అర గ్లాసుతో అదరగొట్టింది!

ABN , First Publish Date - 2020-07-13T05:30:00+05:30 IST

ఒక హోటల్లోగానీ, రెస్టారెంట్‌లోగానీ మనం గ్లాసులో సగం నీళ్లు తాగి వదిలేయడం వల్ల వృథా అయ్యే నీరు ఏడాదికి అక్షరాలా ఒక కోటీ 40 లక్షల లీటర్లు...ఐదేళ్ల క్రితం... ఈ సాధారణ లెక్క ఆ అమ్మాయిని ఆలోచనల్లో పడేసింది. దాంతో ‘వై వేస్ట్‌?’ అనే ఫౌండేషన్‌ ఏర్పాటుచేసి, నీటి వృథాను అరికట్టే దిశగా అడుగులు వేసింది...

అర గ్లాసుతో అదరగొట్టింది!

ఒక హోటల్లోగానీ, రెస్టారెంట్‌లోగానీ మనం  గ్లాసులో సగం నీళ్లు తాగి వదిలేయడం వల్ల వృథా అయ్యే నీరు ఏడాదికి అక్షరాలా ఒక కోటీ 40 లక్షల లీటర్లు...ఐదేళ్ల క్రితం... ఈ సాధారణ లెక్క ఆ అమ్మాయిని ఆలోచనల్లో పడేసింది. దాంతో ‘వై వేస్ట్‌?’ అనే ఫౌండేషన్‌ ఏర్పాటుచేసి,  నీటి వృథాను అరికట్టే దిశగా అడుగులు వేసింది. ‘గ్లాస్‌ హాఫ్‌ ఫుల్‌’ వంటి చిన్న చిన్న ఆలోచనలతో సమాజంలో పెద్ద మార్పు తెస్తున్న గర్వితా గులాటీ ‘ఛేంజ్‌మేకర్‌’గా నిలిచింది.  తాజాగా ప్రతిష్ఠాత్మకమైన ‘డయానా అవార్డు’ను సాధించింది. ఈ ఇంజనీరింగ్‌ విద్యార్థిని చేసిన వినూత్న ఆలోచన  ఆమె మాటల్లోనే...


‘‘నేను ప్రస్తుతం బెంగళూరులోని ‘పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ యూనివర్శిటీ’లో ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నా. మా నాన్న అరవింద్‌ ‘ఒరాకిల్‌’లో పనిచేస్తారు. అమ్మ ప్రీతి ఇంతకుముందు ఎంట్రప్రెన్యూర్‌గా ఉండేది. నాకొక తమ్ముడున్నాడు... పేరు రుద్రాక్ష్‌. మాదొక అందమైన చింతల్లేని చిన్న కుటుంబం. సమాజం పట్ల బాధ్యతగా ఉండాలనే విషయాన్ని నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే నాకు నూరిపోశారు. మా పుట్టినరోజు వేడుకలను కూడా అనాథాశ్రమాల్లోనే చేసుకునేవాళ్లం. సమాజం నుంచి తీసుకోవడమే కాదు... సమాజానికి తిరిగి ఎంతో కొంత ఇవ్వాల్సి ఉంటుందనేవారు మా నాన్న. మా అమ్మయితే ఆహారం వృథా చేయడాన్ని అస్సలు ఇష్టపడేది కాదు. ఎంత కావాలో అంతే ప్లేట్‌లో వడ్డించేది. ఆ విధంగా తల్లిదండ్రుల ద్వారా సమాజసేవపై నాకు చిన్నప్పుడే ఆసక్తి ఏర్పడింది.




టీచర్‌ మాటలతో...

2015లో మహారాష్ట్రతో పాటు బెంగళూరులో కూడా వర్షాలు లేక విపరీతమైన కరవు నెలకొంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే వార్తలు చదివాను. మా ఇంట్లో సింపుల్‌గా కుళాయి తిప్పగానే నీళ్లు వస్తుంటే... మా ఇంటి వెనుక ఉండే ఒక మహిళ మాత్రం మంచినీళ్ల కోసం బిందె పట్టుకుని కొన్ని మైళ్ల దూరం వెళ్లడం చూశాను. అదే సమయంలో కనీసం తాగేందుకు మంచినీళ్లు దొరకని పసిపిల్లలు సుమారుగా 10 కోట్ల మంది ఉన్నారని, వారిలో చాలామంది మరణిస్తున్నారని ఒక రిపోర్టు చదివాను. ఒకవైపు మనమంతా రోజూ నీటిని వృథా చేస్తుంటే, మరోవైపు వాస్తవ పరిస్థితి ఇంత దారుణంగా ఉండటం నన్ను సీరియస్‌గా ఆలోచనల్లో పడేసింది. అయితే నా ప్రయత్నాన్ని ఎక్కడ, ఎలా మొదలెట్టాలనే దానిపై నాకు క్లారిటీ మాత్రం లేదు. అదే ఏడాది ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ సందర్భంగా కె.ఎన్‌. పూర్ణిమ అనే మా సైన్స్‌ టీచర్‌ ఒక ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అందులో ‘రెస్టారెంట్లలో మన ముందు పెట్టిన గ్లాసుల్లో సగం నీళ్లు తాగి వృథాగా వదిలేస్తున్న నీరు కోటీ 40 లక్షల లీటర్లు’ అనే వాక్యం నన్ను ఆకట్టుకుంది.


నీటిని మనం 100 రకాలుగా వృథా చేస్తుంటే అందులో ఇదొకటని అర్థమైంది. అప్పుడు నాకు 15 ఏళ్లుంటాయి. ఆ వయసులోనే నా వంతుగా తాగునీటి వృథాను అరికట్టేందుకు ప్రయత్నించాలనుకున్నా. ఆ సమయంలో నాకు తట్టిన రెండు ఆలోచనలను కొంతమందితో పంచుకున్నా. వాటిలో ఒకటి... రెస్టారెంట్లలోని టేబుల్‌ మీద గ్లాసు నిండా నీటిని నింపి పెట్టే బదులు... ఒక జగ్గులో పెడితే కస్టమర్లు వారికి అవసరమైనన్ని నీళ్లు ఖాళీ గ్లాసులో పోసుకుంటారు కదా అని. రెండోది...  గ్లాసుల్లో నీళ్లు ఎంత దాకా పోయాలో కస్టమర్లనే అడిగితే సరిపోతుంది కదా. అయితే ఈ రెండు ఆలోచనలను అంతా నెగిటివ్‌గానే తీసుకున్నారు. ‘మేము అతిథ్య రంగంలో ఉన్నాం. కస్టమర్లను ఇలాంటి చర్యలతో ఇబ్బందిపెట్టలేం. నువ్వు కూడా సమయం వృథా చేసుకోకుండా బుద్ధిగా చదువుకో’ అంటూ సలహాలిచ్చారు. అయినప్పటికీ నా ఆలోచనలు మాత్రం ఆగిపోలేదు. ఆ తర్వాత రెండేళ్లకు సరికొత్త ఆలోచనతో ముందుకెళ్లా.  


‘గ్లాస్‌ హాఫ్‌ ఫుల్‌’... ఇన్‌స్టంట్‌ క్లిక్‌...

హోటళ్లు, రెస్టారెంట్లలో గ్లాసు నిండా నీళ్లు పోయకుండా, సగం వరకు నింపడమే ‘గ్లాస్‌ హాఫ్‌ ఫుల్‌’. ఈ ప్రయత్నం వల్ల కనీసం సగం గ్లాసు నీళ్లు వృథా కావు. నీటి వృథా గురించి అవగాహన పెంచుతూ ఈ పనిచేయడం వల్ల ఫలితాలుంటాయనే విషయాన్ని నేను పలు ఈ మెయిల్స్‌ ద్వారా ‘నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ (ఎన్‌హెచ్‌ఆర్‌ఎ)కు తెలిపా. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 5 లక్షల రెస్టారెంట్లు ఈ ఆలోచన పాటిస్తే మార్పు వస్తుందనే నా అభిప్రాయం బాగుందంటూ కొందరు మార్కెటింగ్‌ హెడ్స్‌ తమ పూర్తి సహకారాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు. చాలా సంప్రదింపులు, చర్చలు జరిగిన తర్వాత గత ఏడాది ‘ప్రపంచ నీటి దినోత్సవం’ (మార్చి 22) సందర్భంగా ‘గ్లాస్‌ హాఫ్‌ ఫుల్‌’కు ఆమోదం లభించింది.

ఈ క్యాంపెయిన్‌ను విస్తృతపరిచేందుకు మొదట్లో నా స్నేహితులతో కలిసి నేను బెంగళూరులోని కొన్ని రెస్టారెంట్లను సందర్శించి, ‘గ్లాస్‌ హాఫ్‌ ఫుల్‌’ ఆలోచన చెప్పేదాన్ని. కస్టమర్లు కూడా నా ఆలోచనను మెచ్చుకునేవారు. క్రమక్రమంగా స్కూళ్లు, కుర్రకారులో కూడా ఇది వైరల్‌ అయ్యేలా చేయగలిగాం. రెస్టారెంట్ల టేబుళ్లపై నీటి ప్రాధాన్యాన్ని తెలుపుతూ టేబుల్‌ క్యాలెండర్లు పెట్టేవాళ్లం. అలా అలా మన దేశంలోనేగాక ఒమన్‌, ఫిలిప్పీన్స్‌, యూరోప్‌, దక్షిణాఫ్రికాకు కూడా ఈ క్యాంపెయిన్‌ విజయవంతంగా వెళ్లింది.




అవార్డు ఆనందాన్నిచ్చింది...

ప్రిన్సెస్‌ డయానా అంతర్జాతీయ సమాజానికి ఉపయోగపడే ఆలోచనలను ఎంతగానో ప్రోత్సహించేవారు. యువతరం ద్వారానే ఈ ప్రపంచం అభివృద్ధి చెందుతుందని ఆమె నమ్మేవారు. అందుకే యువతను ‘ఛేంజ్‌మేకర్స్‌’గా ప్రకటిస్తూ ‘ది డయానా అవార్డు’ను ఇస్తారు. ఈ ఏడాది నాకు ఆ అవార్డు రావడం ఆనందాన్నిచ్చింది. నా ప్రయత్నాలకు తగ్గ ఫలితం దక్కిందని అనుకుంటున్నా. ఇప్పటికే ‘వై వేస్ట్‌’ ఫౌండేషన్‌ను ఏర్పాటుచేసి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. 2018లో ‘అశోకా యంగ్‌ ఛేంజ్‌మేకర్స్‌’లో భాగస్వామినయ్యా. ఇందులో భాగంగా మన దేశంలోని 800 పాఠశాలల్లోని 20 లక్షలకు పైగా విద్యార్థులకు నీటి సంరక్షణకు సంబంధించి చర్చలు పెట్టి, వారి నుంచి సృజనాత్మక ఆలోచనలను వెలుగులోకి తెచ్చాం. భవిష్యత్తులో వాతావరణ మార్పులపై కూడా దృష్టి సారించాలనుకుంటున్నా. నాకు టెక్నాలజీతో పాటు పర్యావరణంపై ఆసక్తి ఉంది. టెక్నాలజీని సరైన రీతిలో ఉపయోగించుకుంటే ఈ భూమ్మీద అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందనేది నా అభిప్రాయం. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలనుకుంటున్నా.’’


విద్యార్థి దశలోనే...

ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి మధ్యలో పిల్లలు నేర్చుకునేది చాలా ఉంటుంది. ప్రతీ స్కూల్‌ అసెంబ్లీలో ఐదు నిమిషాల పాటు ఒక ‘ఛేంజ్‌ మేకర్‌’ కథ వినిపించాలి. అలాగే చాలామంది పిల్లల్లో చిన్న చిన్న విషయాల పట్ల, కొన్ని సృజనాత్మక ఆలోచనలు ఉంటాయి. కానీ వాటిని బయటపెట్టే అవకాశం వారికి రాదు. ‘అశోకా యంగ్‌ ఛేంజ్‌మేకర్‌’ ద్వారా అలాంటివారికి అవకాశాలు కల్పిస్తున్నాం. నీటి వృథా గురించి పిల్లలకు చిన్నప్పుడే అవగాహన కల్పిస్తే భావితరాలకు నీటి సమస్య రాకుండా ఉంటుంది. దీనికి సంబంధించి వారి కోసం ఒక కథల పుస్తకం తీసుకురావడం, ‘ప్రతీరోజూ 100 లీటర్ల నీటిని సంరక్షించడం ఎలా?’ అనే అంశంపై టిప్స్‌తో కూడిన ఒక మొబైల్‌ యాప్‌ను కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.


Updated Date - 2020-07-13T05:30:00+05:30 IST