Abn logo
Jun 29 2020 @ 00:00AM

పుష్పిత... పేరు కాదు బ్రాండ్‌!

బాంబూ షూట్స్‌, భూత్‌ జొలొకియా, బొగోరీ, నాగా చిల్లీ... ఇవీ పుష్పితా సిన్హా తయారుచేసే పచ్చళ్లలో కొన్ని. వీటితో పాటు సాస్‌, ప్రిజెర్వేటివ్స్‌ కూడా ‘పుష్పితాస్‌’ బ్రాండ్‌తో నోరూరిస్తాయి. కేన్సర్‌ నుంచి బయటపడి, ఒక వ్యాపారవేత్తగా ఈశాన్య రాష్ట్రాల రుచులను దేశవ్యాప్తంగా పరిచయం చేయాలనుకుంటున్న పుష్పిత ప్రయోగాల జర్నీ ఇది. 


ఈశాన్య రాష్ట్రాల్లో సహజంగానే పరిమళాలు వెదజల్లే అనేక పదార్థాలు లభిస్తాయి. వాటితో చేసే రుచులు ప్రత్యేకం. మణిపూర్‌కు చెందిన 39 ఏళ్ల పుష్పితా సిన్హాకు వాటి రుచులు బాగా తెలుసు. త్రిపురలో ఇంటర్‌ పూర్తయిన తర్వాత ఆమె ముంబైలోని ‘శ్రీమతి నథీభాయ్‌ దామోదర్‌ థాకరే’ (ఎస్‌ఎన్‌డీటీ) మహిళా విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్‌లో (2002) డిగ్రీ చేశారు. ఆ తర్వాత ‘ఎకనామెట్రిక్స్‌’లో మాస్టర్స్‌ చేయాలనుకున్నా, అక్కడ సబ్జెక్ట్‌ లేకపోవడంతో తిరిగి త్రిపురకు వెళ్లారు. ఆగర్తాలాలో ఉండి పోటీపరీక్షలకు సిద్ధమవుతుండగా 2005లో పెళ్లయ్యింది. దాంతో చదువుకు స్వస్తి చెప్పి, భర్తతో కలిసి ముంబైకి వెళ్లారు. సాధారణ గృహిణిగా కాకుండా ఏదైనా ఉత్సాహం నింపే పని చేయాలనే కోరిక ఆమెలో బలంగా ఉండేది. రకరకాల ప్రయత్నాలు మొదలెట్టారు. ప్రయత్నం ఫలించి 2006లో ఒక ప్రముఖ బిజినెస్‌ ఛానెల్‌లో మార్కెట్‌ ఎనలిస్ట్‌గా అవకాశం వచ్చింది. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి ఇచ్చింది. సరిగ్గా అదే సమయంలో తాను ఒక బిడ్డకు తల్లికాబోతున్నాననే విషయం తెలిసింది. దాంతో ఉద్యోగంపై ఆశ వదులుకున్నారామె. మూడేళ్లదాకా బిడ్డ ఆలనాపాలనతోనే సరిపోయింది. కానీ ఏదో చేయాలనే పట్టుదలను మాత్రం వదులుకోలేదు. 2010లో పుణేలోని ‘ఎస్‌ఎన్‌డీటీ’లో ఎకనామిక్స్‌లో మాస్టర్స్‌ చేశారు. ఆ తర్వాత ఒక కెనడా పబ్లిషింగ్‌ హౌస్‌కు కంటెంట్‌ రైటర్‌గా పనిచేశారు. అందులో భాగంగా ఎకనామిక్స్‌, ఫారిన్‌ ఎక్ఛేంజ్‌, లైఫ్‌స్టయిల్‌... తదితర అంశాలపై ఆర్టికల్స్‌ రాసేవారు. ‘‘మా ఎడిటర్‌ నన్ను బాగా ప్రోత్సహించేవారు. దాంతో నేను ఫుడ్‌ బ్లాగ్‌లో మణిపూర్‌, ఇతర ఈశాన్య రాష్ట్రాల వంటకాలను హైలెట్‌ చేసేదాన్ని’’ అన్నారు పుష్పిత. 


వంటకాలపై ప్రత్యేక ఆసక్తి ఉన్న పుష్పిత అప్పటిదాకా ఫుడ్‌ బ్లాగుల్లో రాస్తున్నవారంతా స్థానిక వంటలను సరిగా విశ్లేషించడం లేదని గ్రహించారు. ‘‘ఈశాన్య వంటకాలపై చాలామందికి సరైన అవగాహన కూడా లేదని నాకు అర్థమైంది. రాసిన విషయాన్నే తిరిగి రాసేవారు. ఇక్కడి రుచులను, స్థానిక పదార్థాలను లోతుగా విశ్లేషిస్తే బాగుంటుందనిపించి 2014లో నా బ్లాగ్‌ను ప్రారంభించా’’ అని గుర్తుచేసుకున్నారామె.బ్రెస్ట్‌ కేన్సర్‌ భయపెట్టినా..

వంటగదిలో చేసే ప్రయోగాలను పుష్పిత బ్లాగ్‌లో పెట్టడమేగాక, తన స్నేహితులకు కూడా వాటిని పంపేవారు. ముఖ్యంగా క్యారెట్‌, ముల్లంగి, రొయ్యలు, చికెన్‌తో తయారుచేసిన రకరకాల పచ్చళ్ల శాంపిళ్లను ఒడిశాలో ఉన్న తోటి బ్లాగర్స్‌కు పంపేవారు. వాటి రుచులు చూసి ఫిదా అయిన వారంతా వ్యాపారం మొదలెట్టాల్సిందిగా ప్రోత్సహించారు. దాంతో ఆమెలో ఉత్సాహం ఉరకలేసింది. కానీ మరోసారి విధి ఆమెపై పగపట్టింది. 2017 సెప్టెంబర్‌లో పుష్పిత బ్రెస్ట్‌ కేన్సర్‌ బారిన పడ్డట్టుగా వైద్య పరీక్షల్లో తేలింది. ‘‘ఆ సమయంలో మావారికి పుణే ట్రాన్‌ఫర్‌ కావడంతో అక్కడే ఉంటున్నాం. చికిత్సలో భాగంగా అక్టోబర్‌ 5న మొదటి కీమోథెరపీ ప్రారంభమైంది. మూడు వారాలకు ఒకసారి సెషన్‌ పూర్తయిన తర్వాత 2018 జనవరిలో సర్జరీ చేశారు. కొన్ని టెస్టుల తర్వాత ఆశ్చర్యంగా నేను గర్భంతో ఉన్నట్టు డాక్టర్‌ చెప్పారు. మే 30న నేను రెండో బిడ్డకు జన్మనిచ్చాను. అక్టోబర్‌లో చికిత్స పూర్తయిన వెంటనే నేను తిరిగి వ్యాపారం పనుల్లో బిజీ అయ్యాను’’ అన్నారామె. కొత్తరకం పచ్చళ్లకు శ్రీకారం ..

కేన్సర్‌కు భయపడి తన ప్రయత్నం విరమించుకుంటే జీవితంలో ఓడిపోయినట్టేనని భావించిన పుష్పిత కొత్తరకం పచ్చళ్లకు శ్రీకారం చుట్టారు. అప్పటికే ఆమెకు ఆన్‌లైన్‌లో ఆర్డర్లు రావడం మొదలయ్యింది. 2018లో పచ్చళ్లకు ఆర్డర్లు తీసుకున్నప్పటికీ, ఆ మరుసటి ఏడాది ‘పుష్పితాస్‌’ పేరిట ఒక బ్రాండ్‌ను క్రియేట్‌ చేసి 100 శాతం నేచురల్‌ పచ్చళ్లు, జామ్‌లు అమ్మడం మొదలెట్టారు. బాంబూ షూట్‌, భూత్‌ జొలొకియా, నాగా చిల్లీ, బొగోరీలతో పాటు రొయ్యలు, చేపలు, చికెన్‌, పోర్క్‌తో నాన్‌వెజ్‌ పచ్చళ్లు కూడా చేస్తారు. ఆ తర్వాత నెమ్మదినెమ్మదిగా బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, యాపిల్‌, పైనాపిల్‌, రాస్‌బెర్రీ, మల్‌బెర్రీ, బ్లాక్‌బెర్రీలతో సుమారు 25 ఉత్పత్తులను తన లిస్టులో ఉంచారు. వీటికి సంబంధించిన పంటను ఆమె 12 మంది రైతుల దగ్గరి నుంచి సేకరిస్తారు. పుణేలో ఉంటున్నప్పటికీ ఈశాన్య రాష్ట్రాల నుంచి తనకు కావాల్సిన వాటిని రైతుల నుంచి తెప్పించుకుంటారు. వాటిని రెండు రోజులు శుభ్రంగా కడిగి, ఎండబెట్టి ఆ తర్వాత వాటిని పచ్చళ్లు పెడతారు. ‘‘ప్రతీ పచ్చడిని నేనే కలుపుతాను. నాకొక సహాయకురాలు మాత్రమే ఉంటుంది. పచ్చళ్లు కలిపిన తర్వాత రెండువారాలు ఆగి, వాటిని చిన్న చిన్న గాజు సీసాల్లోకి నింపుతా’’ అన్నారు పుష్పిత.


పచ్చళ్లు, సాస్‌ల అమ్మకాలకు ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ’ లైసెన్స్‌ దగ్గరి నుంచి సీసాల డిజైన్‌, లేబుల్స్‌, ఫొటో షూట్‌ వరకూ అన్నీ తానే చూసుకుంటారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా ఆమె అమ్మకాలు సాగిస్తున్నారు. త్వరలో రిటైల్‌ స్టోర్స్‌లో కూడా ‘పుష్పాస్‌’ బ్రాండ్‌ పచ్చళ్లను అమ్మేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే త్రిపురలో చిన్న పరిశ్రమను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ‘‘నేను ఈ వ్యాపారం ఎందుకు మొదలెట్టానంటే.. ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక రుచులను దేశవ్యాప్తంగా చూపాలనే. నా ఉత్పత్తుల ద్వారా ఈశాన్య ప్రాంతానికి ఒక గుర్తింపు రావాలని కోరుకుంటున్నా. అలాగే ప్రతీ మహిళా పాజిటివ్‌ దృక్పథంతో ఆర్థిక స్వావలంబనను కలిగి ఉంటే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనగలదని బలంగా నమ్ముతున్నా’’ అంటున్న పుష్పిత కేన్సర్‌ను జయించే దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు.      


Advertisement
Advertisement
Advertisement