద్రవరం పార్లమెంటరీ స్థానం అధ్యక్షుడిగా  ఉన్నారు. కేవలం కొవ్వూరు కన్వీనర్‌ ఆయనకు అప్పగించవద్దంటూ కొందరు.. కాదు కట్టబెట్టేల్సాందేనని మరికొందరు పట్టుబడుతున్నారు. పార్టీ అధిష్ఠానం మాత్రం మధ్యే మార్గంగా ద్విసభ్య కమిటీని తెర ముందుకు తెచ్చింది. ఈ కమిటీయే పార్టీ కార్యక్రమాలను భవిష్యత్తులో నిర్దేశించాల్సి ఉన్నందున నియోజక వర్గంపై ఎవరి ప్రభావం ఉండదని అధిష్ఠానం విశ్వాసంతో ఉంది. కొవ్వూరు నుంచి జవహర్‌ను చింతలపూడికి కాని, గోపాలపురం నియోజకవర్గానికి కాని పోటీ చేసేందుకు ప్రతిపాదించాలనే డిమాండ్‌ పెరుగుతోంది. అన్ని విధాలా సమర్ధుడైన జవహర్‌కే పట్టం కట్టాలని భావిస్తున్నా ఆయన వైఖరితో అసంతృప్తితో ఉన్న మిగతావారు మాత్రం దీనికి అంగీకరించడం లేదు. 


గోపాలపురం సంగతేంటి..


గోపాలపురం నియోజకవర్గంలో ముప్పిడి వెంకటేశ్వరరావు పార్టీ కన్వీనర్‌గా ఇప్పటికే సక్సెస్‌ ఫుల్‌గా వ్యవహరిస్తున్నారు. పార్టీలో కొందరు మాత్రం వీలు చిక్కినప్పుడల్లా ఫలానా నాయకుడిని గోపాలపురం నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందంటూ కొత్త ప్రచారాలకు దిగుతున్నారు. సాఫీగా సాగుతున్న ఈ నియోజక వర్గంలో మరోసారి విఘాతం కల్గించకుండా వెంకటేశ్వరరావు యఽథావిధిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునేలా చూడాలన్నది దాదాపు అందరి వాదన. ఈ నియోజకవర్గం కూడా రిజర్వుడు స్థానమే. ముందు కొవ్వూరు, చింతలపూడి స్థానాల వ్యవహారాన్ని తేల్చేస్తే గోపాలపురానికి ప్రశాంతత లభిస్తుందని పార్టీ నేతలు అధిష్ఠానం దృష్టికి తెచ్చారు.

Updated Date - 2021-09-29T06:41:21+05:30 IST